లెజెండరీ నటుడి జ్ఞాపకార్దం శతజయంతి వేడుకలు!
భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మహానటుడు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ 25వ వర్ధంతి సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
By: Srikanth Kontham | 22 July 2026 12:43 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మహానటుడు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ 25వ వర్ధంతి సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. శివాజీ గణేశన్ 100వ జయంతి వేడుకలను 2028 సంవత్సరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ స్వయంగా అగ్రభాగాన నిలిచి నాయకత్వం వహిస్తారని రాష్ట్ర చలనచిత్ర సాంకేతిక శాఖ మంత్రి రాజమోహన్ అధికారికంగా ప్రకటించారు.
చెన్నైలోని అడయార్‌లో ఉన్న శివాజీ గణేశన్ స్మారక స్థూపం వద్ద మంత్రి రాజమోహన్‌తో పాటు ప్రముఖ నటుడు ప్రభు, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ , కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నటుడు ప్రభు, శివాజీ శతజయంతి వేడుకలను ప్రభుత్వపరంగా అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి విజయ్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. తమిళ సినిమా చరిత్రలో ఈ వేడుకలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆనందం వ్యక్తం చేశారు.
శివాజీ గణేశన్ జన్మదినం అక్టోబర్ 1, 2028న అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే ఇందుకు సంబం ధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. తమిళ చలనచిత్ర పరిశ్రమకు, దేశ సంస్కృతికి శివాజీ అందించిన అమూల్యమైన సేవలను స్మరించుకుంటూ ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. `కర్ణన్`, `వీరపాండ్య కట్టబొమ్మన్`, `భారతీయర్` వంటి ఎన్నో అసాధారణ పాత్రలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న శివాజీ జ్ఞాపకార్థం చేపట్టే ఈ కార్యక్రమం చారిత్రక ఘట్టంగా నిలుస్తుంది మంత్రి పేర్కొన్నారు.
తమిళ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మొట్టమొదటి అంతర్జాతీయ అవార్డు గ్రహీత .. పద్మ అవార్డులు, ఫ్రాన్స్ దేశపు `చెవలియర్` గౌరవాన్ని అందుకున్న శివాజీ గణేశన్ ప్రతిష్టకు తగ్గట్టుగా ఈ ఉత్సవాలు ఉండనున్నాయి. రాజకీయాలకు అతీతంగా కళారంగానికి చెందిన ప్రముఖులు, అభిమానులు అందరూ ఈ వేడుకల్లో భాగస్వాములు కానున్నారు. ప్రభుత్వ నేతృత్వంలోనే ఈ వేడుకలు జరగనుండటం తమిళ సినిమా పరిశ్రమలో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇండస్ట్రీ వర్గాలు .. కోలీవుడ్ అభిమానులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక లెజెండరీ నటుడి శతజయంతిని ప్రభుత్వమే అధికారికంగా పెద్దఎత్తున నిర్వహించడం ద్వారా భావి తరాలకు ఆయన కళాసేవను అందించినవారవుతారని విశ్లేషకుఉలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వేడుకల రూపకల్పన కోసం త్వరలోనే ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వాలు కూడా శివాజీ గణేశన్ పేరిట ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాయి. ఆ విషయంలో ఏ ప్రభుత్వం లెజెండరీ నటుడిపై పట్ల పక్షపాత వైఖరరిని ప్రదర్శించలేదు. తాజాగా విజయ్ ప్రభుత్వం మరింత ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహించడానికి సిద్దమవ్వడం విశేషం.
