'సింగీతా'నికి ఇక సెలవు.. ముగిసిన అంత్యక్రియలు!
సెలబ్రిటీల సంతాపం, అభిమానుల అశ్రునయనాల మధ్య సింగీతం శ్రీనివాసరావు పుష్పక విమానంలో భువి నుండి నింగికెగిసారు.
By: Madhu Reddy | 5 Oct 2026 12:28 AM ISTచిత్ర సీమలో ప్రయోగాత్మక దర్శకుడిగా తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న సింగీతం శ్రీనివాసరావు.. 94 సంవత్సరాల వయసులో వయోభారంతో చెన్నైలోని కావేరి ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అక్టోబర్ మూడవ తేదీన తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీలో ఒక శకం ముగిసింది. పలువురు సెలబ్రిటీలు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నారు. మరి కొంతమంది సింగీతం శ్రీనివాసరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
సెలబ్రిటీల సంతాపం, అభిమానుల అశ్రునయనాల మధ్య సింగీతం శ్రీనివాసరావు పుష్పక విమానంలో భువి నుండి నింగికెగిసారు. లెజెండ్రీ ఫిలిం డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ఈయన అంత్యక్రియలు ముగిసాయి. చెన్నైలోని నేసపాక్కం స్మశాన వాటికలో కుటుంబ సభ్యులు, ఆయన అంతక్రియలను నిర్వహించారు. అంతకుముందు ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం విరుగంబక్కంలోని ఆయన నివాసంలో ఉంచారు.
సింగీతం శ్రీనివాసరావు విషయానికి వస్తే ప్రతిభావంతులైన దర్శకులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ్ ,కన్నడ భాషలలో సందేశాత్మక, ప్రయోగాత్మక, కథా భరితమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వైవిద్యభరిత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈయన.. అటు ప్రేక్షకుల చేత, ఇటు విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నారు. ఆయన కెరియర్లో మయూరి, పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం, మైఖేల్ మదన కామరాజు లాంటి ఎన్నో చిత్రాలు సినిమా ఉన్నంతవరకు చిరస్థాయిగా ఉంటాయనడంలో సందేహం లేదు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో సుమారుగా 61 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన.. రచయితగా, నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలకు పనిచేశారు.
దశాబ్దాలు మారినా.. తనలోని వైవిధ్య భరితమైన ఆలోచనా విధానం మారలేదు అని , ఈ ఏడాది రూపొందించిన సింగ్ గీతం చిత్రంతో నిరూపించారు. టెక్నాలజీని ఉపయోగించి సెట్ కి వెళ్లకుండానే.. ఇంట్లో కూర్చొని సింగ్ గీతం చిత్రానికి దర్శకత్వం వహించారు. 94 ఏళ్ల వయసులో కూడా దర్శకత్వం వహించి పలువురు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు సింగీతం శ్రీనివాసరావు.
ఇక ఈయన బాల్యం, విద్యాభ్యాసం విషయానికి వస్తే.. సెప్టెంబర్ 21 1931లో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి ప్రధానోపాధ్యాయులు కాగా, తల్లి వయోలిన్ వాయిద్య నిపుణురాలు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజ్ నుండి డిగ్రీ పట్టా అందుకున్న ఈయన .. సూళ్లూరుపేటలో టీచరుగా కొన్నాళ్ళు ఉద్యోగం కూడా చేశారు.
సంగీతం శ్రీనివాసరావు వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 1960లో లక్ష్మీ కళ్యాణిని వివాహం చేసుకున్నారు. స్క్రిప్ట్ రచనలలో తోడ్పడుతూ ఆయనకు సినీ కెరియర్లో ఎంతో సహాయం అందించారు లక్ష్మి కళ్యాణి . అయితే ఆమె పేరు పైనే సింగీతం శ్రీనివాసరావు శ్రీ కళ్యాణియం అనే ఒక పుస్తకాన్ని 2012లో రాశారు . అయితే కొంతకాలం అనారోగ్యంతో బాధపడిన లక్ష్మీ కళ్యాణి 2022 మే 28న ప్రతి శ్వాస విడిచారు. భార్య మరణించిన నాలుగేళ్లకు సింగీతం శ్రీనివాసరావు కూడా మరణించి ఆమె వద్దకు చేరుకున్నారు.
