సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకం!
తెలుగు రాష్ట్రాల సినీ చరిత్రలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు పల్లెటూళ్ల నుండి పట్నాల వరకు వినోదానికి ఇవే ప్రధాన చిరునామాలు.
By: Srikanth Kontham | 18 April 2026 3:00 PM ISTతెలుగు రాష్ట్రాల సినీ చరిత్రలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు పల్లెటూళ్ల నుండి పట్నాల వరకు వినోదానికి ఇవే ప్రధాన చిరునామాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2000కు పైగా థియేటర్లు ఉండేవి. కానీ గడిచిన పదేళ్ల కాలంలో పరిస్థితులు తలకిందులయ్యాయి. మారుతోన్న కాలం, సాంకేతికత కారణంగా సగానికి పైగా థియేటర్లు మూతపడటం ఇప్పటికే సినీ ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ రకమైన పరిస్థితికి ఎలాంటి కారణాలు తలెత్తాయన్నది తెలిసిందే. సింగిల్ స్క్రీన్ల పతనానికి ప్రధాన కారణం భారీగా పెరిగిన నిర్వహణ ఖర్చులు. కరెంటు బిల్లులు, మున్సిపల్ పన్నులు వంటివి థియేటర్ యాజమానులకు భారంగా మారాయి.
దీంతో పాటు మల్టీప్లెక్స్‌ల సంస్కృతి పెరగడంతో, పట్టణాల్లోని ప్రేక్షకులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. మల్టీప్లెక్స్‌లలో లభించే సౌకర్యాలు, విలాసవంతమైన సీటింగ్ సింగిల్ స్క్రీన్లలో లేకపోవడంతో యువత క్రమంగా వీటికి దూరమవుతోంది. సాంకేతిక మార్పులు కూడా ఎగ్జిబిటర్లను ఇబ్బందుల్లోకి నెట్టాయన్నది అంతే వాస్తవం. పాత ప్రొజెక్టర్ల స్థానంలో డిజిటల్ అప్‌గ్రేడ్ చేయడం, సౌండ్ సిస్టమ్‌ను మార్చడం వంటివి లక్షలాది రూపాయల ఖర్చుతో కూడుకున్న పనులు. చిన్న పట్టణాల్లోని థియేటర్ల యజమానులకు అంత పెట్టుబడి పెట్టడం తలకు మించిన భారంగా మారుతోంది.
ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ కావడంతో థియేటర్లను నడపడం కంటే వాటిని షాపింగ్ మాల్స్‌గా లేదా ఫంక్షన్ హాళ్లుగా మార్చడమే మేలని యాజమాన్యాలు భావిస్తున్నాయి. మరోవైపు ఆదాయ పంపకాల విషయంలో నిర్మాతలు -ఎగ్జిబిటర్ల మధ్య నెలకొన్న వివాదాలు సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. సినిమా ఆడినా? ఆడకపోయినా? థియేటర్ల అద్దెలు చెల్లించాల్సి రావడం, పర్సెంటేజ్ పద్ధతిలో సరైన లాభాలు రాకపోవడం వల్ల ఎగ్జిబిటర్లు నష్టాల్లో కూరుకుపోతున్నారన్నది నిత్యం తెరపైకి వస్తోన్న అంశమే. పెద్ద సినిమాల సమయంలో ఇచ్చే కమీషన్లు కూడా తమ మనుగడకు సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సామాన్య - మధ్యతరగతి ప్రేక్షకులకు నేటికీ సింగిల్ స్క్రీన్లే ఆశాదీపాలు. మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు, తినుబండారాల ఖర్చులు సామాన్యుడికి అందుబాటులో ఉండవు. కుటుంబం మొత్తం సినిమా చూడాలంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లే సరైన వేదికగా భావిస్తారు. కానీ ఎగ్జిబిటర్ల కష్టాలు ఇండస్ట్రీ సహా ప్రభుత్వాల నుండి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లేకపోవడంతో థియేటర్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. తెలుగు సినిమా ప్రాభవం కాపాడాలన్నా? సామాన్యుడికి వినోదం దూరం కాకూడదన్నా? సింగిల్ స్క్రీన్లను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం విద్యుత్ రాయితీలు కల్పించడం, టికెట్ ధరల విషయంలో వెసులుబాటు కల్పించడం వంటి చర్యలు తీసుకుంటే తప్ప థియేటర్లు నిలదొక్కుకోవడం కష్టం. లేనిపక్షంలో మరిన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూత పడటం ఖాయం.
