Begin typing your search above and press return to search.

ఆ డైరెక్ట‌ర్ హిట్టు కొడితే టాలీవుడ్‌కు ఓ గుణ‌పాఠమే?

నేష‌న‌ల్ అవార్డ్‌తో పాటు ఫిల్మ్ ఫేర్‌ని ద‌క్కించుకున్న ఈ సినిమా నంది అవార్డుల్లో రికార్డు సృష్టించి అప్ప‌ట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.

By:  Tupaki Entertainment Desk   |   2 Feb 2026 4:00 PM IST
ఆ డైరెక్ట‌ర్ హిట్టు కొడితే టాలీవుడ్‌కు ఓ గుణ‌పాఠమే?
X

మూస ధోర‌ణి క‌థ‌ల ప్ర‌వాహంలో కొట్టుకుపోతున్న టాలీవుడ్‌కు స‌రికొత్త పాఠాలు నేర్పిన లెంజెండ‌రీ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీ‌నివాస‌రావు. ప్ర‌యోగాలు చేయ‌డం ఆన‌య‌కు వెన్నెతో పెట్టిన విద్య‌. ఇండ‌స్ట్రీ అంతా ఒక‌వైపు మూస క‌థ‌ల వెంట ప‌రుగెడుతుంటే ప్ర‌యోగాలకు పెద్ద పీట వేసిన ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. సుధా చంద్ర‌న్ రియ‌ల్ స్టోరీ స్ఫూర్తితో రూపొందించిన `మ‌యూరి` మూవీతో ప్ర‌యోగాల‌కు శ్రీ‌కారం చుట్టారు. నేష‌న‌ల్ అవార్డ్‌తో పాటు ఫిల్మ్ ఫేర్‌ని ద‌క్కించుకున్న ఈ సినిమా నంది అవార్డుల్లో రికార్డు సృష్టించి అప్ప‌ట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.

1972లో నీతీ-నిజాయితీ` సినిమాతో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేసిన సింగీతం ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌క‌నిర్మాత కె.వి.రెడ్డి వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన విష‌యం తెలిసిందే. ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన సింగీతం చేసిన ప్ర‌యోగాలు అన్నీ ఇన్నీకావు. `మ‌యూరి` సినిమాతో ఎంతో మందిలో స్ఫూర్తిని నింపిన ఆయ‌న టాకీ యుగంలో `పుష్ప‌క విమానం` అంటూ మూకీ మూవీ చేసి ఔరా అనిపించారు. `విచిత్ర సోద‌రులు` సినిమాలో మూడు అడుగుల క‌మ‌ల్ హాస‌న్‌ని చూపించి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

అంతేనా తెలుగు హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌ని రెండు విభిన్న‌మైన క్యారెక్ట‌ర్ల‌లో చూపిస్తూ `ఆదిత్య 369`తో ప్రేక్ష‌కుల్ని భూత‌, భ‌విష్య‌త్ కాలాల‌కు తీసుకెళ్లి ఆశ్చ‌ర్య‌ప‌రిచడ‌మే కాకుండా టైమ్ మెషీన్ ప్ర‌యోగంతో హాలీవుడ్ ఫీల్ ఇచ్చారు. మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు ఆదిప‌త్యం చెలాయిస్తున్న స‌మ‌యంలో అంద‌రికి భిన్నంగా అడుగులు వేస్తూ జ‌న‌ప‌ద మూవీ `భైర‌వ‌ద్వీపం` చేసి శ‌భాష్ అనిపించుకున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి న‌లుగురికి న‌చ్చిన‌ది నా క‌స‌లే న‌చ్చ‌దురో..ప‌రులెవ‌రు న‌డవ‌ని దార్లో నే న‌డిచెద‌రో అన్న‌ట్టుగా సింగీతం ప్ర‌యాణం సాగింది.

బాల‌కృష్ణ‌తో `ఆదిత్య 369 చేసి సంచ‌ల‌నం సృష్టించిన ఈ లెజెండ‌రీ డైరెక్ట‌ర్ కొన్నేళ్ల క్రితం దీనికి సీక్వెల్‌గా `ఆదిత్య‌999` చేయాల‌ని ప్లాన్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన క‌థ‌ని కూడా సిద్ధం చేశారు. కానీ బాల‌య్య ఎందుకు ముందుకు రాక‌పోవ‌డంతో అది కార్య‌రూపం దాల్చ‌లేదు. అయితే ఎప్ప‌టికైనా దాన్ని తానే డైరెక్ట్ చేస్తాన‌ని బాల‌య్య ఆమ‌ధ్య స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. ఇదిలా ఉంటే సింగీతం శ్రీ‌నివాస‌రావు 94 ఏళ్ల వ‌య‌సులో డైరెక్ట‌ర్‌గా మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వ‌య‌సులో `సెంచ‌రీలు కొట్టే వ‌య‌సు మాది` అన్న‌ట్టుగా సింగీతం కొత్త సినిమా మొద‌లు పెట్ట‌డం..దానికి దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌టం అంద‌రిలోనూ కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది. 60 ఏళ్లు పైబ‌డిన ద‌ర్శ‌కులు అర్థం ప‌ర్థం లేని సినిమాలు తీసి త‌మ క్రేజ్‌ని కోల్పోవ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో 94 ఏళ్ల సింగీతం శ్రీ‌నివాస‌రావు ఓ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌టం అంద‌రిని షాక్‌కు గురి చేస్తోంది. ఆయ‌న త‌న గ‌త చిత్రాలు పుష్ప‌క విమానం, విచిత్ర సోద‌రులు, ఆదిత్య 369 త‌ర‌హాలో ఆక‌ట్టుకుంటే మాత్రం టాలీవుడ్ పెద్ద గుణ‌పాఠం నేర్చుకోవ‌డం ఖాయం అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.