‘కృష్ణ అండ్ హిజ్ లీల’ రూట్లో సిద్ధు
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో యూత్‌లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు సిద్ధు జొన్నలగడ్డ. ఐతే తన చివరి చిత్రం ‘జాక్’ తీవ్రంగా నిరాశపరిచింది
By: Garuda Media | 11 Sept 2025 10:56 PM ISTడీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో యూత్‌లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు సిద్ధు జొన్నలగడ్డ. ఐతే తన చివరి చిత్రం ‘జాక్’ తీవ్రంగా నిరాశపరిచింది. మళ్లీ తనకు బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్న సినిమా.. తెలుసు కదా. ఈ సినిమా నుంచి రిలీజైన తొలి పాట సూపర్ హిట్టయింది. ఇప్పుడు టీజర్‌తో పలకరించింది చిత్ర బృందం. ఆ టీజర్ చూసిన వాళ్లకు సిద్ధు కెరీర్లో తొలి హిట్ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ గుర్తుకు రాక మానదు. ఆ సినిమాకు ఇది ఎక్స్‌టెన్షనా అన్నట్లుగా సాగింది టీజర్.
ఇద్దరు అమ్మాయిలతో వేర్వేరుగా సీరియస్ రిలేషన్‌షిప్స్‌లో ఉండి.. చివరికి ఆ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినపుడు హీరో ఏం చేశాడనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఆ ఇద్దరు అమ్మాయిలు.. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి. ఆ ఇద్దరినీ సిద్ధు ఫ్లర్ట్ చేసే సీన్లు.. వారితో రొమాన్స్ హైలైట్‌గా కనిపిస్తున్నాయి. కథ పరంగానే కాక విజువల్స్ కోణంలో చూసినా.. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ను గుర్తుకు తెస్తోంది ‘తెలుసు కదా’.
నీకిది అలవాటే కదా అంటూ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా రెఫరెన్సును కూడా ఇందులో వాడడం విశేషం. ఐతే దానికి, దీనికి తేడా ఏంటంటే.. అక్కడ హీరో చివరి వరక హీరోయిన్లలో ఒకరికి తెలియకుండా ఇంకొకరితో మెయింటైన్ చేస్తుంటాడు. కానీ ఇక్కడ ఇద్దరూ అమ్మాయిలు కలిసి సాగుతూనే.. హీరోను దక్కించుకోవడానికి ప్రయత్నం చేసేలా కనిపిస్తోంది. టీజర్ ఆరంభంలో ఇద్దరు హీరోయిన్లకు ఒకేసారి హీరో నలుగు పెట్టే సీన్ హైలైట్.
రైటర్ కోన వెంకట్ సోదరి, ఒకప్పటి స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. స్క్రిప్టు కూడా ఆమెదే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంలో మంచి ప్రొడక్షన్ వాల్యూస్, థమన్ మ్యూజిక్ అట్రాక్షన్ అయ్యేలా కనిపిస్తున్నాయి. దీపావళి కానుకగా అక్టోబరు 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
