Begin typing your search above and press return to search.

సల్మాన్‌తో మురుగదాస్ పాత గాయాన్ని కెలకడం సరికాదేమో!

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, దక్షిణాది దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం `సికందర్` బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేక డిజాస్టర్‌గా మిగిలింది.

By:  Sivaji Kontham   |   30 May 2026 11:06 AM IST
సల్మాన్‌తో మురుగదాస్ పాత గాయాన్ని కెలకడం సరికాదేమో!
X

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, దక్షిణాది దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం `సికందర్` బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేక డిజాస్టర్‌గా మిగిలింది. ఈ భారీ పరాజయం తర్వాత సల్మాన్, మురుగదాస్ మధ్య తీవ్రమైన విభేదాలు బయటపడిన సంగతి తెలిసిందే. సినిమా రూపకల్పన సమయంలో సెట్స్‌పై వీరిద్దరి మధ్య సరైన సింక్ కుదరకపోవడమే ఈ ఘోర వైఫల్యానికి దారితీసిందని పరిశ్రమ వర్గాలు అప్పట్లోనే విశ్లేషించాయి. చరిత్రను పరిశీలిస్తే... చాలా సందర్భాల్లో దర్శకుడి ఆలోచనలకు, హీరో ప్రవర్తనకు మధ్య సమన్వయం లోపించినప్పుడు ఎంతటి భారీ అంచనాలున్న సినిమాలైనా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. `సికందర్` పరాజయం వెనుక కూడా సరిగ్గా ఇలాంటి బలమైన కారణమే ఉందనేది స్పష్టమైంది.

అయితే ఈ సినిమా ఫ్లాపయిన తర్వాత సల్మాన్ ఖాన్‌పై మురుగదాస్.. అలాగే మురుగదాస్‌పై సల్మాన్ ఖాన్ ఒకరినొకరు బహిరంగంగా ఆరోపించుకోవడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక పరాజయాన్ని హుందాగా అంగీకరించకుండా.. పరస్పరం నిందలు వేసుకోవడం అభిమానులను సైతం నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత కూడా సోషల్ మీడియా వేదికల్లో వీరిద్దరి పాత మాటలను.. ఇంటర్వ్యూలలోని హావభావాలను (ఎక్స్‌ప్రెషన్స్) వైరల్ చేస్తూ నెటిజన్లు నిరంతరం డిబేట్లు నడుపుతూనే ఉన్నారు. ఒక పెద్ద సినిమా వైఫల్యం తర్వాత తలెత్తిన వివాదాన్ని ఇక్కడితో వదిలేయకుండా.. సామాజిక మాధ్యమాల్లో దీనిపై నిరంతరం చర్చలు జరపడం ఇండస్ట్రీ వాతావరణాన్ని మరింత దెబ్బతీస్తోంది.

ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు మరోసారి పాత ఇంటర్వ్యూ క్లిప్‌లను తెరపైకి తెచ్చి వైరల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో సల్మాన్ ఖాన్ పనితీరుపై... ఆయన నటనలో చూపించే బద్ధకంపై మురుగదాస్ ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన పాత వ్యాఖ్యలను ఇప్పుడు మళ్లీ వైరల్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ షూటింగ్‌కు ఆలస్యంగా రావడం వల్ల సహ నటీనటులు.. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులు రాత్రి వేళల్లో నిద్రపోతూ తీవ్ర ఇబ్బందులు పడ్డారని మురుగదాస్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చే పగటిపూట సన్నివేశాలను సైతం.. సల్మాన్ ఆలస్యం కారణంగా అర్ధరాత్రి 2:00 గంటల సమయంలో చిత్రీకరించాల్సి వచ్చిందని ఆయన నాడు ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా.. సల్మాన్‌తో షూటింగ్ చేయడం ఒక దర్శకుడిగా తనకు ఎంతో సవాల్‌తో కూడుకున్న విషయమని మురుగదాస్ సదరు పాడ్‌కాస్ట్‌లో వివరించారు. పగలు తీయాల్సిన సీన్లను రాత్రి వేళల్లో తీయాల్సి రావడం వల్ల.. దాదాపు సినిమా అంతా గ్రీన్ స్క్రీన్ .. సీజీ సెట్ల సహాయంతోనే పూర్తి చేయాల్సి వచ్చిందని చెప్పారు. దీనికి తోడు ఎంతో బలంగా ఉన్న అసలు స్క్రిప్ట్‌లో సల్మాన్ ఖాన్ తన ఇష్టానుసారంగా మార్పులు చేర్పించారని.. అది కూడా సినిమా ఫలితాన్ని మార్చేసిందని మురుగదాస్ ఓపెన్ అయ్యారు. ఈ పాత వ్యాఖ్యలను నెటిజన్లు ఇప్పుడు మళ్లీ తవ్వి తీయడం ద్వారా వీరి మధ్య ఉన్న పాత గాయాన్ని మరింతగా గిల్లిన‌ట్ట‌యింది.

నిజానికి ఒక సినిమా పరాజయం పాలైనప్పుడు దానికి గల కారణాలను విశ్లేషించుకుని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరోలు ముందుకు సాగుతారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో నెటిజ‌నులు ఇలా పాత వివాదాలను పదే పదే కెలికి రచ్చ చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సల్మాన్, మురుగదాస్ ఇద్దరూ తమ తమ రంగాలలో ఎన్నో విజయాలు అందుకున్న దిగ్గజాలు. ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన వారి ప్రతిభ తగ్గిపోదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికల్లో పాత ఇంటర్వ్యూలను వైరల్ చేస్తూ.. వారి మధ్య ఉన్న పాత గాయాలను మళ్లీ రేగ్గొట్టడం అసలు సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఈ అనవసర వివాదాలను నెటిజ‌నులు కెల‌క్క‌పోవ‌డమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సికింద‌ర్ త‌ర్వాత కొంత గ్యాప్ ఇచ్చి స‌ల్మాన్ ఖాన్ మాతృభూమి అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ప్ర‌స్తుతం మురుగ‌దాస్ శివ‌కార్తికేయ‌న్ `మ‌ద‌రాసి` త‌ర్వాత త‌న త‌దుప‌రి స్క్రిప్టుపై దృష్టి సారించార‌ని స‌మాచారం.