శోభన్ బాబు సతీమణి శాంత కుమారి కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా సెలబ్రిటీలలో కొంతమంది అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడువగా.. మరికొంతమంది వయోభారంతో బాధపడుతూ తుది శ్వాస విడుస్తున్నారు.
By: Madhu Reddy | 10 July 2026 9:34 AM ISTసినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా సెలబ్రిటీలలో కొంతమంది అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడువగా.. మరికొంతమంది వయోభారంతో బాధపడుతూ తుది శ్వాస విడుస్తున్నారు. ఇక ఇప్పుడు ఆంధ్ర సోగ్గాడిగా ఒకప్పుడు తన అద్భుతమైన నటనతో తెలుగు చిత్ర సీమలో అగ్రతారగా ఒక వెలుగు వెలిగిన దివంగత నటుడు శోభన్ బాబు సతీమణి శాంత కుమారి కన్నుమూశారు.
శోభన్ బాబు భార్య కన్నుమూత..
2008లో శోభన్ బాబు గుండెపోటుతో మరణించిన తర్వాత తన ఫ్యామిలీతో కలసి చెన్నైకి షిఫ్ట్ అయిన శాంతకుమారి అక్కడే పిల్లలతో కలిసి జీవిస్తోంది. గత రెండు నెలల క్రితం ఒక ఛానల్ కి కూడా ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఇంతలోనే ఆమె మరణించారు అనే వార్త అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇకపోతే శాంతకుమారి మరణించడానికి కారణం వయోభారం అని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. శాంత కుమారి మరణంతో అటు శోభన్ బాబు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు, ఆమె మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నారు.
శోభన్ బాబు - శాంతకుమారి వైవాహిక జీవితం..
ఇక శాంత కుమారి, శోభన్ బాబు విషయానికొస్తే శోభన్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే శాంత కుమారిని 1958 మే 15వ తేదీన వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు మొత్తం నలుగురు పిల్లలు. అందులో ముగ్గురు కుమార్తెలు మృదుల, ప్రశాంతి, నివేదిత కాగా, ఒక కొడుకు కరుణ శేషు కూడా ఉన్నారు. ఇకపోతే కరుణ శేషు ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ గా ఎదిగారు.
శోభన్ బాబు విషయానికి వస్తే..
శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు. 1937 జనవరి 14న ఒక రైతు కుటుంబంలో జన్మించారు. కృష్ణ జిల్లా చిన్న నందిగామ ఈయన స్వగ్రామం. తండ్రి పేరు ఉప్పు సత్యనారాయణ రావు. మైలవరం ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లోనే నాటకాలపై ఆసక్తి పెంచుకొని, అతి తక్కువ సమయంలోనే నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. శోభన్ బాబుకి గుంటూరు కాలేజీలో పునర్జన్మ వంటి నాటకాలలో మంచి పేరు లభించింది. ఇక విజయవాడలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన ఈయన.. మద్రాస్ లో లా కోర్సులో చేరినప్పటికీ నటన మీద ఆసక్తితో ఉదయం కాలేజీకి వెళ్లి, మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవాడు. అదే సమయంలో తన పేరును శోభన్ బాబుగా మార్చుకొని దైవబలం అనే సినిమా ద్వారా తన నటన జీవితాన్ని ప్రారంభించారు.
