సూపర్ స్టార్ తల తిక్క నిర్ణయంపై ట్రోల్స్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఇటీవల 'సితారే జమీన్ పర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
By: Ramesh Palla | 30 July 2025 11:24 AM ISTబాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఇటీవల 'సితారే జమీన్ పర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత అమీర్ ఖాన్‌కు ఒక మోస్తరు కమర్షియల్ హిట్ పడ్డట్లు అయింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు, పెట్టిన బడ్జెట్‌కు తగ్గట్లుగా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. అందుకే సితారే జమీన్ పర్ సినిమాను హిట్ ప్రాజెక్ట్‌గానే బాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. ఈ ఏడాదిలో బాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో డీసెంట్ కలెక్షన్స్ దక్కించుకున్న కొన్ని సినిమాల్లో ఈ సినిమా ఒకటి అనడంలో సందేహం లేదు. ఈ సినిమాను థియేటర్‌లలో మాత్రమే చూడాలని, ఓటీటీలో చూసే అవకాశం ఉండదని అమీర్ ఖాన్ ముందే ప్రకటించారు.
నెట్‌ఫ్లిక్స్ రూ.100 కోట్ల ఆఫర్
సినిమా ఇండస్ట్రీపై ఓటీటీ ఆధిపత్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో థియేటర్‌లు కుదేలవుతున్నాయి. అందుకే ఈ సినిమాను ఓటీటీకి ఇవ్వకూడదని ఆయన నిర్ణయించుకున్నారట. అంతే కాకుండా ఈ సినిమాను థియేటర్‌లో చూస్తేనే బాగుంటుందనే అభిప్రాయంను ఆయన వ్యక్తం చేశారు. అన్నట్లుగానే అమీర్ ఖాన్ ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థల నుంచి వంద కోట్లు, అంతకు మించిన ఆఫర్ వచ్చినా తిరస్కరించారట. బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమాకు రూ.100 కోట్లకు పైగా ఆఫర్ చేశారట. అది కూడా 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేస్తామని చెప్పారట. కానీ అమీర్ ఖాన్ సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించారని సమాచారం.
యూట్యూబ్‌లో రూ.100లకే 'సితారే జమీన్ పర్'
సితారే జమీన్ పర్ సినిమాను సొంత బ్యానర్‌లో నిర్మించిన అమీర్ ఖాన్ ఆరు నెలల వరకు డిజిటల్‌గా విడుదల చేయను అంటూ ప్రకటించాడు. అయితే సినిమా హెచ్‌డీ ప్రింట్ పైరసీ బయటకు వచ్చేంది. దాంతో అమీర్ ఖాన్ తన మాట మీద నిలబడే అవకాశం లేకుండా పోయింది. సినిమా విడుదలైన 50 రోజుల్లోనే డిజిటల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆయన ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఈ సినిమాను ఏ ఓటీటీకి ఇవ్వడం లేదు. ఈ సినిమాను యూట్యూబ్ ద్వారా విడుదల చేయబోతున్నారు. యూట్యూబ్‌లో ఈ సినిమాను చూడాలి అంటే రూ.100 లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే కేవలం రూ.100 లకే ఈ సినిమాను ఫ్యామిలీ మొత్తం ఇంట్లో కూర్చుని చూసే అవకాశంను కల్పించాను అని ప్రెస్ మీట్ పెట్టి మరీ అమీర్ ఖాన్ ప్రకటించడం చర్చనీయాంశం అవుతోంది.
అమీర్ ఖాన్ పై ట్రోల్స్
థియేట్రికల్ రిలీజ్ అయిన ఆరు నెలల వరకు సితారే జమీన్ పర్ సినిమాను డిజిటల్ మాధ్యమం ద్వారా తీసుకు రానని చెబుతూ వచ్చిన అమీర్‌ఖాన్ ఇప్పుడు 50 రోజులు కాగానే యూట్యూబ్ ద్వారా తీసుకు రావడం ఏంటో అని పలువురు ట్రోల్ చేస్తున్నారు. యూట్యూబ్ ద్వారా విడుదల చేయడం ద్వారా అమీర్ ఖాన్ ఏం సాధిస్తున్నట్లు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అమీర్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా తలతిక్క నిర్ణయం అనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. వంద కోట్లకు మించి ఆఫర్ వచ్చిన సమయంలో దాన్ని తిరస్కరించి ఇలా యూట్యూబ్ ద్వారా విడుదల చేసి అమీర్ ఖాన్ ఏం సాధించినట్లు అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. మరో వైపు అమీర్‌ఖాన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్న వారు కూడా ఉన్నారు.
అమీర్ ఖాన్ యూట్యూబ్ ద్వారా సినిమాను ఫ్రీగా స్ట్రీమింగ్ చేయడం లేదు. రూ.100 లు పెట్టి సినిమా చూడాల్సి ఉంటుంది. కనుక సినిమాకు పెద్ద మొత్తంలో అమౌంట్ వచ్చే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ ద్వారా ఈ సినిమా ఎక్కువ మొత్తంను రాబడితే చాలా సినిమాలకు ఆదర్శంగా నిలుస్తుంది అనే వారు ఉన్నారు. ఒక ఫ్యామిలీ మొత్తం కేవలం రూ.100లకే ఇంట్లో ఉండి సినిమా చూసే అవకాశం ఇవ్వడం ద్వారా అమీర్ ఖాన్ కొత్త ట్రెండ్‌కి తెర లేపినట్లు అయిందని కొందరు సినీ వర్గాల వారు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితో ఓటీటీ వారు ఇస్తామన్న రూ.100 కోట్లకు పైగా యూట్యూబ్ ద్వారా సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యం కాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
