నాన్న ఆ తప్పు చేయడం లేదు : శృతి హాసన్
సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాతో శృతి హాసన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Ramesh Palla | 19 Aug 2025 12:11 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాతో శృతి హాసన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మంచి వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400+ కోట్ల వసూళ్ల మార్క్‌ను క్రాస్ చేసింది. లాంగ్ రన్‌లో రూ.500 కోట్ల వసూళ్లను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. ఇదే సమయంలో శృతి హాసన్ కి మరో భారీ చిత్రం పడిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శృతి హాసన్ పాత్ర లిమిటెడ్‌గా ఉన్నప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. మరో వైపు శృతి హాసన్ హిందీతో పాటు ఇతర భాషల్లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు శృతి హాసన్ రెడీ అవుతున్న విషయం తెల్సిందే.
థగ్ లైఫ్ తో తీవ్ర నష్టం
ఇటీవల ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో శృతి హాసన్ మాట్లాడింది. కూలీ సినిమా ప్రమోషన్‌లో భాగంగా శృతి హాసన్ ఆ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సమయంలో తన తండ్రి కమల్ హాసన్ గురించి మాట్లాడింది. ఇంటర్వ్యూలో కమల్ హాసన్ 'థగ్ లైఫ్' సినిమా ఫెయిల్యూర్ గురించి ప్రశ్నిస్తూ... కమల్ ను ఆ సినిమా ఫ్లాప్ ఎంతగా ప్రభావితం చేసింది అంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో శృతి హాసన్ స్పందిస్తూ పదేళ్ల నుంచి నాన్న తన సొంత డబ్బు మొత్తం సినిమాల్లో పెట్టడం మానేశారు. పూర్తి డబ్బు అంతా సినిమాల్లో పెట్టి, ఆ తర్వాత ఇబ్బంది పడటం, బాధ పడటం మానేశారు. నాన్న పదేళ్లుగా ఆ తప్పు చేయడం లేదు. ఆయన కేవలం సినిమా కోసం కష్టపడుతున్నారు, అందుకు తగ్గట్లుగా తన పారితోషికంను పెట్టుబడిగా పెడుతారు. అంతే తప్ప మొత్తం డబ్బు అంతా పెట్టే తప్పు మాత్రం చేయడం లేదు అంది.
మణిరత్నం మరోసారి నిరాశ
థగ్ లైఫ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దర్శకుడు మణిరత్నం చాలా గొప్పగా సినిమా తీశాడని అంతా భావించారు. కానీ సినిమా మరీ ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదని చాలా మంది కామెంట్స్ చేశారు. వందల కోట్ల ప్రాజెక్ట్ అని, వేల కోట్ల వసూళ్లు సాధిస్తుందని మేకర్స్ తెగ ప్రచారం చేశారు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరచడంతో అభిమానులతో పాటు అంతా ఉసూరుమన్నారు. విక్రమ్ వంటి సినిమాను చేసిన కమల్ మళ్లీ థగ్ లైఫ్ వంటి సినిమాతో నేల చూపులు చూడాల్సి వచ్చిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో థగ్ లైఫ్ గురించి తెగ పుకార్లు షికార్లు చేశాయి. థగ్ లైఫ్ వల్ల కమల్ హాసన్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని శృతి హాసన్ చెప్పుకొచ్చింది.
శృతి హాసన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్
ఇక కమల్ కూతురు అనే బ్రాండ్ ఎప్పుడూ తనకు ఉంటుందని, అయితే దాని వల్ల నా కెరీర్ ప్రభావం కాకుండా చూసుకుంటాను అంది. అంతే కాకుండా ఆయన నీడలో ఉండటం ఇష్టమే కానీ, ఆయన నీడ వల్ల ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒకేలా ఉండటం ఇష్టం లేదని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ నటించడంపై స్పందిస్తూ ఆ పాత్ర మాత్రమే చేయాలి, ఈ హీరోతో మాత్రమే చేయాలి అనే ఆలోచన ఎక్కువగా పెట్టుకోను. అందుకే నేను ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. అయితే నాకు కంఫర్ట్ ఉన్నంత వరకు మాత్రమే సినిమాలకు ఒప్పుకుంటాను, ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా అలసినప్పుడు బ్రేక్ తీసుకోవడంకు వెనకాడను అంది. మొత్తానికి శృతి హాసన్ తన కెరీర్‌ను ఇతర హీరోయిన్స్‌కి భిన్నంగా చాలా విభిన్నంగా సాగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.
