Begin typing your search above and press return to search.

'చెన్నై లవ్ స్టోరీ' ఈవెంట్‌లో నిర్మాత SKN ఎమోషనల్ స్పీచ్

ఈ సందర్భంగా నిర్మాత‌ ఎస్.కే.ఎన్ (SKN) చేసిన ప్రసంగం సభలోని అభిమానులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

By:  Sivaji Kontham   |   22 July 2026 10:47 PM IST
చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో నిర్మాత SKN ఎమోషనల్ స్పీచ్
X

యువ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నిర్మాత‌ ఎస్.కే.ఎన్ (SKN) చేసిన ప్రసంగం సభలోని అభిమానులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మెగాస్టార్‌పై తనకున్న అపరిమితమైన అభిమానాన్ని ప్రకటిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఎమోషనల్ బాండింగ్ గురించి ఎస్.కే.ఎన్ మాట్లాడుతూ.. "బాస్ గురించి ఎంతైనా మాట్లాడవచ్చు కానీ.. ఆయన ముందే నిలబడి మాట్లాడాలంటే గుండె ప్యాక్ అయిపోతుంది. బాస్ అంటే మనకి పెంచుకున్న తోట, కట్టుకున్న కోట, ఎంచుకున్న బాట.. ఆయనే మన పోర్టు, ఫోర్టు! సాధారణంగా ప్రతి ఒక్కరికీ గుండె లబ్ డబ్ అంటుంది.. కానీ మెగా అభిమానులకు మాత్రం గుండె చప్పుడు 'మెగాస్టార్.. మెగాస్టార్' అని వినిపిస్తుంది. అందరి బ్లడ్ గ్రూప్స్ A, B, O అయితే, మనందరి బ్లడ్ గ్రూప్ మాత్రం M - మెగా అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. ఒకప్పుడు ఇండస్ట్రీలోకి రావడానికి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని తమలాంటి మిడిల్ క్లాస్ కుర్రాళ్లకు మెగాస్టార్ చిరంజీవినే పెద్ద దేవుడని కొనియాడారు. గతంలో ఇదే శిల్పకళావేదికలో ఈవెంట్ పాసుల కోసం పోలీసుల దెబ్బలు తిని, పై కార్నర్ల నుంచి చిరంజీవి గారిని చూసిన రోజులున్నాయి. అలాంటిది ఈ రోజు మేము నిర్మించిన సినిమా ఈవెంట్‌కే మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా రావడం మా పూర్వజన్మ సుకృతం అని ఆనందం వ్యక్తం చేశారు.

ఇక 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా విశేషాలను షేర్ చేస్తూ.. ఏలూరు, నెల్లూరు నుంచి సినిమాపై ఉన్న విపరీతమైన ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చిన తమను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని తెలిపారు. నేషనల్ అవార్డ్ విన్నర్ సాయిరాజేష్ అందించిన అద్భుతమైన కథ, స్క్రీన్ ప్లేకి కిరణ్ అబ్బవరం వెంటనే ఓకే చెప్పారని వెల్లడించారు. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీకి మణిశర్మ గారి సంగీతం ప్రధాన ప్రాణంగా నిలిచిందని పేర్కొన్నారు.

చివరగా.. ఇది కేవలం సినిమా ప్రమోషనల్ ఈవెంట్ మాత్రమే కాదని... తమందరికీ ఒక ఎమోషనల్ మూమెంట్ అని ఎస్.కే.ఎన్ అన్నారు. క్లీన్ యుఏ సర్టిఫికేట్ పొందిన ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీని ప్రతి ఒక్కరూ కుటుంబసమేతంగా వచ్చి చూడవచ్చని ఎస్కేఎన్ పిలుపునిచ్చారు. బయట ఎక్కడైనా జనాలు తనని గుర్తుపట్టి సెల్ఫీలు దిగుతున్నారంటే అది తన గొప్పతనం కాదని, "వీడు కూడా మనలాంటి ఒక మెగా ఫ్యాన్" అని గుండెల్లో పెట్టుకోవడమేనని.. జీవితాంతం మెగాస్టార్ చిరంజీవి గారికి, అభిమానులకు రుణపడి ఉంటానని తన ప్రసంగాన్ని ముగించారు.