Begin typing your search above and press return to search.

పాప్‌స్టార్ కావాల‌ని.. స్టార్ హీరోయిన్‌కి ఇంకా వ‌ద‌ల‌ని సంగీతం పిచ్చి!

నటి, గాయని శృతి హాసన్ తన మల్టీ-టాలెంట్‌తో ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉన్నారు.

By:  Sivaji Kontham   |   10 July 2026 12:49 PM IST
పాప్‌స్టార్ కావాల‌ని.. స్టార్ హీరోయిన్‌కి ఇంకా వ‌ద‌ల‌ని సంగీతం పిచ్చి!
X

నటి, గాయని శృతి హాసన్ తన మల్టీ-టాలెంట్‌తో ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉన్నారు. సామాజిక మాధ్యమాలలో యాక్టివ్‌గా ఉండే ఈ స్టార్ బ్యూటీ.. ముంబై వర్షాల వేళ తను గడిపిన ఒక ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వేకువఝాము సంగ‌తుల్ని అభిమానుల కోసం షేర్ చేసారు. తన దైనందిన జీవితంలోని సాధారణ ఆనందాలు, సంగీతంపై తనకున్న మక్కువను తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక ప్రత్యేక పోస్ట్ ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ముంబై వర్షాల నేపథ్యంతో కూడిన ఒక అందమైన వాతావరణంలో శృతి హాసన్ తన `సెమీ ఆఫ్ డే` రోజున కాస్త ఆలస్యంగా నిద్రలేచింది. ఉదయాన్నే నిద్రలేవగానే తనకు వచ్చిన ఒక అందమైన కలను, ఆ కలలోని భావనను మర్చిపోకముందే దానికి చ‌క్క‌ని స్వ‌రాన్ని ఇవ్వాలని అనుకున్నారు. ఆ ఆలోచన రాగానే ఉదయం తాగే టీని కూడా పక్కనపెట్టి తన ఇష్టమైన ప్రదేశంలో కూర్చుని పియానోపై ఒక చిన్న ట్యూన్‌ను కంపోజ్ చేసారు. ఈ సందర్భంగా ``ప్రతీదీ ఏదో ఒకటి అయిపోనవసరం లేదు.. కొన్నిసార్లు కేవలం ఉనికిలో ఉంటే చాలు`` అంటూ జీవితంపై తనకున్న లోతైన భావాలను షేర్ చేసారు శ్రుతి.

సంగీతంతో పాటు తన ఉదయపు అలవాట్లను కూడా శృతి ఈ పోస్ట్‌లో ప్రస్తావించారు. ఒక కళాకారిణిగా తనకు నచ్చిన ప్రదేశంలో స్వేచ్ఛగా నిద్రలేవడం.. పియానో వాయించడం... ఆ వెంటనే నెయ్యి తో చేసిన‌ తనకెంతో ఇష్టమైన `ఇంగ్లీష్ బ్రేక్‌ఫాస్ట్ టీ`ని ఆస్వాధించడం వంటి చిన్న చిన్న విషయాలపై శ్రుతి కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేసింది. ముంబైలో పడుతున్న వర్షపు వాతావరణం ఈ క్షణాన్ని మరింత అందంగా మార్చిందని పేర్కొంది. ఈ ఆనంద స‌మ‌యంలో శృతికి సంగీతంతో ఉన్న సుదీర్ఘ అనుబంధం ఈ పోస్ట్ ద్వారా మరోసారి వ్యక్తమైంది.

నిజానికి శృతి హాసన్‌కు అద్భుతమైన కళాత్మక, సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చింది. పూర్వీకుల నుంచి సంగీత నేప‌థ్యం ఉన్న కుటుంబం. లెజెండరీ నటుడు కమల్ హాసన్, ప్రముఖ నటి సారికల కుమార్తెగా సెల‌బ్రిటీ ప్ర‌పంచానికి కొత్త‌కాదు. కమల్ హాసన్ కేవలం నటుడిగానే కాకుండా మంచి ప్లేబ్యాక్ సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా పరిశ్రమలో తనదైన‌ ముద్ర వేశారు. అలాగే తల్లి సారికకు కూడా సంగీతంపై ఎంతో మంచి అభిరుచి ఉంది. చిన్నతనం నుంచే సృజనాత్మక వాతావరణంలో పెరగడం వల్లే శృతికి కూడా సంగీతంపై అంతటి అపారమైన ప్రేమ ఏర్పడింది. అయితే పాప్ స్టార్ కావాల‌న్న త‌న క‌ల మాత్రం ఇంకా నెర‌వేర‌లేదు.

త‌న క‌ల‌ల్ని సాధించుకునేందుకు శృతి హాసన్ తన సంగీత ప్రస్థానాన్ని చాలా చిన్న వయసులోనే ప్రారంభించింది. కేవలం ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడే తన తండ్రి నటించిన పాపుల‌ర్ చిత్రం `తేవర్ మగన్` (తెలుగులో క్షత్రియ పుత్రుడు) లో ప్లేబ్యాక్ సింగర్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత నటిగా ఎంత బిజీగా ఉన్నా... తనలోని గాయనిని ఎప్పుడూ లైవ్‌లోనే ఉంచుతూ.. రెగ్యుల‌ర్‌గా తను పియానో వాయిస్తూ... పాటలు పాడుతున్న వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానుల కోసం షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా శ్రుతి షేర్ చేసిన ఈ వీడియో సంగీతంపై త‌న మ‌క్కువ‌ను మ‌రోసారి రివీల్ చేసింది. శ్రుతి జీవితంలో తాను ఆశించిన‌ది సాధించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని నెటిజ‌నులు వ్యాఖ్యానిస్తున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన `సలార్: పార్ట్ 1` భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా వస్తున్న `సలార్ 2`లో శృతి హాసన్ ఆద్యా పాత్రలో మళ్లీ కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. దీనితో పాటు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అయిన `చెన్నై స్టోరీ`లో న‌టిస్తోంది. కొన్ని హిందీ సిరీస్‌లలోనూ భాగమైంది. వీటిపై మరింత అధికారిక సమాచారం త్వరలోనే రానుంది.