'సింగ్ గీతం' వసూళ్ల సంగతేంటి? చేయాల్సిందేంటి?
దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ సినిమా వసూళ్ల పరిస్థితి ఏంటి? ఇకపై మేకర్స్ చేయాల్సింది ఏంటి? అంటూ చర్చ నడుస్తోంది.
By: M Prashanth | 21 Jun 2026 9:29 AM IST94 ఏళ్ల వయసులోనూ ఒక కొత్త ఆలోచనతో సినిమా తీసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. అలాంటి దిగ్గజ దర్శకుడి నుంచి వచ్చిన సింగ్ గీతం మంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో పరుగులు పెట్టడం లేదు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ సినిమా వసూళ్ల పరిస్థితి ఏంటి? ఇకపై మేకర్స్ చేయాల్సింది ఏంటి? అంటూ చర్చ నడుస్తోంది.
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, నాగ్ అశ్విన్ నిర్మాణంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఆ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా కాన్సెప్ట్, మ్యూజిక్, విజువల్ ట్రీట్, సింగీతం మార్క్ మ్యాజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాయి. అయితే మంచి టాక్ వచ్చినంతగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొదటి వారంలో ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. షేర్ పరంగా చూస్తే దాదాపు రూ.3.2 కోట్ల వరకు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది థియేట్రికల్ బిజినెస్ ను బట్టి బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఇంకా సుమారు రూ.2.8 కోట్ల షేర్ అవసరం ఉంది. ప్రస్తుతం మొదటి వారం పూర్తయ్యే సరికి కేవలం 53 శాతం రికవరీ మాత్రమే నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఆ సినిమా పరిస్థితి కేవలం థియేట్రికల్ కలెక్షన్లతో అంచనా వేయడం సరైంది కాదని మూవీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కారణం, విడుదలకు ముందే ఆ చిత్రానికి భారీ స్థాయిలో నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ రూపంలో దాదాపు రూ.14 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు సమాచారం. దీంతో సినిమా బడ్జెట్ లో ఎక్కువ భాగం ముందుగానే రికవరీ అయింది.
దాదాపు రూ.22 కోట్ల వ్యయంతో రూపొందిన ఆ మూవీ థియేటర్లలోకి రాకముందే సగానికి పైగా బడ్జెట్ ను వెనక్కి తెచ్చుకుంది. అందువల్ల థియేటర్లలో వసూళ్లు నెమ్మదిగా ఉన్నప్పటికీ, నిర్మాతలు భారీ నష్టాల్లో పడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక నుంచి వచ్చే థియేట్రికల్ ఇన్ కమ్ ప్రాజెక్ట్ కు అదనపు లాభంగా మారే అవకాశం ఉంది.
అయితే సినిమా మరింత మందికి చేరాలంటే ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ తో రూపొందించిన ప్రత్యేక ప్రమోషనల్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే తరహాలో మరికొన్ని వినూత్న ప్రమోషన్స్ చేపడితే ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, క్లాస్ ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకుని ప్రమోషన్స్ ను నిర్వహిస్తే సినిమాకు లాంగ్ రన్ లో యూజ్ అవ్వొచ్చని అంటున్నారు.
అలాగే సింగీతం శ్రీనివాసరావు వంటి దిగ్గజ దర్శకుడి జర్నీని హైలైట్ చేస్తే కూడా ఎక్స్ ట్రా బెనిఫిట్ దక్కవచ్చని చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు సింగ్ గీతం మూవీ థియేట్రికల్ గా ఇంకా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయాల్సి ఉన్నా, ఓవరాల్ బిజినెస్ పరంగా మాత్రం సినిమా సేఫ్ జోన్ కు దగ్గరగానే ఉంది. ఇక మేకర్స్ ప్రమోషనల్ స్ట్రాటజీస్ ఆ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్తాయా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
