శ్రుతిహాసన్ ముంబై వదిలి చెన్నైలో సెటిలవ్వడానికి కారణం?
అయితే తాజాగా చెన్నైలోని తన కొత్త ఇంట్లో ఒంటరిగా గృహప్రవేశం చేయడం సామాజిక మాధ్యమాల్లో.. అలాగే సినిమా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
By: Sivaji Kontham | 14 July 2026 11:41 AM ISTకొన్నేళ్లుగా మాయానగరి ముంబైలో స్వతంత్రంగా జీవిస్తూ.. బాలీవుడ్ సహా సౌత్ చిత్రాల్లో నటిస్తూ సమతూకం పాటిస్తూ వచ్చిన శృతి హాసన్ ఇటీవల తన నివాసాన్ని శాశ్వతంగా చెన్నైకి మార్చడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ముంబైలోనే ఒక ప్రత్యేక ఇంట్లో నివసించారు. శ్రుతి తల్లి సారిక కూడా ముంబైలోనే మరో ఇంట్లో ఉంటున్నా.. శృతి మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక శైలిలో అక్కడ లైఫ్ లీడ్ చేసారు. అయితే తాజాగా చెన్నైలోని తన కొత్త ఇంట్లో ఒంటరిగా గృహప్రవేశం చేయడం సామాజిక మాధ్యమాల్లో.. అలాగే సినిమా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
ముంబై లైఫ్ స్టైల్‌ను అమితంగా ఇష్టపడే శృతి హఠాత్తుగా చెన్నైకి షిఫ్ట్ అవ్వడం వెనుక వ్యక్తిగత - వృత్తిపరమైన మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న బంధాలు.. ముంబైలోని ఒంటరితనం కంటే తన సొంత గూడైన చెన్నైలోనే ప్రశాంతత లభిస్తుందని శ్రుతి భావించి ఉండవచ్చు. ఎవరూ లేకుండా పూర్తిగా ఒంటరిగా తన కొత్త ఇంటి పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవడం చూస్తుంటే.. జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి శ్రుతి మానసికంగా సిద్ధమైందని సోషల్ మీడియాల్లో అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిలో మార్పు సహజం. ఆ మార్పు ఇప్పుడు శ్రుతిలో మొదలైందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఒకప్పుడు స్టార్ హీరోల సరసన వరుస పెట్టి కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్న శృతి హాసన్‌కు.. 2026 నాటికి చిత్ర పరిశ్రమలో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గాయి. గత ఏడాది విడుదలైన పెద్ద చిత్రాల తర్వాత టాలీవుడ్ - కోలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో కొత్త ప్రాజెక్ట్‌లు దక్కడం లేదు. కొత్త తరం కథానాయికల పోటీ పెరగడం.. అలాగే కమర్షియల్ సినిమాలకు కాకుండా భిన్నమైన పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడం కూడా శ్రుతిహాసన్‌కు ఆఫర్లు తగ్గడానికి ఒక కారణం కావచ్చు.
సినిమాల్లో అవకాశాలు తగ్గినా శృతి హాసన్ తనలోని అసలైన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధమైంది. నటిగా కంటే ముందు నుంచే తనకు సంగీతం అంటే ఎనలేని మక్కువ. ఇప్పుడు లభించిన ఖాళీ సమయాన్ని పూర్తిగా సంగీత సాధనకు.. కొత్త ఆల్బమ్స్ రూపకల్పనకు కేటాయించాలని శ్రుతి నిర్ణయించుకుంది. చెన్నై సంగీతానికి - లలిత కళలకు ప్రధాన కేంద్రం కావడంతో.. ఇక్కడి నుంచే తన మ్యూజిక్ కెరీర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే బలమైన సంకల్పంతోనే తమిళనాడుకు తిరిగి వచ్చిందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
సినిమా గ్లామర్ ప్రపంచం తాత్కాలికమే అయినా.. కళ శాశ్వతమైనదని శృతి హాసన్ నమ్ముతోంది. 2026 లో నివశించే స్థలం మార్పు కేవలం ఇల్లు మారడం మాత్రమే కాదు...తన ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుకు అద్దం పడుతోంది. నటిగా తదుపరి వెండితెర అవకాశాల కోసం ఎదురుచూస్తూనే.. ఒక స్వతంత్ర సంగీత విద్వాంసురాలిగా తనేంటో నిరూపించుకోవడానికి చెన్నై వేదికగా తను వేస్తున్న అడుగులు కచ్చితంగా ప్రశంసనీయం. ఈ కొత్త ప్రయాణంలో శృతి ఎలాంటి విజయాలు అందుకుంటుందో చూడాలి.
