కోలీవుడ్ 1000కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టకపోవడానికి కారణం?
తాజా ఇంటర్వ్యూలో స్టార్ హీరో శివకార్తికేయన్ తమిళ సినిమా 1000 కోట్ల క్లబ్ సాధించలేకపోవడానికి కారణాలను బహిర్గతం చేసారు.
By: Sivaji Kontham | 10 Sept 2025 8:45 AM ISTటాలీవుడ్ - బాలీవుడ్- శాండల్వుడ్ ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ సినిమాలను అందించాయి. పరిమిత బడ్జెట్లతో సినిమాలు తీసే మాలీవుడ్ ఇప్పట్లో 1000 కోట్ల క్లబ్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి. అయితే తెలుగు, హిందీ, కన్నడ పరిశ్రమలకు ధీటైన బడ్జెట్లతో సినిమాలను నిర్మించే, పురాతన భాష అని చెప్పుకునే తమిళులు మాత్రం ఇప్పటికీ 1000 కోట్ల క్లబ్ సినిమాని తీయలేకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. మద్రాసు పరిశ్రమ నుంచి విడిపోయిన టాలీవుడ్ ఎంతో ఎత్తుకు దూసుకెళుతున్నా తంబీలు మాత్రం రేసులో ఇంకా వెనకబడి ఉండడం ఆశ్చర్యపరుస్తోంది.
తాజా ఇంటర్వ్యూలో స్టార్ హీరో శివకార్తికేయన్ తమిళ సినిమా 1000 కోట్ల క్లబ్ సాధించలేకపోవడానికి కారణాలను బహిర్గతం చేసారు. ఇక్కడ పాన్ ఇండియా కంటెంట్ ఇవ్వలేకపోవడం.. కథలో అంత నాణ్యత లేకపోవడమో ఈ వైఫల్యానికి కారణమని అనుకుంటున్నానని అన్నారు. తమిళనాడులో టికెట్ ధరలకు కూడా ఒక సమస్య. అయితే టికెట్ ధరలు పెంచాలని నేను అనను కానీ, తమిళ సినిమా ఉత్తరాది ప్రజలకు ఎక్కువ రీచ్ అవ్వగలిగితే కచ్ఛితంగా 1000 కోట్ల క్లబ్ సాధించగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేసారు. తమిళంలో విడుదలైన కొన్ని సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్ చేరతాయని అనుకున్నా విఫలమయ్యాయని తెలిపారు. బెంగళూరు, ముంబైలో ఉన్నట్టు టికెట్ ధరలు తమిళనాడులో ఉండి ఉంటే జైలర్ చిత్రం 1000కోట్లు కాకపోయినా కనీసం 800కోట్లు వసూలు చేసి ఉండేదని కూడా అభిప్రాయపడ్డారు.
నేను అమరన్ సినిమా చేస్తున్నప్పుడు ఏ స్థాయి సినిమానో ఊహించలేదు. సినిమా నాణ్యత, టికెట్ ధరలు వసూళ్లను నిర్ధేశిస్తాయని శివకార్తికేయన్ అన్నారు. అదే సమయంలో టికెట్ ధరల పెంపును సమర్థించలేనని అనడం కొసమెరుపు. తమిళ సినిమా మరో రెండేళ్లలో 1000 కోట్ల క్లబ్ ని చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. పాన్-ఇండియన్ సినిమాలు నిర్మించలేము. కంటెంట్ ఆమోదయోగ్యత మాత్రమే సినిమాను పాన్ ఇండియన్‌గా చేయగలదని అన్నారు.
``ఉత్తరాది మార్కెట్లలో మన సినిమాలు మరింత చొచ్చుకుపోవాలి. కానీ అక్కడ ఒక సమస్య ఉంది. సాధారణంగా దక్షిణాదిన సినిమా విడుదలైన తర్వాత ఓటీటీలతో నాలుగు వారాల ఒప్పందాలు కుదుర్చుకుంటాము. ముంబై వంటి నగరాల్లో థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే సినిమా OTT ప్రీమియర్ జరిగితే మల్టీప్లెక్స్‌లు మన సినిమాను ప్రదర్శిస్తాయి. ఈ సమస్య లేకపోతే ఉత్తరాది బెల్ట్ లో అమరన్‌కు చాలా విస్తృతమైన రీచ్ లభించేది`` అని శివకార్తికేయన్ అన్నారు. శివకార్తికేయన్ కథానాయకుడిగా మురుగదాస్ తెరకెక్కించిన `మదరాసి` ఇటీవలే విడుదలై ఐదు రోజుల్లో ఇంకా 50కోట్ల క్లబ్ అందుకోలేకపోవడం షాకింగ్ రిజల్ట్. ఇది తమిళ సినిమా కంటెంట్ వెనకబాటును మరోసారి బయటపెట్టింది.
