బడ్జెట్ లో మూవీస్ .. కానీ బ్లాక్‌బస్టర్ రిజల్ట్!
సినిమా హిట్ అవ్వాలంటే వందల కోట్ల బడ్జెట్, సూపర్ స్టార్స్ ఉండాల్సిన అవసరం లేదని మన డైరెక్టర్లు ప్రూవ్ చేస్తున్నారు.
By: Madhu Reddy | 6 Jun 2026 8:00 AM ISTసినిమా హిట్ అవ్వాలంటే వందల కోట్ల బడ్జెట్, సూపర్ స్టార్స్ ఉండాల్సిన అవసరం లేదని మన డైరెక్టర్లు ప్రూవ్ చేస్తున్నారు. కేవలం చిన్న బడ్జెట్‌తో, అద్భుతమైన కథలతో వచ్చి థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న సినిమాలు ఈ మధ్య చాలానే వచ్చాయి. కేవలం మౌత్ పబ్లిసిటీతో, కంటెంట్‌నే నమ్ముకుని పాన్ ఇండియా లెవెల్‌లో దుమ్మురేపిన ఆ చిన్న బడ్జెట్ బ్లాక్‌బస్టర్ సినిమాలు ఏంటో, వాటి వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు చూద్దాం.
దేవుడి కథతో పాన్ ఇండియా హిట్ కొట్టిన 'కార్తికేయ 2':
అతి తక్కువ బడ్జెట్‌తో, ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన సినిమా కార్తికేయ 2. కానీ, శ్రీకృష్ణుడి నమ్మకం, చరిత్ర నేపథ్యంలో సాగే ఈ సినిమా కథలో ఉన్న బలం వల్ల తెలుగులోనే కాదు.. బాలీవుడ్‌లో సైతం భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఊహించని విధంగా కలెక్షన్ల వర్షం కురిపించి, కంటెంట్ బాగుంటే లాంగ్వేజ్‌తో సంబంధం లేదని నిరూపించింది.
విజువల్ వండర్‌గా నిలిచిన 'హను-మాన్':
హాలీవుడ్ లెవెల్ గ్రాఫిక్స్ ఉండాలంటే వందల కోట్లు ఖర్చు పెట్టాలి అనుకునే రోజుల్లో, చాలా పరిమిత బడ్జెట్‌తో దర్శకుడు ప్రశాంత్ వర్మ 'హను-మాన్' సినిమాను తెరకెక్కించారు. మన పురాణాల బ్యాక్‌డ్రాప్‌కు సూపర్ హీరో ఎలిమెంట్స్ జోడించి, అద్భుతమైన విజువల్స్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.
గుండెలను హత్తుకున్న 'బలగం':
స్టార్ హీరోలు లేరు, ఆకాశాన్ని తాకే సెట్టింగ్‌లు లేవు.. కేవలం మన తెలంగాణ గ్రామీణ నేపథ్యం, కుటుంబ బంధాల చుట్టూ తిరిగే కథతో వచ్చిన సినిమా 'బలగం'. ప్రతి ఒక్కరి మనసును హత్తుకునేలా ఎమోషన్స్‌ను పండించడంతో, ఈ చిన్న సినిమా సాధించిన విజయం టాలీవుడ్‌లో ఒక పెద్ద సంచలనంగా నిలిచింది.
యూత్‌ని బాగా ఎంటర్‌టైన్ చేసిన ‘డీజే టిల్లు’:
చిన్న కథతోనే హీరో సిద్దు తన కామెడీ టైమింగ్, స్టైల్, డైలాగ్స్‌తో ప్రత్యేకంగా నిలిచిన సినిమా డీజే టిల్లు. ఇక థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించి, యూత్‌కు పిచ్చపిచ్చగా కనెక్ట్ అయిపోయి, నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అలాగే క్లాసిక్ లవ్ స్టోరీగా వచ్చిన 'మళ్ళీ రావా' కూడా తక్కువ బడ్జెట్‌తోనే మంచి సక్సెస్ అందుకుంది.
ఇతర భాషల్లో సంచలనాలు ఇవే:
మన తెలుగులోనే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అద్భుతాలు జరిగాయి. కన్నడంలో కేవలం కొన్ని కోట్ల బడ్జెట్‌తో మొదలైన 'కాంతార' సినిమా, అక్కడి సంస్కృతిని చూపిస్తూ కల్ట్ క్లాసిక్‌గా మారి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లు వసూలు చేసింది. అలాగే హిందీలో అతి తక్కువ నిర్మాణ వ్యయంతో వచ్చిన 'ది కేరళ స్టోరీ' రూ. 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేసింది.
ఈ సినిమాలన్నీ చూశాక అర్థమయ్యే విషయం ఒక్కటే.. సినిమాకు 'కంటెంటే కింగ్'. ఇక కథ స్ట్రాంగ్‌గా ఉండి, చెప్పాలనుకున్న పాయింట్‌ను కొత్తగా చూపిస్తే చాలు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. కోట్లు కుమ్మరించి భారీ గ్రాఫిక్స్ పెట్టాల్సిన అవసరం లేదు, కంటెంట్ ఉంటే ఖర్చుతో పనిలేకుండా లాభాలు అవే వస్తాయని 'బలగం', 'హను-మాన్' లాంటి సినిమాలు టాలీవుడ్‌కు కొత్త దారిని చూపించాయి.
