Begin typing your search above and press return to search.

చెన్నై లవ్ స్టొరీ.. రాయలసీమ గడ్డ మీద SKN పవర్ఫుల్ ఎలివేషన్స్

చెన్నై లవ్ స్టోరీ మ్యూజికల్ ఫెస్ట్ తిరుపతిలో ఎంత అద్భుతంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వేదికపై నిర్మాత ఎస్కేఎన్ చెప్పిన మాటలు అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయి.

By:  M Prashanth   |   21 Jun 2026 10:28 AM IST
చెన్నై లవ్ స్టొరీ.. రాయలసీమ గడ్డ మీద SKN పవర్ఫుల్ ఎలివేషన్స్
X

చెన్నై లవ్ స్టోరీ మ్యూజికల్ ఫెస్ట్ తిరుపతిలో ఎంత అద్భుతంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వేదికపై నిర్మాత ఎస్కేఎన్ చెప్పిన మాటలు అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయి. ఏడుకొండల స్వామి సాక్షిగా ఆయన సినిమాపై తనకున్న నమ్మకాన్ని గట్టిగా వినిపించారు. సినిమా కోసం చొక్కాలు చించుకునే రేంజ్ అభిమానం రాయలసీమ వాసుల సొంతం అంటూ లోకల్ ఆడియన్స్ కు మంచి ఎలివేషన్ ఇచ్చారు. ఫ్లాట్ రేట్లు, అర్ధరాత్రి షోలు వేయడం తిరుపతిలోనే ఎక్కువ చూస్తామని తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు.

ఒక తెలుగు సినిమాకు చెన్నై లవ్ స్టోరీ అని పేరు పెడితే ఎవరూ అభ్యంతరం చెప్పలేదని ఎస్కేఎన్ గుర్తుచేశారు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే టెంట్ వేసుకుని మరీ చూసే గొప్ప మనసు మన తెలుగు ప్రేక్షకులది అంటూ మెచ్చుకున్నారు. బేబీ లాంటి వంద కోట్ల సినిమా తర్వాత, నేషనల్ అవార్డులు తెచ్చుకున్న తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలో ఆలోచిస్తున్నప్పుడు సాయి రాజేష్ ఈ కథను తీసుకువచ్చారని చెప్పారు.

ఈ సినిమాకు ప్రాణం పోసిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారి గురించి ఎస్కేఎన్ చాలా గొప్పగా మాట్లాడారు. ఇండస్ట్రీలో మెలోడీ బ్రహ్మ, మెలోడీ విష్ణు, మెలోడీ ఈశ్వర అన్నీ ఆయనే అని కితాబిచ్చారు. ఒక స్టార్ హీరో నుంచి అప్పుడే వస్తున్న కొత్త హీరో వరకు ఎవరికైనా సరే తనదైన శైలిలో బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడం ఆయనకే చెల్లిందన్నారు. ఆయన బాణీల్లో సాహిత్యం చాలా స్పష్టంగా వినిపిస్తుందని, ఈ సినిమాకు ఆయన అద్భుతమైన పాటలు ఇచ్చారని ప్రశంసించారు.

హీరో కిరణ్ అబ్బవరం గురించి చెబుతూ ఎస్కేఎన్ ఏకంగా అవార్డుల ప్రకటన చేసేశారు. ఈ సినిమాలో కిరణ్ నటన నభూతో నభవిష్యత్ అనే రేంజ్ లో ఉంటుందని నమ్మకంగా చెప్పారు. సినిమా చూస్తున్నప్పుడు కిరణ్ యాక్టింగ్ కు తనకు కనీసం పదిసార్లు గూస్ బంప్స్ వచ్చాయని మురిసిపోయారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఏ అవార్డ్ ఫంక్షన్ జరిగినా అందులో కిరణ్ అబ్బవరం పేరు కచ్చితంగా నామినేషన్స్ లో ఉంటుందని తేల్చి చెప్పారు.

డైరెక్టర్ రవి నంబూరి పదిహేను సినిమాల అనుభవం ఉన్న దర్శకుడిలా ఈ మూవీని తెరకెక్కించారని ఎస్కేఎన్ అభినందించారు. శ్రీ గౌరీ ప్రియ నివి క్యారెక్టర్ లో అద్భుతంగా జీవించిందని, ఈ ప్రాజెక్ట్ కి ఆమె ఒక పెద్ద అసెట్ అని చెప్పారు. ఇక ధీరజ్ తో కలిసి సాయి రాజేష్ గైడెన్స్ లో ఈ సినిమాను నిర్మించడం చాలా ఆనందంగా ఉందంటూ టీమ్ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

జూన్ లోనో లేదా జూలై పదికో రిలీజ్ చేయాల్సిన ఈ చిత్రాన్ని ఫైనల్ గా జూలై 24న థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు ఎస్కేఎన్ క్లారిటీ ఇచ్చారు. ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదని, దానికి మించిన ఫీల్ ఇస్తుందన్నారు. ఈవెంట్ చివర్లో స్రవంతి చొక్కారపు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ లైఫ్ లో తొలిప్రేమ సక్సెస్ అయితే తోపు అని, ఫెయిల్ అయితే అక్కడితో ఆగిపోకుండా ముందుకు వెళితే అంతకుమించిన బెస్ట్ లవ్ దొరుకుతుందని చెప్పిన మాటలు యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.