SKNకి 'బేబీ' డబ్బులు ఇంకా రాలేదా?
తాజాగా చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: M Prashanth | 15 July 2026 6:54 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ కావడం ఒక విషయం అయితే, ఆ హిట్ ద్వారా వచ్చిన ఆదాయం పూర్తిగా నిర్మాత చేతికి చేరడం మరో విషయం. బయటకు చూస్తే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన సినిమాలు నిర్మాతలకు వెంటనే కోట్ల రూపాయల లాభాలు తెచ్చిపెడతాయని చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయని నిర్మాత ఎస్కేఎన్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ మరోసారి చర్చకు దారి తీశాయి.
తాజాగా చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా విజయం సాధించడం, ఆ మూవీ ద్వారా వచ్చిన డబ్బులు నిర్మాతకు పూర్తిగా చేరడం రెండూ వేర్వేరు అంశాలని ఆయన స్పష్టం చేశారు. ఒక సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ కొన్ని ప్రాంతాల నుంచి రావాల్సిన మొత్తాలు చాలా కాలం తర్వాత కూడా రావచ్చని చెప్పారు.
అందుకు ఎగ్జాంపుల్ గా ఆయన బేబీ సినిమాను ప్రస్తావించారు. 2023లో విడుదలైన ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించిన వసూళ్లు సాధించింది. అయినప్పటికీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల నుంచి రావాల్సిన డబ్బులు పూర్తిగా అందలేదని ఎస్కేఎన్ వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సినిమా బిజినెస్ సిస్టమ్ ను చూసుకుంటే నిర్మాత నుంచి డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వరకు అనేక స్టేజెస్ ఉంటాయి. థియేటర్లలో వచ్చిన కలెక్షన్లు నేరుగా నిర్మాత ఖాతాలోకి వెళ్లవు. ముందుగా థియేటర్ వాటాలు, వివిధ ఖర్చులు, డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్లు, సెటిల్‌మెంట్లు వంటి ప్రక్రియలు పూర్తవ్వాలి. కొన్ని సార్లు ఏరియాల వారీగా లెక్కలు తేలడానికి నెలలు, మరికొన్ని సార్లు సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా భారీ విజయాలు సాధించిన సినిమాల విషయంలో వివిధ ప్రాంతాల్లోని డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాల కారణంగా లెక్కల క్లియరెన్స్ ఆలస్యమవుతుంటుంది. దీంతో సినిమా హిట్ అయినా నిర్మాతకు రావాల్సిన డబ్బులు వెంటనే రాకపోవచ్చు. ఎస్కేఎన్ కామెంట్స్ మీనింగ్ కూడా ఇదేనని సినీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సాధారణంగా ప్రేక్షకులు లేదా సినీ అభిమానులు ఒక సినిమా రూ.50 కోట్లు, రూ.100 కోట్లు వసూలు చేసిందని వింటే ఆ మొత్తం నిర్మాత లాభంగా మిగిలిందని అనుకుంటారు.
కానీ ఆ మొత్తంలో పలు వాటాలు, ఖర్చులు, బిజినెస్ అగ్రిమెంట్లు ఉంటాయి. అందుకే బాక్సాఫీస్ విజయం కనిపించినంత సులభంగా ఆర్థిక లాభంగా మారదని తెలుస్తోంది. ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాయి. సినిమా విజయాన్ని కేవలం కలెక్షన్లతో మాత్రమే కొలవలేమని, నిర్మాతకు తిరిగి వచ్చిన ఇన్వెస్ట్మెంట్, అసలైన ప్రాఫిట్స్ ఆధారంగానే కమర్షియల్ సక్సెస్ ను అంచనా వేయాల్సి ఉంటుందని అవి చెప్పకనే చెబుతున్నాయి. బేబీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా విషయంలోనే ఇంకా కొన్ని ప్రాంతాల డబ్బులు రావాల్సి ఉందంటే, సినిమా వ్యాపారం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
