Begin typing your search above and press return to search.

శివాజీ.. మరిన్ని హిట్లు పడితే..

ఒక దశలో మిడ్‌రేంజ్ హీరోల్లో శివాజీ పేరు తప్పనిసరిగా వినిపించేది. ఆ తర్వాత రాజకీయాల వైపు దృష్టి మళ్లడంతో సినిమాలకు దూరమయ్యారు.

By:  M Prashanth   |   7 July 2026 10:18 AM IST
శివాజీ.. మరిన్ని హిట్లు పడితే..
X

ఒకప్పుడు హీరోగా వరుస విజయాలు అందుకున్న శివాజీ.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అదే జోరు కొనసాగిస్తున్నారు. కొన్నేళ్లు సినిమాలకు దూరమైన ఆయన.. రీఎంట్రీ తర్వాత మాత్రం వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. వరుసగా ఛాన్సులు దక్కించుకుంటూ బిజీగా మారుతున్నారు. ఇప్పుడు అక్కినేని అఖిల్ లెనిన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అంతేకాదు, ప్రదీప్ రంగనాథన్ నిర్మిస్తున్న చిత్రంతో కోలీవుడ్‌ లోకి కూడా అడుగుపెడుతున్నారు.

ఆ జోరు ఇలాగే కొనసాగి మరిన్ని హిట్లు పడితే.. శివాజీ సెకండ్ ఇన్నింగ్స్‌ కు ఇక తిరుగుండదనే అభిప్రాయం వినిపిస్తోంది. శివాజీ కెరీర్ స్టార్టింగ్ లో సహాయ పాత్రలు చేసినప్పటికీ.. హీరోగా అవకాశాలు అందిపుచ్చుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, కామెడీ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. న్యాచురల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ లో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు.

ఒక దశలో మిడ్‌రేంజ్ హీరోల్లో శివాజీ పేరు తప్పనిసరిగా వినిపించేది. ఆ తర్వాత రాజకీయాల వైపు దృష్టి మళ్లడంతో సినిమాలకు దూరమయ్యారు. చాలా కాలం స్క్రీన్ పై కనిపించకపోవడంతో ఆయన సినీ జర్నీ ముగిసినట్టే అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఆయన కెరీర్‌ కు కీలక మలుపు తీసుకొచ్చింది. తన ఆలోచనా విధానం, ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శివాజీ.. మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.

బిగ్ బాస్ తర్వాత హీరో పాత్రల కోసం ఎదురుచూడకుండా.. కథలో ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ రోల్స్‌ ఎంచుకోవడం శివాజీకి పెద్ద ప్లస్ అయింది. ఇటీవల విడుదలైన కోర్ట్, దండోరా వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రశంసలు లభించాయి. అలాగే పలు వెబ్ సిరీస్‌ లలోనూ విభిన్న పాత్రలు పోషిస్తూ తాను అన్ని తరహా పాత్రలకు సరిపోతానని నిరూపిస్తున్నారు. ఇప్పుడు శివాజీ నటించిన లెనిన్ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన పాత్రపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. మరోవైపు ప్రదీప్ రంగనాథన్ నిర్మిస్తున్న కొత్త చిత్రంలో అవకాశం దక్కించుకోవడంతో కోలీవుడ్‌ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

తెలుగు తర్వాత తమిళ ప్రేక్షకులకు కూడా తన నటనను పరిచయం చేసుకునే అవకాశం ఆయనకు దక్కింది. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు మంచి డిమాండ్ ఉంది. కథను ముందుకు నడిపించే పాత్రల కోసం దర్శకులు సీనియర్ నటులనే ఎంపిక చేస్తున్నారు. అలాంటి సమయంలో శివాజీ కూడా పాత్రల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. హీరో ఇమేజ్‌ ను పక్కనబెట్టి, కథకు అవసరమైన పాత్రలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆయనకు కలిసి వస్తోంది.

ఒకప్పుడు హీరోగా విజయాలు అందుకున్న శివాజీ.. ఇప్పుడు నటుడిగా తన రెండో ఇన్నింగ్స్‌ సక్సెస్ ఫుల్ గా నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే వరుస అవకాశాలు అందుకుంటున్న ఆయనకు రాబోయే సినిమాలు కూడా విజయాలు సాధిస్తే.. తెలుగు మాత్రమే కాదు, తమిళంలోనూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. మరిన్ని హిట్లు ఖాతాలో చేరితే.. శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ టాలీవుడ్‌ లో సక్సెస్‌ ఫుల్ కమ్‌ బ్యాక్‌ లలో ఒకటిగా నిలిచిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.