94 ఏళ్ల సింగీతం....నాటౌట్ అంటూ అద్భుతం !
ఎక్కడ మాయాబజార్, ఎప్పటి స్వర్ణయుగం. నాటి నుంచి నేటి వరకూ తెలుగు సినిమా రంగంలో అనేక మలుపులను చూస్తూ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు సింగీతం శ్రీనివాసరావు.
By: Satya P | 31 Jan 2026 8:53 PM ISTసింగీతం శ్రీనివాసరావు సినీ ప్రస్థానం గురించి చెప్పాలీ అంటే ఎనభై ఏళ్ళ పై దాటి ఉంటుంది. ఎక్కడ మాయాబజార్, ఎప్పటి స్వర్ణయుగం. నాటి నుంచి నేటి వరకూ తెలుగు సినిమా రంగంలో అనేక మలుపులను చూస్తూ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు సింగీతం శ్రీనివాసరావు. ఆయన కేవీ రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా చేరి మాయాబజార్ కి పనిచేశారు. అదే వరసలో మరిన్ని చిత్రాలకు సహాయ దర్శకత్వ శాఖలో పనిచేసి డైరెక్షన్ లోని ఒడుపులను తెలుసుకున్నారు. ఇపుడు ఆయన వయసు అచ్చంగా 94 ఏళ్ళు. ఈ వయసులో మరోసారి మెగా ఫోన్ పట్టారు. యాభై ఏళ్ళు నిండిన వైజయంతి సంస్థ వంటి ప్రఖ్యాత సంస్థకు ఆయన పదమూడేళ్ళ విరామం తరువాత దర్శకత్వం వహించబోతున్నారు. ఇది నిజంగా గ్రేట్ కాదు గ్రేటెస్ట్ అచీవ్ మెంట్ అని అంతా అంటున్నారు.
దర్శకుడిగా అయిదున్నర దశాబ్దాలు :
ఇక సింగీతం శ్రీనివాసరావు 1970 తొలినాళ్ళలో దర్శకుడిగా మారారు. ఆయన తీసిన తొలి చిత్రం నీతి నిజాయితీ. ఈ మూవీతో మెగా ఫోన్ తొలిసారిగా పట్టి పూర్తి స్థాయి డైరెక్టర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఆ సినిమా అంతగా ఆడలేదు, ఆ తరువాత ఆయనకు వెంటనే అవకాశాలు రాలేదు, ఇక జమీందారు గారి అమ్మాయి అని తరువాత కాలంలో ఆయన దర్శకత్వం వహించి జనం ముందుకు తెచ్చారు. నవతా ఆర్ట్స్ పతాకం మీద వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. సింగీతం అభిరుచిని చాటింది ఆ తరువాత ఆయన వెనక్కి చూసుకోకుండా వరసగా సినిమాలు తీశారు.
ఎన్నో ప్రయోగాలతో :
ఇదిలా ఉంటే సింగీతం అమెరికా అమ్మాయి మూవీ 1970 దశకంలో ఒక కొత్త ట్రెండ్ గా నిలిచింది. అలాగే పంతులమ్మ మూవీతో ఫ్యామిలీ డైరెక్టర్ అనిపించుకున్నారు. సొమ్మొకడిది సోకొకడిది అన్న మూవీతో కమల్ హాసన్ కి తెలుగులో మంచి సక్సెస్ ని ఇచ్చారు. అలా ఆయన అనేక మూవీస్ తీస్తూనే ప్రయోగాలకు పెద్ద పీట వేశారు అందులో విచిత్ర సోదరుకు ఒక ఎత్తు అయితే పుష్కప విమానం టాకీ యుగంలో మూకీ మూవీగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మైఖేల్ మదన కామరాజు కథ, అమావాస్య చంద్రుడు, అపూర్వ సహోదరులు వంటి సినిమాల ద్వారా తనదైన ముద్ర బలంగా వేశారు. ఉషాకిరణ్ మూవీస్ వారి బేనర్ లో తీసిన మయూరి సినిమా సింగీతం వారి మరో ప్రతిభకు మచ్చు తునక. అంతే కాదు తెలుగులో వచ్చిన కొద్ది సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ ఆదిత్య 369 సింగీతం కీర్తిని చాటింది. జానపదంలో తీసిన భైరవద్వీపంతో 90లలో మరో బిగ్ హిట్ కొట్టి సినిమాతో ప్రేక్షకులు మరచిపోతున్న జానపదచిత్రాలను గుర్తు చేశారు.
తాజా మూవీతో :
ఇదిలా ఉంటే తెలుగుతో పాటు కన్నడంలో అనేక సినిమాలు తీసి హిట్ కొట్టిన సింగీతం 2013లో చివరి సారిగా వెల్ కం ఒబామా తీశారు. ఇన్నేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ఆయన అందిస్తున్న మూవీ వైజయంతి మూవీస్ వారు తీస్తుండడం విశేషం. ప్రపంచ దిగ్గజ దర్శకుల సరసగ చేరదగిన అన్ని అర్హతలు ఉన్న సింగీతం ఆ విధమైన గుర్తింపు అయితే వచ్చింది కానీ ప్రభుత్వ పరంగా పురస్కారాలు అయితే పెద్దగా రాలేదు. అయితే ఆయన 94 ఏళ్ళ ముదిమి ప్రాయంలో తీయబోతున్న ఈ సినిమా మాత్రం కేవలం సినీ రంగానికి చెందిన వారికే కాదు ఎంతో మందికి స్పూర్తి ఇస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే వయసు భారం అంటూ కాడె వదిలేస్తున్న వారికి సింగీతం లివింగ్ లెజెండ్ గా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మారుతున్నారు కాబట్టి.
