13 ఏళ్ల తర్వాత జతకట్టిన భార్య-భర్తలు!
`మిర్జాపూర్` వెబ్ సిరీస్‌లో `గోలు గుప్తా` పాత్రతో దేశవ్యాప్తంగా నటిగా ఎంతో ఫేమస్ అయింది శ్వేతా త్రిపాఠి శర్మ. ఆఒక్క సక్సెస్ అమ్మడి రేంజ్ ను అమాంతం మార్చేసింది .
By: Srikanth Kontham | 18 May 2026 10:00 PM IST`మిర్జాపూర్` వెబ్ సిరీస్‌లో `గోలు గుప్తా` పాత్రతో దేశవ్యాప్తంగా నటిగా ఎంతో ఫేమస్ అయింది శ్వేతా త్రిపాఠి శర్మ. ఆఒక్క సక్సెస్ అమ్మడి రేంజ్ ను అమాంతం మార్చేసింది . డిజిటల్ స్క్రీన్‌ల పైనే కాక వెండి తెర ప్రపంచంలోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. నటనపై ఉన్న మక్కువతో కెరీర్ ఆరంభంలో థియేటర్ ఆర్ట్స్, నాటక రంగంలో చురుగ్గా పాల్గొన్న శ్వేత అటుపై వెండితెర, ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ వైపు అడుగులు వేశారు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత శ్వేతా త్రిపాఠి మళ్లీ మూలాలైన రంగస్థలం పైకి అడుగుపెట్టడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. అయితే తాజా పునరాగమనంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది.
శ్వేతా త్రిపాఠి నిజ జీవిత భాగస్వామి, నటుడు-ర్యాపర్ చైతన్య శర్మ అలియాస్ స్లోచీతో కలిసి దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒకే స్టేజ్ పైన నటించారు. గతంలో ఇద్దరు కలిసి నాటకాల్లో నటించినా? పెళ్లి తర్వాత ప్రొఫెషనల్‌గా వేర్వేరు ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. మళ్లీ ఇద్దరు కలిసి నటించింది లేదు. అయితే తాజాగా ఒకే నాటకంలో, అది కూడా భార్యాభర్తలుగా కాకుండా వెండితెరపై సరికొత్త పాత్రల్లో స్టేజ్ మ్యాజిక్ చేయడం ప్రేక్షకులను, సినీ వర్గాలను ఆకట్టుకుంటోంది. ఓ ఇంటర్వ్యూలో శ్వేతా త్రిపాఠి అరుదైన అనుభవం గురించి ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు.
`13 సంవత్సరాల క్రితం మేము మొదటిసారి ఒకరినొకరు కలుసుకుంది.. ప్రేమలో పడింది థియేటర్ ఆర్ట్స్ లోనే. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మా ఇద్దరిని కలిపిన ఆ వేదికపైకి రావడం ఓ అద్భుతమైన హోమ్‌కమింగ్ లాంటి అనుభూతిని ఇస్తోంది. చైతన్యతో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే నటుడిగా అతడి బలాలు, పరిమితులు నాకు పూర్తిగా తెలుసు` అని పేర్కొన్నారు. ఈ సరికొత్త ప్లే (నాటకం) కోసం ఇద్దరూ కొన్ని వారాలుగా కఠినమైన రిహార్సల్స్ లో పాల్గొన్నట్లు చైతన్య శర్మ తెలిపారు.
నిజ జీవితంలో అయినా? స్టేజ్ పైకి వచ్చేసరికి వ్యక్తిగత బంధాన్ని పక్కన పెట్టి పాత్రలకు మాత్రమే ప్రాణం పోయాల్సి ఉంటుందని చైతన్య అన్నారు. ఒకే ఇంట్లో ఉంటూ స్క్రిప్ట్ డిస్కషన్స్ చేసుకోవడం, డైలాగ్ డెలివరీ ప్రాక్టీస్ చేయడం వల్ల అవుట్‌పుట్ మరింత మెరుగ్గా రావడానికి దోహదపడిందని చైతన్య వివరించారు. సినీ పరిశ్రమలో స్టార్ హోదాను ఆస్వాది స్తున్నా? నటనలో మరింత పరిణతి కోసం మళ్లీ లైవ్ ఆడియన్స్ ముందుకు రావడం అనేది ఒక నటుడికి నిజమైన సవాల్ అని శ్వేతా భావిస్తున్నారు. కెమెరా ముందు రీటేక్స్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది కానీ వేలాది మంది ప్రేక్షకుల మధ్య లైవ్‌గా పర్ఫార్మ్ చేసేటప్పుడు ప్రతి అడుగు, ప్రతి హావభావం పక్కాగా ఉండాలి.
అందుకే థియేటర్ ఎప్పుడూ ఒక నటుడిని సజీవంగా ఉంచుతుందన్నారు. లండన్ , ఇతర నగరాల టూర్‌లలో తమ ప్లేకు లభిస్తున్న రెస్పాన్స్ మరపురానిదని జంట హర్షం వ్యక్తం చేసింది. నిజ జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ క్రేజీ కపుల్, ప్రొఫెషనల్‌గా 13 ఏళ్ల తర్వాత రీ-యూనియన్ కావడం ద్వారా క్రియేటివ్ రంగానికి సరికొత్త స్ఫూర్తిని ఇచ్చారు. శ్వేతా-చైతన్యల స్టేజ్ కెమిస్ట్రీ నాటక ప్రియులనే కాకుండా డిజిటల్ ఆడియన్స్‌ను కూడా థియేటర్ల వైపు ఆకర్షించేలా చేస్తోంది. భవిష్యత్తులో కూడా ఇద్దరు కలిసి మరిన్ని అద్భుతమైన ప్రాజెక్టులు, వెబ్ సిరీస్‌లు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
