శోభితకు సినిమాలతో పని లేకుండా ఏడాదికి 10కోట్ల ఆదాయం?
తెలుగు తేజం శోభితా ధూళిపాళ్ల కేవలం నటిగానే కాకుండా.. గ్లోబల్ బ్రాండ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు.
By: Sivaji Kontham | 10 April 2026 11:11 AM ISTతెలుగు తేజం శోభితా ధూళిపాళ్ల కేవలం నటిగానే కాకుండా.. గ్లోబల్ బ్రాండ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. తనదైన స్టైల్ స్టేట్‌మెంట్ .. క్లాసీ లుక్స్‌తో అంతర్జాతీయ బ్రాండ్లను సైతం ఆకర్షిస్తూ తన పోర్ట్ ఫోలియోని విస్తరించడం ఆసక్తిని కలిగిస్తోంది. తాజాగా శోభిత `నెక్సస్ న్యూయార్క్` వంటి ప్రతిష్టాత్మక హెయిర్ కేర్ బ్రాండ్‌తో కుదుర్చుకున్న వార్షిక ఒప్పందం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటువంటి లగ్జరీ బ్రాండ్ల ప్రమోషన్ల ద్వారా శోభిత ఏడాదికి కోట్లాది రూపాయల వార్షికాదాయాన్ని ఆర్జిస్తోంది. ఒక్కో భారీ బ్రాండ్ యాన్యువల్ కాంట్రాక్ట్ విలువ కొన్ని కోట్ల రూపాయలలో ఉంటుందని సమాచారం.
కేవలం నెక్సస్ మాత్రమే కాకుండా.. శోభిత ప్రస్తుతం ఫ్యాషన్, కాస్మెటిక్స్ , లైఫ్ స్టైల్ విభాగాలకు చెందిన సుమారు 5 నుండి 8 ప్రముఖ బ్రాండ్లకు ప్రమోషన్లు చేస్తోంది. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కోసం లేదా ఫోటోషూట్ కోసం తన ప్రస్తుత క్రేజ్‌ను బట్టి 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు అంచనా. సోషల్ మీడియాలో శోభితకు ఉన్న `హాలీవుడ్ లెవల్ బ్యూటీ` అనే ఇమేజ్.. బ్రాండ్ విలువను పెంచడానికి కంపెనీలకు బాగా ప్లస్ అవుతోంది. దీంతో సినిమాల ద్వారా వచ్చే ఆదాయానికి సమానంగా బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా సంపాదిస్తున్నారని సమాచారం.
సినిమాల పారితోషికం విషయానికి వస్తే.. శోభిత కొన్నేళ్లలో కేవలం సహాయక పాత్రల స్థాయి నుండి లీడ్ రోల్స్ పోషించే స్థాయికి ఎదిగింది. `మేడ్ ఇన్ హెవెన్` సిరీస్.. `పొన్నియిన్ సెల్వన్` వంటి భారీ చిత్రాల తర్వాత తనకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఆమె 1.5 కోట్ల నుండి 2.5 కోట్ల రూపాయల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. పాత్ర నిడివి .. ప్రాజెక్ట్ స్థాయిని బట్టి ఈ ధర మారుతుంటుంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌ల విషయంలో శోభిత పారితోషికం మరింత ఎక్కువగా ఉంటుందని టాక్. ఇక బ్రాండ్స్ ప్రమోషన్స్ తోనే శోభిత ఏడాదికి సుమారు 7 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య ఆర్జిస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
శోభిత నటించిన సినిమాల జాబితా పరిశీలిస్తే.. `రామన్ రాఘవ్ 2.0`తో ప్రయాణం మొదలుపెట్టి, గూఢచారి, మేజర్, `మంకీమ్యాన్` వంటి అంతర్జాతీయ స్థాయి చిత్రాలతో గుర్తింపు పొందింది. 2026-2027 కాలంలో తన ఖాతాలో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో పలు సినిమాలు , వెబ్ సిరీస్ లు థియేటర్లలో, ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలయ్యే ఛాన్సుంది.
ప్రస్తుతం శోభిత చేతిలో ఉన్న నెక్స్ట్ సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ఒక పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ కథలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగ చైతన్యతో నిశ్చితార్థం తర్వాత వ్యక్తిగత జీవితంపై శోభిత ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. నటిగా వైవిధ్యమైన పాత్రలను సెలక్టివ్ గా ఎంచుకుంటూనే, మోడలింగ్, బ్రాండ్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని శోభిత నిర్మించుకుంటున్నారు.
