ఏళ్ల తర్వాత టాలీవుడ్ పై కన్నేసిన కోలీవుడ్ స్టార్
ఒకప్పుడు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు శింబు ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ వైపు అడుగులు వేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
By: Sravani Lakshmi Srungarapu | 21 Feb 2026 11:04 AM ISTఒకప్పుడు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు శింబు ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ వైపు అడుగులు వేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజై మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. అయితే కాలక్రమేణా ఆయన దృష్టి పూర్తిగా తమిళ సినిమాల వైపు మళ్లడంతో, తెలుగులో శింబు మార్కెట్ క్రమంగా తగ్గిపోయింది. ఇప్పుడు మళ్లీ బైలింగువల్ ప్రాజెక్టుతో శింబు టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
శింబుతో మైత్రీ చర్చలు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ శింబుతో ఓ బై లింగువల్ ప్రాజెక్టు కోసం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కే ఈ సినిమాను త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశముంది. గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రాజెక్ట్‌లను రూపొందిస్తున్న మైత్రీ సంస్థ, మార్కెట్ విస్తరణ దిశగా కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్‌తో బైలింగువల్ మూవీ చేయడాన్ని వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు.
డైరెక్టర్ గా కీర్తీశ్వరన్
ఈ సినిమాకు డైరెక్టర్ గా కీర్తీశ్వరన్ పేరు పరిశీలనలో ఉంది. ఆయన దర్శకత్వంలో రూపొందిన డ్యూడ్ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించడంతో పాటూ నిర్మాతలకు నమ్మకాన్ని కూడా కలిగించింది. యూత్ ను ఆకట్టుకునే ఎంటర్టైనింగ్ స్టోరీ మరియు సమకాలీన అంశాలతో కీర్తీశ్వరన్ రూపొందించిన డ్యూడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను అందుకుంది. ఇప్పుడు శింబుతో కూడా అదే తరహాలో మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ను చేయాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్‌ను రూపుదిద్దుతున్నట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా శింబు కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదురైనా, రీసెంట్ గా తమిళంలో ఆయన చేసిన సినిమాలు మళ్లీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. నటనలో వైవిధ్యం, డ్యాన్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ శింబు ప్రత్యేకతలు. తెలుగు ఆడియన్స్ కు కూడా ఆయన స్టైల్ కొత్తదేమీ కాదు. అయితే సరైన కథతో, సరైన సమయాన్ని చూసుకుని టాలీవుడ్‌లో తిరిగి అడుగుపెడితే ఆయనకు మంచి అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
శింబు- మైత్రీ కాంబోపై మంచి అంచనాలు
బై లింగువల్ సినిమాల ట్రెండ్ ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో వేగంగా పెరుగుతోంది. ఒకేసారి రెండు మార్కెట్లను టార్గెట్ చేయడం ద్వారా కమర్షియల్ గా కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో శింబు- మైత్రీ కాంబినేషన్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఏళ్ల తర్వాత టాలీవుడ్‌పై ఫోకస్ చేసిన శింబు, ఈసారి మంచి కంబ్యాక్ సాధిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
