Begin typing your search above and press return to search.

శ్రుతిహాస‌న్ గృహ‌ప్ర‌వేశంలో త‌ల్లిదండ్రులు-సోద‌రి ఎక్క‌డ‌?

దీనికి సంబంధించిన ఫోటోలను ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రశంసలతో పాటు నెటిజన్ల మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

By:  Sivaji Kontham   |   14 July 2026 12:09 AM IST
శ్రుతిహాస‌న్ గృహ‌ప్ర‌వేశంలో త‌ల్లిదండ్రులు-సోద‌రి ఎక్క‌డ‌?
X

గ్లామ‌ర‌స్ బ్యూటీ, మ్యుజీషియన్ శృతి హాసన్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తాజాగా చెన్నైలో ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఈ నూతన గృహ ప్రవేశ వేడుకను కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రశంసలతో పాటు నెటిజన్ల మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

శృతి హాసన్ కొత్త ఇంటి పూజలో సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా మెరిసిపోతూ పూజా కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ ఫోటోలు చూసిన మెజారిటీ అభిమానులు త‌న‌కు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. అయితే.. గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో తాను `నాస్తికురాలిని` అని ప్రకటించిన శృతి హాసన్.. ఇప్పుడు ఇలా పక్కా సాంప్రదాయబద్ధంగా గృహ ప్రవేశ పూజలు నిర్వహించడంపై కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ``నాస్తికురాలన్నావు కదా.. ఇప్పుడు పూజలేంటి?`` అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

మరికొందరు నెటిజన్లు ఈ వేడుకలో శృతి హాసన్ తల్లిదండ్రులు (కమల్ హాసన్, సారిక) .. సోదరి అక్షర హాసన్ కనిపించకపోవడాన్ని పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఇంత పెద్ద గృహ ప్రవేశ వేడుకలో తల్లిదండ్రులు పక్కన లేకపోవడం ఏంటి? నేటి మోడ్రన్ కల్చర్ ఇలా తయారైంది! అంటూ కొందరు విమర్శనాత్మక కామెంట్లు పెట్టారు. అయితే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, వారి బిజీ షెడ్యూల్స్ భిన్నంగా ఉంటాయని.. అయినా సరే శ్రుతి ఒంటరిగా తన కష్టార్జితంతో కొత్త ఇల్లు కొనుక్కోవడం అభినందించదగ్గ విషయమని మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ఏదేమైనా శృతి హాసన్ కొత్త ఇల్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

శ్రుతిహాస‌న్ సోద‌రి అక్ష‌ర హాస‌న్ అంత బిజీగా లేదు క‌దా!

కమల్ హాసన్ వారసురాలిగా, శృతి హాసన్ సోదరిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అక్షర హాసన్ ప్రస్తుతం వెండితెరపై ఆశించిన స్థాయిలో బిజీగా లేదనేది వాస్తవం. అమితాబ్ బచ్చన్, ధనుష్‌లతో కలిసి నటించిన బాలీవుడ్ చిత్రం `షమితాబ్` ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత సరైన సక్సెస్‌లు దక్కలేదు. అజిత్ సరసన `వివేగం`, విక్రమ్ నిర్మించిన `కడారమ్ కొండన్` వంటి చిత్రాలలో నటించినా.. అవి అక్ష‌ర‌ కెరీర్‌కు ఆశించినంత బూస్ట్‌ ఇవ్వలేకపోయాయి. అయితే అక్ష‌ర హాస‌న్ సినిమాలకు పూర్తిగా దూరమైందని చెప్పలేం. కేవలం నటనకే పరిమితం కాకుండా చలనచిత్ర నిర్మాణ రంగం పైనా.. స్క్రిప్ట్ రైటింగ్.. కెమెరా వెనుక ఉండే సాంకేతిక విభాగాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది.

ప్రస్తుతం అక్షర హాసన్ కమర్షియల్ సినిమాలకు కాస్త విరామం ఇచ్చి..వైవిధ్యమైన వెబ్ సిరీస్‌లు .. స్వతంత్ర చిత్రాల వైపు మొగ్గు చూపుతోంది. కేవలం నటిగా మాత్రమే కాకుండా తన తండ్రి కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ అయిన `రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్` (RKFI) బ్యానర్‌లో తెరకెక్కుతున్న కొన్ని క్రేజీ ప్రాజెక్టులకు తెరవెనుక సహాయ దర్శకురాలిగా .. ప్రొడక్షన్ పనుల్లో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. రొటీన్ గ్లామర్ పాత్రలు చేయడానికి ఇష్టపడని అక్షర తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథాలో కెరీర్‌ను మలచుకునేందుకు ప్రయత్నిస్తోంది కాబట్టే వెండితెరపై త‌న‌ ఉనికి కాస్త తక్కువగా కనిపిస్తోంది.