తండ్రికి హార్ట్ ఎటాక్.. స్మృతిమందన పెళ్లి వాయిదా
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందాన- సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ఈ ఆదివారం నాడు పెళ్లి బంధంతో ఒకటయ్యేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 23 Nov 2025 7:19 PM ISTభారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందాన- సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ఈ ఆదివారం నాడు పెళ్లి బంధంతో ఒకటయ్యేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కానీ ఈ పెళ్లి ఊహించని కారణాలతో వాయిదా పడింది. ఈ వివాహ వేడుకలు నవంబర్ 21న హల్ది వేడుకతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 22 నవంబర్ 2025 శనివారం మెహందీ, సంగీత వేడుకలు జరిగాయి. ప్రీవెడ్డింగ్ వేడుకల సందర్భంగా జంట వేదికపై కలిసి నృత్యం చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఇంతలోనే ఒక అశుభ వార్త వినాల్సి వచ్చింది.
స్మృతి మందన తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యం పాలవడంతో ఆదివారం సాంగ్లిలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. ఈ వేడుక ఈరోజు (నవంబర్ 23న) మహారాష్ట్రలోని ఆమె స్వస్థలంలో జరగాల్సి ఉంది. స్మృతి తండ్రిగారైన శ్రీనివాస్ కి వైద్యపరమైన అత్యవసర పరిస్థితి కారణంగా వాయిదా వేయాలని నిర్ణయించినట్టు స్మృతి మేనేజర్ ధృవీకరించారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ వారి గోప్యతను గౌరవించాలని కోరారు.
అసలేం జరిగింది? అంటే.. స్మృతి తండ్రి శ్రీనివాస్ మందాన ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నప్పుడు అన్ ఈజీగా అనిపించింది. గుండె నొప్పి ఇబ్బంది పెట్టింది. పరిస్థితి మెరుగుపడుతుందని అంతా ఎదురు చూసారు. కానీ అది మరింత దిగజారింది. వెంటనే అంబులెన్స్ లో ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్నారు. స్మృతి తన తండ్రిని చాలా ప్రేమిస్తుంది. ఆమె తండ్రి కోలుకునే వరకు వివాహం వాయిదా వేయాలని నిర్ణయించుకుందని స్మృతి మేనేజర్ తుహిన్ మిశ్రా తెలిపారు.
ఈ ఆదివారం సాయంత్రం పెళ్లి వేడుక జరగాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా పడటం స్మృతి-పలాష్ అభిమానులను నిరాశపరిచింది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ వేడుకలు పీక్స్ కి చేరుకున్నాయి. అందమైన జంట సాంప్రదాయ ఆచారాలలో పాల్గొన్నప్పటి వీడియోలను స్నేహితులు, బంధువులు షేర్ చేయగా వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు పెళ్లిని వాయిదా వేయడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
