Begin typing your search above and press return to search.

వినోద రంగంలో నిలువు విప్లవం!

రెండు మూడు నిమిషాల వ్యవధి ఉండే చిన్న ఎపిసోడ్‌లతో వేగవంతమైన కథనంతో సాగే ఈ నిలువు తెర కంటెంట్ సాంప్రదాయ వినోద పరిశ్రమకు కొత్త సవాలు విసురుతోంది.

By:  Srikanth Kontham   |   27 Jun 2026 12:45 PM IST
వినోద రంగంలో నిలువు విప్లవం!
X

డిజిటల్ విప్లవం తో ప్రేక్షకుల వినోదాన్ని ఆస్వాదించే పద్ధతులు వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు వెండితెరకే పరిమితమైన సినిమా నేడు ఓటీటీల రూపంలో లివింగ్ రూమ్‌లలోని టీవీల్లోకి చేరింది. తాజాగా అదే వినోదం సరికొత్త వెర్టిక‌ల్ ఫార్మాట్ లోకి మారుతోంది. స్మార్ట్‌ఫోన్ల కోసమే రూపొందించే ఈమైక్రో-డ్రామాలు సరికొత్త సంచలనంగా మారుతున్నాయి. రెండు మూడు నిమిషాల వ్యవధి ఉండే చిన్న ఎపిసోడ్‌లతో వేగవంతమైన కథనంతో సాగే ఈ నిలువు తెర కంటెంట్ సాంప్రదాయ వినోద పరిశ్రమకు కొత్త సవాలు విసురుతోంది.

ఇప్పుడీ సరికొత్త వినోద మార్కెట్ పరిధి శరవేగంగా విస్తరిస్తోంది. లూమికై ఇంటరాక్టివ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో మైక్రో-డ్రామా మార్కెట్ విలువ ఇప్పటికే 300 మిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతేకాదు 2030 నాటికి ఏకంగా 4.5 బిలియన్ డాలర్ల భారీ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో భారతీయ డిజిటల్ మీడియాను శాసించేది నిలువు తెర వినోదమేనని చెప్పొచ్చు.

ఈ సరికొత్త సాంకేతిక మార్పును ట్రెండ్ కంటే ముందే అందుకోవ‌డానికి కంటెంట్ సృష్టికర్తలు అడుగులు వేస్తున్నారు.

ఇందులో భాగంగా ఈక్వినాక్స్ వర్చువల్ స్టూడియో అధినేత అమితా మాధ్వానీ సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. గూగుల్ క్లౌడ్ భాగస్వామ్యంతో రూపొందించిన `మోహిని` అనే మ్యూజికల్ మైక్రో-డ్రామా సిరీస్ డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో మైలురాయిగా నిలిచింది. ప్రయోగాల దశ నుంచి దాటి ఈ నిలువు కథనాలు ఇప్పుడు భారీ వ్యాపార అవకాశంగా మారుతున్నాయని నమ్ముతున్నారు.సాంకేతికత అనేది సృజనాత్మకతకు మద్దతుగా నిలవాలే తప్ప మానవ హృదయాన్ని భర్తీ చేయలేదు.ఈ మైక్రో-డ్రామాల నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది.

అయితే ఏఐ అనేది కేవలం సృజనాత్మకతకు రెక్కలు తొడిగే సాధనం మాత్రమే కానీ మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదని అమితా స్పష్టం చేశారు.`మోహిని` సిరీస్‌లో పాత్రలను ఏఐ సాయంతో సృష్టించినప్పటికీ దాని వెనుక ఉన్న భావోద్వేగాలు, కథా బలం, సంభాషణలు పూర్తిగా మానవ మేధస్సు నుంచే పుట్టాయని పేర్కొన్నారు. గతంలో విహెచ్ఎస్, డివిడి, ఓటీటీలు వచ్చినట్లే ఏఐ కూడా వినోద పరిణామక్రమంలో భాగమని అభిప్రాయపడ్డారు.

సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల నిర్మాణ వ్యయం, మానవ వనరుల అవసరం గణనీయంగా తగ్గుతోంది. కేవలం ఐదుగురు సభ్యులతో కూడిన చిన్న బృందంతోనే పూర్తి స్థాయి సిరీస్‌ను ఈక్వినాక్స్ వర్చువల్ నిర్మించగలగడం దీనికి నిదర్శనం. ఇలాంటి మైక్రో-డ్రామాలు భవిష్యత్తులో పెద్ద ప్రాజెక్ట్‌లకు పునాదిగా ఉపయోగపడతాయి. బలమైన మేధో సంపత్తిని సృష్టించుకుంటే రేపు ఏదైనా పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్ ముందుకు వస్తే ఇదే కథను నిజమైన నటీనటులతో ప్రీమియం వెబ్ సిరీస్‌గా మార్చడం సులువవుతుందని అమితా వివరించారు.

టెక్నాలజీ మారుతున్నప్పుడు సృష్టికర్తలు సంకుచిత మనస్తత్వాన్ని వీడి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఈ రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో ఓటీటీలు కొత్తగా వచ్చినప్పుడు ప్రేక్షకులు మొదట్లో సందేహించినా? ఇప్పుడు అవే నిత్యావసరాలుగా మారిపోయాయి. స్మార్ట్‌ఫోన్ చేతిలో పట్టుకుని తిరిగే నేటి తరం ప్రేక్షకులలో నిలువు తెర మైక్రో-డ్రామాల పట్ల అలాంటి ఆసక్తే కనిపిస్తోంది. సాంకేతికతను సమర్థవంతంగా వాడుకుంటూ కథలోని ఆత్మను కోల్పోకుండా వినోదాన్ని అందిస్తే డిజిటల్ వినోద రంగంలో ఇది సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం.