మరీ అంత డార్క్ అవసరమా సిద్దు..!
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ 'తెలుసు కదా' సినిమాతో ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
By: Ramesh Palla | 14 Oct 2025 12:37 PM ISTస్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ 'తెలుసు కదా' సినిమాతో ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నీరజ కోన దర్శకురాలిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్‌గా నటించాడు. ఇన్ని రోజులు సినిమా నుంచి వచ్చిన టీజర్, ప్రమోషనల్ వీడియోలను చూసి అంతా కూడా ఇదో మంచి కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ అనుకున్నారు. ఇద్దరు లవర్స్‌తో సిద్దు సతమతం అయ్యే పాత్రలో నటించాడు అనుకున్నారు. కానీ ఇద్దరు లవర్స్‌ను సతమతం చేసే పాత్రలో సిద్దు కనిపించబోతున్నాడు, పక్కా ర్యాడికల్ పాత్రలో సిద్దు నటించాడని ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది. కాస్త డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలో సిద్దు నటించాడని అర్థం అవుతుంది. తెలుసు కదా సినిమా ఫలితం రాకముందే సిద్దు మరింత డార్క్ షేడ్ పాత్రకు ఓకే చెప్పడం ఒకింత చర్చనీయాంశం అవుతోంది. తన 'బడాస్' సినిమా గురించి సిద్దు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా ట్రైలర్..
'తెలుసు కదా' సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా సిద్దు తదుపరి సినిమా బడాస్ గురించి మాట్లాడుతూ ఖచ్చితంగా ఆ సినిమా డిఫరెంట్ మూవీ అవుతుందని అన్నాడు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో చూడని డార్క్ షేడ్స్‌ను చూడబోతున్నారు అంటూ బల్ల గుద్ది మరీ చెప్పాడు. హీరో, విలన్‌లను ఇప్పటి వరకు చూశారు, అయితే బడాస్ సినిమాలో మాత్రం హీరో, విలన్ కాకుండా చాలా విభిన్నమైన పాత్రలో సిద్దును చూస్తారు అంటూ సినిమా ప్రకటన సమయంలోనే మేకర్స్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఆ సమయంలో అర్థం కాలేదు కానీ ఇప్పుడు సిద్దు మాట్లాడిన తర్వాత బడాస్ లో చాలా డార్క్ యాంగిల్స్ ఉంటాయని, హీరో పాత్ర నెవ్వర్ బిఫోర్ అన్నట్లుగా ఉండబోతుంది అనిపిస్తుంది. టాలీవుడ్‌లో మరీ ఆ స్థాయి డార్క్ సీన్స్‌ను ప్రేక్షకులు ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటూ ఇప్పుడు కొందరు సిద్దును ప్రశ్నిస్తున్నారు.
బడాస్ సినిమాతో వచ్చే ఏడాది సిద్దు
హీరోను హీరోగానే చూడాలి అనుకునే తెలుగు ప్రేక్షకులు, హీరోను విలనిజం ఉన్న వ్యక్తిగా చూస్తే ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలుసు కదా సినిమా వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలుసు కదా సినిమాలో సిద్దు పాత్రకు కాస్త డార్క్ షేడ్ ఉన్నట్లుగా అర్థం అవుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి పాత్రలు చూడటం తెలుగు ప్రేక్షకులకు అలవాటే. కానీ పూర్తి స్థాయి డార్క్ షేడ్, విలనిజంను మించి అన్నట్లుగా హీరో పాత్ర ఉంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. సిద్దు జొన్నలగడ్డ మాత్రం చాలా కాన్ఫిడెన్స్‌తో సినిమాను చేస్తున్నట్లు తెలుస్తోంది. తన ప్రతి సినిమా స్క్రిప్ట్ నుంచి మొదలుకుని డైరెక్షన్, ఎడిటింగ్, మ్యూజిక్ వరకు తన ప్రమేయం ఉండేలా సిద్దు చూసుకుంటాడు. కనుక బడాస్ సినిమా విషయంలోనూ సిద్దు చాలా లోతుగా ఆలోచిస్తూ, తన పాత్రను డిజైన్ చేసుకుని ఉంటాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.
నాగవంశీ నిర్మాణంలో రవికాంత్ దర్శకత్వంలో బడాస్
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ నిర్మిస్తున్న బడాస్ సినిమాకు రవికాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సిద్దు జొన్నలగడ్డ, రవికాంత్ కాంబోలో గతంలో 'కృష్ణ అండ్ హిస్ లీలా' సినిమా వచ్చింది. ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందులో హీరో పాత్ర కాస్త విభిన్నంగా ఉంటుంది అనే విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ పాత్రకు పది రెట్లు విభిన్నంగా బడాస్ సినిమాలో సిద్దు పాత్ర ఉంటుందని అంటున్నారు. సాఫ్ట్ పాత్రలు చేసే ఆలోచన లేదని, ప్రేక్షకులు సాఫ్ట్ గా ఉన్న హీరోలను పట్టించుకోవడం లేదని, అందుకే ఇలాంటి పాత్రలను, అలాంటి సినిమాలను చేయాల్సి వస్తుందని సిద్దు తాజా ఈవెంట్‌లో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. డార్క్ పాత్రలు ఒక మోస్తరు వరకు అయితే పర్వాలేదు, హద్దు దాటితో ప్రేక్షకుల తిరస్కరణకు గురి కావాల్సి వస్తుందని, మరీ అంత డార్క్ అవసరమా అని ప్రేక్షకులే ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదు. బడాస్ తో సిద్దు చేయబోతున్న ఆ ప్రయోగంకు ఎలాంటి ఫలితం దక్కుతుందో అనేది కాలమే నిర్ణయించాలి.
