ఔత్సాహిక ఫిలింమేకర్స్ కోసం సింగీతం టాప్-10 టెక్నిక్స్
ఈ నేపథ్యంలో ఔత్సాహిక ఫిలింమేకర్స్ లెజెండరీ సింగీతం నుండి నేర్చుకోవాల్సిన టాప్-10 టెక్నిక్స్ ఇవే:
By: Sivaji Kontham | 14 Jun 2026 1:40 AM ISTలెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఫిలింమేకింగ్ ప్రత్యేకతలు ఏమిటి? ఆయన ఆలోచనా ధోరణి లో అడ్వాన్స్ డ్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది? వందేళ్ల తర్వాత చూసినా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేలా సినిమా తీయడం ఎలా?
భారతీయ చలనచిత్ర రంగానికి సరికొత్త పంథాను పరిచయం చేసిన అగ్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులోనూ ఆయన సృజనాత్మకత ఏమాత్రం తగ్గలేదని తాజాగా విడుదలైన `సింగ్ గీతం` చిత్రం మరోసారి నిరూపించింది. ఎలాంటి సంభాషణలు లేకుండా కేవలం లయబద్ధమైన సంగీతంతో కథను నడిపించిన ఈ ప్రయోగాత్మక మ్యూజికల్ ఫాంటసీ నేటితరం ఔత్సాహిక చలనచిత్ర దర్శకులకు ఒక గొప్ప పాఠ్యపుస్తకంలా నిలిచింది. వందల కోట్ల బడ్జెట్లు, భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) వెనుక పరుగులు తీస్తున్న నేటి కాలంలో కథను, టెక్నిక్‌ను నమ్మి సినిమాను ఎలా ఆవిష్కరించవచ్చో సింగీతం ఈ చిత్రం ద్వారా చేసి చూపించారు.
సింగీతం శ్రీనివాసరావు ఫిలింమేకింగ్ శైలి ఎప్పుడూ యూనిక్ గా ఉంటుంది. ఆయన ఎంచుకునే కథల్లో వైవిధ్యం, వాటిని తెరపై ఆవిష్కరించే విధానం పరిశ్రమకు ఎప్పుడూ కొత్తే. పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం వంటి చిత్రాలను గమనిస్తే... ఆయన దశాబ్దాల క్రితమే తన ఆలోచనా ధోరణిలో ఎంత అడ్వాన్స్‌డ్ సిస్టమ్‌ను కలిగి ఉన్నారో స్పష్టమవుతుంది. సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లోనే టైమ్ ట్రావెల్, మూకీ చిత్రాల వంటి అద్భుత ప్రయోగాలు చేసిన ఆయన.. నేటి ఆధునిక కాలంలో డిజిటల్ టెక్నాలజీని సైతం కేవలం కథకు అవసరమైన మేరకే వాడుకుంటూ.. సృజనాత్మకతకు పెద్దపీట వేస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది.
వందేళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు మెచ్చేలా, క్లాసిక్స్‌గా నిలిచిపోయే సినిమాలను తీయడం ఎలాగో ఆయన తన సుదీర్ఘ కెరీర్ ద్వారా నేర్పించారు. ఒక సినిమా కాలపరీక్షను తట్టుకుని నిలబడాలంటే అందులో ట్రెండ్స్ కంటే కూడా బలమైన మానవీయ కోణం ఉండాలని ఆయన విశ్వసిస్తారు. `సింగ్ గీతం` చిత్రంలోనూ మానవ స్వార్థం నుండి పర్యావరణాన్ని, ఒక గ్రామంలో మిగిలి ఉన్న చివరి చెట్టును కాపాడుకునే పల్లెటూరి కథను ఎంచుకోవడం ఆయన సామాజిక స్పృహకు నిదర్శనం. కథలో యూనివర్శల్ సమస్య ఉన్నప్పుడే ఆ సినిమా ఎప్పటికీ సజీవంగా ఉంటుందని ఆయన నిరూపించారు.
ముఖ్యంగా ఈ చిత్రంలో ఆయన మట్టి వాసనలను, స్థానికతను జోడించి ప్రయోగాత్మకంగా కథను నడిపించిన విధానం అద్భుతం. నేటితరం దర్శకులు పాన్-ఇండియా ఇమేజ్ కోసం కథల్లోని సహజత్వాన్ని వదిలేస్తున్న తరుణంలో.. మన మూలాలను, గ్రామీణ నేపథ్యాన్ని నమ్ముకుని కూడా అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో సినిమా తీయవచ్చని ఈ చిత్రం ద్వారా పాఠం చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన లయబద్ధమైన సంగీతం, నాగ్ అశ్విన్ - వైజయంతీ మూవీస్ వంటి మేధావుల సహకారంతో సింగీతం సృష్టించిన ఈ దృశ్యకావ్యం.. బడ్జెట్ కంటే దర్శకుడి బలమైన సంకల్పమే అత్యంత కీలకమని చాటిచెప్పింది.
ఈ నేపథ్యంలో ఔత్సాహిక ఫిలింమేకర్స్ లెజెండరీ సింగీతం నుండి నేర్చుకోవాల్సిన టాప్-10 టెక్నిక్స్ ఇవే:
1. బడ్జెట్ కంటే కథలోని స్వచ్ఛతను, సహజత్వాన్ని నమ్మడం.
2. సంభాషణలు లేకపోయినా విజువల్స్- సంగీతంతోనే కథను నడిపించగలగడం.
3. స్థానిక మూలాలను, మట్టి వాసనలను అంతర్జాతీయ కథాంశంతో ముడిపెట్టడం.
4. సాంకేతికతను (VFX) కథను ఎలివేట్ చేయడానికి మాత్రమే వాడుకోవడం.
5. వయసుతో సంబంధం లేకుండా నిరంతరం కొత్త ప్రయోగాలు చేసే ధైర్యం..
6. గ్లోబల్ సమస్యలను (వాతావరణ మార్పులు) సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ఫెయిరీ టేల్ తరహాలో చెప్పడం.
7. కమర్షియల్ ఫార్ములాలకు లొంగకుండా సృజనాత్మకతను కాపాడుకోవడం.
8. శబ్దాల రొద (లావుడ్ మ్యూజిక్) లేకుండా నిశ్శబ్దాన్ని, లయను రీ-రికార్డింగ్‌లో వాడుకోవడం.
9. నేటి తరం సాంకేతిక నిపుణులతో సమన్వయం చేసుకుంటూ అడ్వాన్స్‌డ్ మేకింగ్ స్టైల్‌ను అలవర్చుకోవడం.
10. సినిమా అసలైన శక్తి కలెక్షన్ల లెక్కల్లో లేదు.. ప్రేక్షకుల గుండెలను తాకడంలోనే ఉందనే ప్రాథమిక సూత్రాన్ని గుర్తుంచుకోవడం.
