శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ పేరుతో భారీ మోసం.. అసలు నిజం బయటపెట్టిన హీరో!
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ తాజాగా ఒక కీలక హెచ్చరికతో వార్తల్లో నిలిచారు.
By: Sravani Lakshmi Srungarapu | 12 May 2026 1:00 AM ISTతమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ తాజాగా ఒక కీలక హెచ్చరికతో వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియా విస్తరణతో సినిమా అవకాశాల పేరుతో జరుగుతున్న మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, తన నిర్మాణ సంస్థ పేరును వాడుకుంటూ కొందరు కేటుగాళ్లు అమాయక యువతను మోసం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై స్వయంగా స్పందిస్తూ అభిమానులు, యాక్టింగ్ పై ఆసక్తి ఉన్న యూత్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇటీవలి కాలంలో ఆడిషన్స్, న్యూ ఫేసెస్ రిక్వైర్డ్, హీరోయిన్ సెలెక్షన్స్ వంటి పేర్లతో సోషల్ మీడియాలో పలు ఫేక్ ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ తదుపరి సినిమాల కోసం నటీనటులను ఎంపిక చేస్తున్నామని చెప్పి, రిజిస్ట్రేషన్ ఫీజులు లేదా స్క్రీన్ టెస్ట్ ఛార్జీలు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సంస్థ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. తమ బ్యానర్ ఎప్పుడూ నటీనటుల ఎంపిక కోసం ఎలాంటి ఫీజులు వసూలు చేయదని, ఫోన్ కాల్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా డబ్బులు అడిగే వారిని అస్సలు నమ్మవద్దని స్పష్టం చేసింది.
సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే యూత్ లో చాలామంది సరైన అవగాహన లేకుండా ఇలాంటి మోసాలకు బలవుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ప్రముఖ నిర్మాణ సంస్థల పేర్లను ఉపయోగించడం ఇటీవల సాధారణంగా మారింది. ఈ క్రమంలో శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ ఇచ్చిన హెచ్చరిక ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇకపై తమ సంస్థ పేరును వాడుకుని ఎవరైనా మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటనలో పేర్కొన్నారు. అధికారిక సమాచారం తమ వెరిఫైడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే వస్తుందని, ఇతర ప్రకటనలను నమ్మకూడదని స్పష్టం చేశారు.
నటుడిగా కుటుంబ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించిన శివ కార్తికేయన్, నిర్మాతగా కూడా విభిన్నమైన కథలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకెళ్తున్నారు. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఆసక్తి చూపుతున్నఆయన పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు మోసాలకు పాల్పడటం బాధాకరమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సినీ రంగంలోకి రావాలనే కలలతో ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ తరహా మోసాలపై మరింత అవగాహన అవసరమనే చర్చ మొదలైంది.
ఇక సినిమాల విషయానికి వస్తే, ఈ ఏడాది స్టార్టింగ్ లో రిలీజైన పరాశక్తి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా, శివ కార్తికేయన్ ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే తాజా హెచ్చరికతో ఆయన మరోసారి బాధ్యత గల సెలబ్రిటీగా నిలిచారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు మాత్రమే కాదు, సినీ రంగంలోకి రావాలనుకునే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో వచ్చే అవకాశాల ప్రకటనలను జాగ్రత్తగా పరిశీలించాలని ఆయన సూచన ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
