మంగ్లీ కేసులో డైరెక్టర్ వేణు? అసలు నిజమేంటి?
సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
By: M Prashanth | 11 April 2026 9:13 PM ISTసింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మైక్రోఫైనాన్స్ పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగిందనే ఆరోపణలతో పాటు, తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ సహా మరికొందరిపై ఆరోపణలు ఉన్నట్లు సమాచారం.
అదే సమయంలో ఆ వ్యవహారంలో విరాట పర్వం దర్శకుడు వేణు ఊడుగుల పేరు కూడా ఉన్నట్లు వార్తలు రావడంతో ఆయన స్పందిస్తూ వివరణ ఇచ్చారు. నిజానిజాలు తెలుసుకోకుండా తన పేరును ఆ కేసుతో కలిపి ప్రచారం చేయడం వల్ల తన ప్రతిష్టకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంజాగుట్ట పోలీసులు కూడా తమ విచారణలో ఇదే విషయాన్ని నిర్ధారించినట్టు ఆయన వెల్లడించారు.
తాజాగా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో వేణు ఉడుగుల మాట్లాడుతూ, "కొన్ని మీడియా వేదికల్లో నా పేరును మంగ్లీ కేసుతో లింక్ చేస్తూ వచ్చిన వార్తలు చూసి బాధ కలిగింది. నాకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదు. మంగ్లీ, ఫిర్యాదు చేసిన అడ్వకేట్ ఇద్దరూ నాకు పరిచయం ఉన్నవారే. వారు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మాత్రమే నేను సూచించాను" అని తెలిపారు.
దాని కంటే మించి ఆ వ్యవహారంలో తన పాత్ర ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. అలాగే ఆ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ లో తన పేరు నిందితుడిగా ఎక్కడా లేదని ఆయన తెలిపారు. ఫిర్యాదు చేసిన సుబ్బారావు కూడా మీడియా ముందు మాట్లాడుతూ వేణు ఊడుగులకు ఆ వ్యవహారంతో సంబంధం లేదని చెప్పినట్లు గుర్తు చేశారు. పంజాగుట్ట పోలీసులు కూడా తమ విచారణలో ఇదే విషయాన్ని నిర్ధారించినట్టు ఆయన వెల్లడించారు.
అసలు ఆ కేసు ఎలా వెలుగులోకి వచ్చిందంటే?
సికింద్రాబాద్ కు చెందిన సుబ్బారావు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఇటీవల హేమకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తిరుమల్ తదితరులు ఆయనను సంప్రదించి తమకు జరిగిన మోసంపై వివరాలు వెల్లడించారు. మైక్రోఫైనాన్స్ పథకాల పేరిట అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి, మంగ్లీ మరియు ఆమె సోదరుడు సహా మరికొందరు తమ నుంచి సుమారు రూ.10 కోట్ల వరకు సేకరించినట్లు వారు ఆరోపించారు.
గోకులానందన ఇన్‌ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దిగుమతి-ఎగుమతి, రియల్ ఎస్టేట్, ట్రేడింగ్ వ్యాపారాల్లో పెట్టుబడి పెడతామని చెప్పి డబ్బులు తీసుకున్నారని బాధితులు తెలిపారు. ఆ విషయంపై వివరణ కోరేందుకు సుబ్బారావు మంగ్లీని సంప్రదించగా, ఆమె తనతో అవమానకరంగా మాట్లాడిందని, తన వృత్తిని కించపరిచిందని ఆరోపించారు. కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చి, డబ్బులు ఆఫర్ చేసినట్లు చెప్పారు. తాను అంగీకరించకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
