Begin typing your search above and press return to search.

విద్యార్దుల విష‌యంలో రాజీలేదంటున్న న‌టుడు!

నటుడు సిద్ధార్థ్ మనసులోని మాటలను ఎలాంటి మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంలో ఎప్పుడూ ముందుంటారు.

By:  Srikanth Kontham   |   9 Aug 2026 7:00 AM IST
విద్యార్దుల విష‌యంలో రాజీలేదంటున్న న‌టుడు!
X

నటుడు సిద్ధార్థ్ మనసులోని మాటలను ఎలాంటి మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా దేశంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా నిలవడంపై సిద్దార్ద్ చేసిన వ్యాఖ్యలు సినీ , రాజకీయా వ‌ర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలకు సిద్దార్ద్ మద్దతు తెలపడంపై వ‌స్తోన్న‌ విమర్శలకు సిద్ధార్థ్ ధీటైన సమాధానం ఇచ్చారు.

నీట్ పేపర్ లీక్ సంఘటనలు ... విద్యావ్యవస్థలో సంస్కరణలు కోరుతూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా... ఆ త‌ర్వాత త‌లెత్తిన ప‌రిస్థిత‌లు తెలిసిందే.

ఈ ఉద్యమానికి బాలీవుడ్ నటులు సిద్ధార్థ్, దియా మీర్జా వంటి న‌టులు గళాన్ని వినిపించారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు కలిసి న‌టిస్తోన్న‌ తాజా చిత్రం `ఆపరేషన్ సఫేద్ సాగర్` ప్రమోషన్ల సమయంలో జాతీయ సమస్యలపై సిద్ధార్థ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సమకాలీన జాతీయ అంశాలపై స్పందించడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సిద్ధార్థ్ స్పష్టం చేశారు. `నేను మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు ఎవరి అనుమతీ కోరలేదు. భవిష్యత్తులోనూ మాట్లాడటానికి ఎవరి అనుమతి అవసరం లేదు` అని కుండబద్దలు కొట్టారు.

దేశంలోని యువత ఎప్పుడూ భవిష్యత్తు కోసమే పోరాడుతుందని.. వారి సమస్యలపై గళం విప్పడానికి ఎవరి సలహాలు లేదా పర్మిషన్లు అవసరం లేదని సిద్దార్ద్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు ప్రధానంగా పరీక్షా పత్రాల లీకేజీలు .. విద్యావ్యవస్థలోని లోపాలతో ముడిపడి ఉన్నాయని సిద్ధార్థ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కుటుంబం కూడా తమ బిడ్డలను ఇలాంటి వ్యవస్థాపక లోపాల వల్ల కోల్పోకూడదని పేర్కొన్నారు. నటులు కూడా సమాజంలో భాగమేనని, తమ వ్యక్తిగత నమ్మకాలను, అభిప్రాయాలను వ్యక్తపరిచే కళాకారులపై నెటిజన్లు అనవసరమైన ద్వేషాన్ని ప్రదర్శించడం మానుకోవాలని హితవు పలికారు.

ఈ ఉద్యమంపై స్పందించిన నటి దియా మీర్జా కూడా విద్యార్థుల పోరాటాన్ని కొనియాడారు. వేలాది మంది ప్రజలు ఏకమై జవాబుదారితనం, పారదర్శకత కోసం నిరసన మార్గంలో నడవడం ఎంతో చైతన్యవంతమైన విషయమని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు , పిల్లలపై బలప్రయోగం చేయడం బాధాకరమన్నారు. యువత చూపించే నిజాయితీ నుంచి పెద్దలు చాలా నేర్చుకోవాలని దియా అభిప్రాయపడ్డారు. సెలబ్రిటీలు కేవలం తెరపై నటనకే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించాలనే చర్చకు ఈ సంఘటన మరింత బలాన్నిచ్చింది. తోటి కళాకారులతో కలిసి సిద్ధార్థ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం, విద్యార్థుల హక్కుల కోసం నిలబడిన తీరు యువతలో ఆయనపై గౌరవాన్ని మరింత పెంచుతుంది.