శ్రీయా.. అప్పటి క్రేజ్ ఇంకా అలాగే..
ఒకప్పుడు తెలుగు సినిమాలతో బిజీగా కనిపించిన శ్రీయా ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ లైఫ్ తో బిజీగా మారింది. రీసెంట్ గా అమ్మడు సెయింట్ పీటర్స్‌బర్గ్ వీధుల్లో హైలెట్ అయ్యింది.
By: M Prashanth | 15 Aug 2026 7:04 PM ISTఒకప్పుడు తెలుగు సినిమాలతో బిజీగా కనిపించిన శ్రీయా ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ లైఫ్ తో బిజీగా మారింది. రీసెంట్ గా అమ్మడు సెయింట్ పీటర్స్‌బర్గ్ వీధుల్లో హైలెట్ అయ్యింది. భర్త ఆండ్రీ కొష్చీవ్, కూతురు రాధాతో కలిసి తీసుకున్న ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇది సినిమా ఫోటోషూట్ కూడా కాదు. ఫ్యామిలీ ట్రిప్‌లో తీసుకున్న ఫోటోలే. అయినా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి కారణం ఆమె లుక్ అనే చెప్పాలి.
శ్రీయా పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇష్టం తర్వాత సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్, అర్జున్, ఛత్రపతి లాంటి సినిమాలతో 2000లలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోల సరసన నటించింది. తమిళంలో రజనీకాంత్‌తో చేసిన శివాజీ ఆమె క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ టైంలో పాటల్లో శ్రీయా కనిపిస్తే చాలు అనే రేంజ్‌లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉండేది.
ఇరవై ఏళ్ల తర్వాత కూడా శ్రీయా పూర్తిగా తెరకు దూరం కాలేదు. హీరోయిన్ పాత్రలే అని పట్టుకుని కూర్చోకుండా వయసుకు తగ్గ క్యారెక్టర్లకు మారిపోయింది. ఆర్ఆర్ఆర్‌లో చిన్న పాత్రలో కనిపించిన ఆమె, హిందీలో దృశ్యం 2తో మరోసారి పెద్ద విజయాన్ని అందుకుంది. గత ఏడాది తేజ సజ్జా మిరాయిలో అంబిక పాత్రలో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కెరీర్ మొదటి దశలో పాటలు, గ్లామర్, కమర్షియల్ హీరోయిన్ పాత్రలు శ్రీయాకు పెద్ద క్రేజ్ తెచ్చాయి. ఇప్పుడు మాత్రం కథలో ఉపయోగపడే పాత్ర వస్తే చేయడానికి వెనకాడటం లేదు. అందుకే కొత్త తరం ప్రేక్షకులకు కూడా ఆమె పేరు పూర్తిగా దూరం కాలేదు. తెలుగు, తమిళం, హిందీ అంటూ భాషలు మార్చుకుంటూ తెరపై కనిపిస్తూనే ఉంది.
ఇక ఆమెకు ముందున్న ముఖ్యమైన సినిమా హిందీ దృశ్యం 3. అజయ్ దేవగన్‌కు భార్య నందిని సల్గావ్కర్ పాత్రలో శ్రీయా మరోసారి కనిపించనుంది. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇక ఇరవై ఏళ్ల క్రితం పెద్ద హీరోల సినిమాల్లో చూసిన శ్రీయా ఇప్పటికీ తెరపై కనిపిస్తూనే ఉంది. మధ్యలో పాత్రల కలర్ మారింది, సినిమాల సంఖ్య తగ్గింది. కానీ ఒక ఫోటో బయటకు వస్తే మళ్లీ అందరి చూపు తనవైపు తిప్పుకునే గుర్తింపు మాత్రం అలాగే ఉంది.
