నిర్మాతతో స్నేహానికి విలువిచ్చి సినిమా చేసిన DJ టిల్లు
ఈ సినిమాలో తాను చిన్న పాత్ర (అతిథిగా) చేయడానికి అసలు కారణాన్ని సిద్ధూ వేదికపై పంచుకున్నారు.
By: Sivaji Kontham | 7 Sept 2026 9:34 AM ISTచిత్ర పరిశ్రమలో ఎంత ఎదిగినా కష్టకాలంలో తోడుగా ఉన్న పాత మిత్రులను, స్నేహ బంధాలను గుర్తుపెట్టుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదైన వ్యక్తిత్వంలో `స్టార్ బోయ్` సిద్ధూ జొన్నలగడ్డ తానెప్పుడూ ముందుంటానని మరోసారి నిరూపించుకున్నారు. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న `మహేంద్రగిరి వారాహి` ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొని.. స్నేహానికి తాను ఇచ్చే విలువ ఎంతటిదో చాటిచెప్పారు. కష్టకాలంలో ఉన్న స్నేహితుడికి ఒక పిలుపుతోనే అండగా నిలిచి సిద్ధూ చూపించిన స్నేహ ధర్మం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమాలో తాను చిన్న పాత్ర (అతిథిగా) చేయడానికి అసలు కారణాన్ని సిద్ధూ వేదికపై పంచుకున్నారు. తాను నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ కష్టపడుతున్న తొలి రోజుల్లోనే.. నిర్మాత మధు కూడా ప్రొడ్యూసర్ కావాలని స్ట్రగుల్ అవుతుండేవారని గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లోనే ఇద్దరం కలిసి ఒక సినిమా చేయాలని నాలుగైదు నెలలు ప్లాన్ చేసినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేకపోయింది. అయితే ఇన్నాళ్ల తర్వాత మధు వచ్చి సుమంత్ సినిమాలో ఒక కామియో చేయాలని అడిగిన వెంటనే... ఇది వారిద్దరినీ మళ్లీ కలిపిన విధి (డెస్టినీ) అని భావించి డబ్బు గురించి ఆలోచించకుండా వెంటనే ఒప్పుకున్నానని సిద్ధూ తెలిపారు.
ఇదే వేదికపై అక్కినేని అఖిల్‌పై సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. అఖిల్ సాధించిన బ్లాక్‌బస్టర్ విజయంపై అభినందనలు తెలుపుతూ.. సినిమాలో ముఖ్యంగా చివరి 30-40 నిమిషాల్లో అంధుడిగా అఖిల్ నటన చూసి తాను షాక్ అయ్యానని కొనియాడారు. స్క్రీన్‌పై నా.. ఆఫ్-స్క్రీన్ లోను అఖిల్ పడ్డ కష్టం స్పష్టంగా కనిపించిందని సిధ్ ప్రశంసించారు. ఇక హీరో సుమంత్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఏ జానర్ సినిమా అయినా ఎంచుకునే స్వేచ్ఛను సంపాదించుకున్నారని.. ఈ సినిమాలో సుమంత్‌తో కలిసి చేసిన సన్నివేశం ఎంతో బాగా వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.
దర్శక రచయితలు-సాంకేతిక నిపుణులపైనా సిద్ధూ తన అభిమానాన్ని చాటుకున్నారు. దర్శకుడు సంతోష్ కథ చెప్పిన విధానాన్ని.. అంతే స్పష్టతతో ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా తెరకెక్కించిన తీరును మెచ్చుకున్నారు. అలాగే సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయని చెప్పారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, ఐశ్వర్య, మాల్వికా శర్మ, మంజు భార్గవి వంటి దిగ్గజ నటీనటులతో కలిసి పనిచేయడం తనకు లభించిన మంచి అనుభవమని పేర్కొన్నారు.
అలాగే జీవిత పాఠాలు, యూనివర్సల్ ఇంటర్వెన్షన్ గురించి అడిగిన ప్రశ్నకు సిద్ధూ ఎంతో పరిణతితో సమాధానమిచ్చారు. జీవితంలో ``ఇది లేకపోతే బ్రతకలేం`` అని మనం తీవ్రంగా అనుకున్నది దక్కకపోయినప్పుడు మొదట బాధపడతామని. కానీ కొద్ది రోజులకే అది మనకు అంత అవసరం లేదని... దానికంటే మెరుగైనదే ఏదో దక్కబోతోందని అర్థమవుతుందని తన జీవిత అనుభవాన్ని షేర్ చేసారు. సెప్టెంబర్ 11న విడుదలవుతున్న `మహేంద్రగిరి వారాహి` చిత్రాన్ని ప్రేక్షకులందరూ థియేటర్లలో చూసి పెద్ద హిట్ చేయాలని సిద్ధూ కోరారు. `స్టార్ బోయ్` సిద్ధూ జొన్నలగడ్డ ప్రస్తుతం డీజే టిల్లు లో మూడో భాగం - `టిల్లు క్యూబ్` పైనా వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే.
