సుశాంత్ ఆత్మహత్యపై స్పందించిన ఆధ్యాత్మిక హీలర్!
బాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకస్మిక మరణం సినీ రంగాన్ని.. కోట్లాది మంది అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 23 Oct 2026 9:00 PM ISTబాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకస్మిక మరణం సినీ రంగాన్ని.. కోట్లాది మంది అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ దూరమై ఏళ్లు గడుస్తున్నా? సుశాంత్ మరణానికి సంబంధించిన ఏదో ఒక వార్త వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ప్రముఖ నటి, ఆధ్యాత్మిక హీలర్ స్మితా జయకర్ సుశాంత్ ఆత్మహత్యపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సుశాంత్ కనుక తన వద్దకు వచ్చి ఉంటే ఆయన బతికేవాడేమోనంటూ చేసిన భావోద్వేగ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చిత్ర పరిశ్రమలో సీనియర్ నటిగా ఎన్నో గుర్తింపు పొందిన పాత్రల్లో నటించిన స్మితా జయకర్, గత కొంతకాలంగా ఆధ్యాత్మిక హీలర్‌గా మానసిక ప్రశాంతత, హీలింగ్ సెషన్లు అందిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం గురించి మాట్లాడారు. సుశాంత్ ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను ముందుగానే గుర్తించి ఉంటే అమూల్యమైన ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు.
సుశాంత్ కనుక తన వద్దకు వచ్చి హీలింగ్ తీసుకుని ఉంటే ఈ విషాదం జరిగి ఉండేది కాదని స్మిత ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్ , అంతర్గత మానసిక సమస్యలతో బాధపడేవారికి సరైన సమయంలో ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, ఎనర్జీ హీలింగ్ అందిస్తే వారిలో సానుకూల ఆలోచనలు పెరిగి ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాల నుంచి బయటపడతారని పేర్కొన్నారు.
గ్లామర్ ప్రపంచంగా కనిపించే పరిశ్రమ వెనుక ఎంతో మంది నటులు తీవ్రమైన ఒత్తిడి, ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారని స్మితా జయకర్ గుర్తుచేశారు. బయటకు నవ్వుతూ కనిపించినంత మాత్రాన వారి లోపల అంతా బాగున్నట్లు కాదని అంతర్గతంగా నలిగిపోతున్న నటులకు సరైన మానసిక మద్దతు చాలా అవసరమని ఆమె వ్యాఖ్యానించారు.
మానసిక ప్రశాంతతను కోల్పోయినప్పుడు మందులు లేదా బాహ్య పరిష్కారాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక హీలింగ్ కూడా అద్భుతంగా పనిచేస్తుందని వివరించారు. మనసులో పేరుకుపోయిన ప్రతికూల ఆలోచనలను తొలగించి జీవితంపై ఆశను పెంపొందించడంలో హీలింగ్ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని స్మిత స్పష్టం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత మానసిక ఆరోగ్యంపై పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చలు జరిగినా? స్మితా జయకర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి మానసిక ప్రశాంతత ... ఆధ్యాత్మిక మద్దతు ప్రాధాన్యతను గుర్తు చేస్తున్నాయి.
