Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీని వెంటాడుతున్న పోలికల భయం!

ఇక్కడే మరో ఆసక్తికర అంశం కనిపిస్తోంది. గతంలో ఇలాంటి డిస్క‌ష‌న్స్ సినిమా రిలీజ‌య్యాక మొదలయ్యేవి. ఇప్పుడు మాత్రం షూటింగ్ దశలోనే ప్రాజెక్టులు ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   24 Jun 2026 5:00 AM IST
ఇండస్ట్రీని వెంటాడుతున్న పోలికల భయం!
X

సినీ పరిశ్రమలో ఒకప్పుడు కథ కాపీ వివాదాలే ఎక్కువగా చర్చకు వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. పూర్తి కథ ఒకటే కాకపోయినా, ఒక యాక్షన్ బ్లాక్, ఒక కీలక సెట్‌పీస్ లేదా ఒక ఎమోషనల్ ట్రాక్‌లో పోలికలు కనిపించినా సరిపోతుంది. సోషల్ మీడియాలో వెంటనే పోలికల చర్చ మొదలవుతోంది. దీంతో ఇటీవల కాలంలో డైరెక్ట‌ర్లు, నిర్మాతలు కథ కంటే ఆడియ‌న్స్ రియాక్ష‌న్‌ను ముందుగానే అంచనా వేసే ప్రయత్నంలో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రస్తుతం ఒక యాక్షన్ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా ఇదే అంశాన్ని మరోసారి హాట్ టాపిక్‌గా మార్చింది. రీసెంట్ గా రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్న ఓ సినిమాతో, నిర్మాణంలో ఉన్న మరో భారీ ప్రాజెక్ట్‌లోని కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌కు పోలికలు ఉన్నాయంటూ ఎక్స్ వేదికగా అనేక పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విష‌యంలో అఫీషియ‌ల్ గా ఎలాంటి క్లారిటీ లేకపోయినా, ఈ డిస్క‌ష‌న్ మాత్రం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

నిజానికి ఒకే తరహా ఆలోచనలు ఇద్దరు రచయితలకు రావడం కొత్త విషయమేమీ కాదు. ఫ్యామిలీని రక్షించే హీరో, ఇంట్లో జరిగే యాక్షన్ సీన్స్, విలన్ గ్యాంగ్‌తో పోరాటం వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా వందలాది సినిమాల్లో కనిపించాయి. అయితే ప్రస్తుతం సమస్య కథలోని పోలిక కంటే, ప్రేక్షకులు దాన్ని ఎలా స్వీకరిస్తారనేదే. ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో ఒక చిన్న పోలిక కూడా పెద్ద చర్చగా మారిపోతోంది.

ఇక్కడే మరో ఆసక్తికర అంశం కనిపిస్తోంది. గతంలో ఇలాంటి డిస్క‌ష‌న్స్ సినిమా రిలీజ‌య్యాక మొదలయ్యేవి. ఇప్పుడు మాత్రం షూటింగ్ దశలోనే ప్రాజెక్టులు ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. ఒక రూమర్ వైరల్ కావడం, దానిపై ఫ్యాన్ గ్రూప్స్ వాదోపవాదాలు మొదలుపెట్టడం, యూట్యూబ్ విశ్లేషణలు రావడం, చివరకు అది మెయిన్ డిస్క‌ష‌న్ గా మారడం చాలా వేగంగా జరుగుతోంది. ఫలితంగా అసలు విషయం ఏంటో తెలియకముందే ఒక సినిమా గురించి ఆడియ‌న్స్ లో ఒక అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం డైరెక్ట‌ర్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ కొత్త కథ రాయడం కాద‌ని, ఇప్పటికే వచ్చిన సినిమాలతో పోలికలు రాకుండా చూడటమే అస‌లైన స‌వాల్ అని ఇండ‌స్ట్రీకి చెందిన కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ ప్రాజెక్టుల విషయంలో ప్రతి సన్నివేశాన్ని పలుమార్లు పరిశీలించే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఏదైనా సీన్ ఇప్పటికే మరో సినిమాలో ఆడియ‌న్స్ కు గుర్తుండిపోయేలా ఉంటే, దాన్ని మార్చే ఆలోచన కూడా జరుగుతోందని టాక్. అయితే సోషల్ మీడియాలో వినిపించే ప్రతి ప్రచారం నిజమని భావించడం కూడా సరైంది కాదు. చాలాసార్లు ట్రైలర్ లేదా పూర్తి సినిమా రిలీజైన తర్వాతే అసలు విషయం బయటపడుతుంది. అయినప్పటికీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో కథల కంటే పోలికల భయం పెద్ద చర్చగా మారింది. ఆ భయాన్ని మరింత పెంచుతున్నది సోషల్ మీడియా లో వ‌చ్చే గాసిప్సే.