శోభిత 'చీకటిలో'.. స్ట్రాంగ్ కంటెంట్ లా ఉందే!
అయితే ట్రైలర్ ను గమనిస్తే.. శోభిత సంధ్య అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, పాడ్ కాస్టర్ పాత్రలో కనిపిస్తున్నారు.
By: M Prashanth | 14 Jan 2026 8:48 PM ISTనటి శోభిత ధూళిపాళ్ల తెలుగులో మళ్లీ సందడి చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె యాక్ట్ చేస్తున్న సినిమా చీకటిలో. క్రైమ్, సస్పెన్స్ జోనర్ లో తెరకెక్కిన ఆ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానుండటంతో ఆసక్తి పెరుగుతోంది. రీసెంట్ గా మేకర్స్.. ట్రైలర్ ను విడుదల చేయడంతో సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
శోభిత తెలుగులో చివరిసారిగా మేజర్ సినిమాలో కనిపించగా, ఆ తర్వాత బాలీవుడ్, ఓటీటీ ప్రాజెక్ట్స్ తో బిజీగా అయిపోయారు. ఇప్పుడు మరోసారి చీకటిలో మూవీతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్యతో వివాహం తర్వాత ఆమె నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు.
కిరాక్ పార్టీ, తిమ్మరుసు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, జనవరి 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చీకటిలో మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్.. అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది. తెగ చక్కర్లు కొడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది.
అయితే ట్రైలర్ ను గమనిస్తే.. శోభిత సంధ్య అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, పాడ్ కాస్టర్ పాత్రలో కనిపిస్తున్నారు. తాను చేస్తున్న ఉద్యోగం నచ్చక, కొత్తగా చీకటిలో అనే ట్రూ-క్రైమ్ పాడ్ కాస్ట్ ప్రారంభించి.. తద్వారా పలు హత్య కేసులను ప్రజల ముందుకు తీసుకొస్తుంటారు. ఆ సమయంలో ఒక హత్య కేసు ఆమె జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. గోదావరి జిల్లాల్లో గత 20 ఏళ్లుగా జరిగిన వరుస హత్యలు, తాజా హత్యకు ఏమైనా సంబంధం ఉందా? అన్న అనుమానాలు వస్తాయి.
ఆ హత్యల వెనుక ఒకే వ్యక్తి ఉన్నాడా? సీరియల్ కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నంలో శోభిత చిక్కుకుంటారు. అలా ట్రైలర్ మొత్తం సస్పెన్స్, థ్రిల్ తో ఆసక్తికరంగా సాగుతూ అందరినీ మెప్పిస్తోంది. అయితే శోభిత లుక్, బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రకు బాగా సెట్ అయ్యాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. బో*ల్డ్ గా, డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె యాక్టింగ్ ఆకట్టుకునేలా ఉంది.
లేడీ ఓరియెంటెడ్ రోల్ తో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ లో శోభిత నటన సినిమాకు మెయిన్ అట్రాక్షన్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. పాడ్ కాస్ట్, జర్నలిజం, టీవీ యాంకర్ అంశాలను మేళవించి రూపొందించిన కథ కొత్తగా అనిపిస్తోంది. ట్రైలర్ లోని విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. ఏదేమైనా చీకటిలో గట్టి కంటెంట్ ఉన్న క్రైమ్ సస్పెన్స్ డ్రామాగా కనిపిస్తోంది. మరి శోభిత ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.
