కోలీవుడ్ నటుడి ఆశలన్నీ దానిపైనే!
తమిళ నటుడే అయినా పలు డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు శివ కార్తికేయన్.
By: Sravani Lakshmi Srungarapu | 5 Oct 2025 11:00 PM ISTతమిళ నటుడే అయినా పలు డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు శివ కార్తికేయన్. రీసెంట్ గా మదరాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ ప్రస్తుతం పరాశక్తి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆకాశమే నీ హద్దురా లాంటి సూపర్ హిట్ మూవీకి దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
పొంగల్ కానుకగా జనవరి 14న పరాశక్తి
టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ భామ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో జయం రవి, అథర్వ, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటిస్తుండగా, డాన్ పిక్చర్స్ బ్యానర్ లో ఆకాష్ భాస్కరన్ పరాశక్తిని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పరాశక్తి సినిమాను పొంగల్ కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఆఖరి దశ షూటింగ్ లో..
రిలీజ్ డేట్ టార్గెట్ ను అందుకోవాలని మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చిందని, పరాశక్తి షూటింగ్ ఆఖరి దశలో ఉందని సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
గట్టి పోటీనే..
ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అమరన్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న శివ కార్తికేయన్ కు మదరాసి సినిమా కూడా అదే రేంజ్ సక్సెస్ ఇస్తుందనుకుంటే ఆ సినిమా రిజల్ట్ అతన్ని నిరాశ పరిచింది. దీంతో పరాశక్తితో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు శివ కార్తికేయన్. అయితే ఈసారి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీనే ఉంది. తెలుగులో మన శంకరవరప్రసాద్ గారు, ప్రభాస్ ది రాజా సాబ్, అనగనగా ఒక రాజు తో పాటూ తమిళం నుంచి విజయ్ జననాయగన్ కూడా పోటీలో ఉన్నాయి. మరి ఈ పోటీలో పరాశక్తి ఏ మేరకు నిలబడుతుందో చూడాలి.
