చిన్న సినిమా ఆడకపోవడానికి వీళ్లే కారణం
తాజాగా దర్శకుల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న మోహిత్ తన సహచరులైన డొమినిక్ అరుణ్, నీరజ్ ఘైవాన్, రీమా కగ్తి, రోహన్ కనవాడే , రాహుల్ రవీంద్రన్ లతో పాటు చర్చా సమావేశంలో పాల్గొన్నారు.
By: Sivaji Kontham | 23 Dec 2025 4:00 AM ISTచిన్న సినిమా సరిగా ఆడటం లేదని నిర్మాతలు వాపోతున్నారు. చిన్న లేదా స్వతంత్ర చిత్రాల కోసం ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. జాతీయ అవార్డ్ నటులు మనోజ్ బాజ్‌పేయ్ , పంకజ్ త్రిపాఠి చిన్న సినిమాల కోసం జనం థియేటర్లకు రాకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. దీనివల్ల చాలా సినిమాలు విడుదలకే నోచుకోవడం లేదని కూడా ఆవేదన చెందారు.
ఇప్పుడు సయ్యారా దర్శకుడు మోహిత్ సూరి కూడా ఆ ఇద్దరితో పాటు లీగ్ లోకి చేరారు. చిన్న సినిమాలను వీక్షించేందుకు ఎవరూ థియేటర్లకు వెళ్లడం లేదని అన్నారు. ముఖ్యంగా పరిశ్రమ వ్యక్తులే చిన్న సినిమాలను చిన్న చూపు చూస్తున్నారని, థియేటర్ కి వెళ్లడం లేదని విమర్శించారు.
తాజాగా దర్శకుల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న మోహిత్ తన సహచరులైన డొమినిక్ అరుణ్, నీరజ్ ఘైవాన్, రీమా కగ్తి, రోహన్ కనవాడే , రాహుల్ రవీంద్రన్ లతో పాటు చర్చా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సెషన్‌లో హోస్ట్ అనుపమ చోప్రా ప్రముఖులనుద్దేశించి వ్యాఖ్యానిస్తూ.. వారు ఇటీవల థియేటర్‌లో చూసిన.. అద్భుతంగా అనిపించిన ఒక సినిమా పేరు చెప్పమని అడిగారు. రోహన్ కనవాడే `సిన్నర్స్` అని సమాధానం ఇచ్చారు. దానికి మోహిత్ అదేనా మీరు థియేటర్లలో చూసిన చివరి సినిమా? అని అడిగాడు. థియేటర్‌లో చాలా సినిమాలు చూడటానికి తనకు సమయం దొరకలేదని రోహన్ బదులిచ్చారు. ఆశ్చర్యపోయిన మోహిత్ థియేట్రికల్ రంగంలోని ఒక ప్రధాన సమస్య గురించి ఆవేదనను కనబరిచారు. మనమంతా థియేటర్ల గురించి ఏడుస్తాము.. ఎవరూ థియేటర్లకు వెళ్లరు.. కానీ జనం థియేటర్లకు వెళ్లడం లేదని మీరంతా ఏడుస్తున్నారు. నేను ప్రతి వారాంతం ఏ సినిమా విడుదలైనా సరే చూడటానికి వెళ్తాను అని అన్నారు.
అయితే తాను కొన్ని వారల క్రితం ఒక మరాఠీ సినిమా చూశానని రోహన్ చెప్పాడు. సిన్నర్స్ నచ్చే కథతో వస్తోంది కాబట్టే థియేటర్ కి వెళ్లాను అని చెప్పాడు. కానీ పరిశ్రమ ప్రముఖులే చిన్న సినిమాలను ఆదరించనప్పుడు , సాధారణ జనం ఆదరిస్తారా? అని మోహిత్ సూరి సూటిగా ప్రశ్నించాడు. నిజానికి చిన్న సినిమాలకు కేవలం హిందీ పరిశ్రమలోనే కాదు, తెలుగు, తమిళ పరిశ్రమల్లోను ఆదరణ దక్కడం లేదు. మోహిత్ సూరి `సయ్యారా` లాంటి చిత్రం అరుదుగా మాత్రమే వస్తుంది. ఈ చిత్రంలో కొత్త వారు నటించినా కంటెంట్, నటీనటులు, దర్శకత్వ ప్రతిభ కారణంగా పెద్ద హిట్టయింది. మోహిత్ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని బాలీవుడ్ కి కానుకగా ఇచ్చాడని ప్రశంసలు కురిసాయి. సయ్యారా సినిమాతో అహాన్ పాండే- అనీత్ పడ్డా నటీనటులుగా పరిచయమయ్యారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 580 కోట్లు వసూలు చేసింది.
