సెన్సిటివ్ ఇష్యూస్ అవసరమే.. కానీ..
అవి కేవలం దిగ్భ్రాంతి కలిగించే సన్నివేశాలుగా మారిపోతే, అసలు సమస్య పట్ల గౌరవం తగ్గే ప్రమాదం ఉందని అంటున్నారు.
By: M Prashanth | 24 April 2026 1:00 AM ISTతెలుగు సినిమాల్లో సున్నితమైన అంశాలు చూపించడంపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ పెరుగుతోంది. ముఖ్యంగా లైంగిక వేధింపులు వంటి తీవ్రమైన విషయాలు తెరపై ఎలా చూపిస్తున్నారన్నది ప్రేక్షకుల్లో ఆలోచన కలిగిస్తోంది. ఇలాంటి అంశాలు కథలో భాగంగా ఉండటం అవసరమే. కానీ వాటిని చూపించే విధానం సరైనదా అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి.
నిజానికి సినిమా అందరిపై ఎఫెక్ట్ చూపించే ఒక ప్లాట్ ఫామ్. సమాజంలో ఉన్న సమస్యలు చూపించి, ప్రజల్లో అవగాహన పెంచే శక్తి దీనికి ఉంది. అయితే అదే సమయంలో సున్నితమైన విషయాలు చూపేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. కొన్ని సినిమాల్లో ఆ అంశాలను కథకు అవసరం లేకపోయినా, కేవలం షాక్ ఇవ్వడానికి ఉపయోగిస్తున్నట్లు అనిపిస్తోందని ప్రేక్షకులు అంటున్నారు.
ఒక సీరియస్ సీన్ వచ్చిన వెంటనే.. ఒక్కసారిగా ఎన్విరాన్మెంట్ మారిపోవడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. దీంతో ఆ సన్నివేశం ఇచ్చే భావోద్వేగం తగ్గిపోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి మార్పులు కథలో సహజంగా అనిపించకపోవడంతో, చాలా మంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సున్నితమైన అంశాలను కథలో ‘షార్ట్ కట్ గా వాడకూడదని చెబుతున్నారు.
అవి కేవలం దిగ్భ్రాంతి కలిగించే సన్నివేశాలుగా మారిపోతే, అసలు సమస్య పట్ల గౌరవం తగ్గే ప్రమాదం ఉందని అంటున్నారు. అలాంటి సన్నివేశాలు ప్రేక్షకుల్లో లోతైన భావోద్వేగాన్ని కలిగించకుండా, కేవలం తాత్కాలిక ప్రభావంతో ముగుస్తాయని చెబుతున్నారు. ఆడియన్స్ అంతా ఇప్పుడు ఎక్కువగా కథలో అవసరంగా అంశాలను ఆశిస్తున్నారు. బలవంతంగా చొప్పించిన సన్నివేశాలు ఈజీగా గుర్తిస్తున్నారు.
అంతే కాదు.. సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను స్పష్టంగా చెబుతున్నారు. దీంతో సినిమాలపై ప్రజల ప్రభావం కూడా పెరుగుతోంది. ఇక రచయితలు, దర్శకుల బాధ్యత ఇక్కడ చాలా ముఖ్యమైంది. కథలో ఏ అంశాన్ని చేర్చినా, అది అవసరానికి తగ్గట్టుగా ఉండాలి. ముఖ్యంగా సున్నితమైన విషయాలు చూపేటప్పుడు, భావోద్వేగాన్ని సరైన విధంగా ప్రదర్శించాలి.
కేవలం కథను ముందుకు తీసుకెళ్లడానికి కాకుండా, ప్రేక్షకుల్లో ఆలోచన రేపేలా ఉండాలి. మొత్తానికి, సున్నితమైన అంశాలు సినిమాల్లో చూపించడం తప్పు కాదు. కానీ వాటిని ఎలా చూపిస్తామన్నదే అసలు విషయం. కేవలం షాక్ కోసం కాకుండా, సమస్య యొక్క డెప్త్ ను కాపాడుతూ చూపించాలి. అప్పుడు మాత్రమే ఆ కథ ప్రేక్షకులకు చేరుతుంది. అదే మంచి సినిమా లక్షణమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి మేకర్స్ ఆ విషయంపై దృష్టి పెడతారేమో వేచి చూడాలి.
