Begin typing your search above and press return to search.

హీరోయిన్ స్పా సెంట‌ర్ వెనుక షాకింగ్ నిజాలు!

అలాగే ధాంప‌త్య జీవితాన్ని అంతే సంతోషంగా ఆస్వాదిస్తోంది. ఇదంతా అంద‌రికీ తెలిసిన విష‌యం. అయితే శ్రియ‌లో గొప్ప సేవా దృక్ఫ‌థం కూడా ఉంద‌ని తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

By:  Srikanth Kontham   |   20 Sept 2026 12:50 PM IST
హీరోయిన్ స్పా సెంట‌ర్ వెనుక షాకింగ్ నిజాలు!
X

హీరోయిన్ గా శ్రీయ ఏ రేంజ్ లో వెలిగిందో? చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగులో పాటు హిందీలోనూ అమ్మ‌డు స‌త్తా చాటి త‌న‌కంటు ప్రత్యేక‌మైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్ప‌టికీ అంతే యాక్టివ్ గా సోష‌ల్ మీడియాలో చేసే హ‌డావుడితో నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంటుంది. అడ‌పా ద‌డ‌పా వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకుంటూ అమ్మ‌డు ముందుకు సాగుతుంది. అలాగే ధాంప‌త్య జీవితాన్ని అంతే సంతోషంగా ఆస్వాదిస్తోంది. ఇదంతా అంద‌రికీ తెలిసిన విష‌యం. అయితే శ్రియ‌లో గొప్ప సేవా దృక్ఫ‌థం కూడా ఉంద‌ని తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

శ్రియ 2011లో ఓ ప్రత్యేకమైన స్పాని ప్రారంభించారు. దీంతో అంతా అనుకుంటున్న‌ట్లే ఇది బిజినెస్ ప‌ర్ప‌స్ లో అనుకున్నారు. కానీ దీని వెనుక ఎంతో సేవా దృక్ప‌థం ఉంద‌ని వెలుగులోకి వ‌చ్చింది. దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు స్వయం సమృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉన్నతమైన ఆశయంతో ఈ స్పాను శ్రియ లాంచ్ చేసిందిట‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రియా ఆ విష‌యాల‌ను రివీల్ చేసింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న స్ఫూర్తిదాయక ఆలోచనలను పంచుకున్నారు. ముంబైలోని లోఖండ్‌వాలా ప్రాంతంలో శ్రియా శరన్ `శ్రీ స్పా` పేరుతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

దృష్టి లోపం ఉన్నవారికి సరైన శిక్షణ ఇప్పించి వారిని థెరపిస్ట్‌లుగా, మసాజర్‌లుగా స్పాలో నియమించారు. ఇందులో కొందరు పూర్తిగా చూపులేని వారు కాగా.. మరికొందరు 15 శాతం వరకు మాత్రమే దృష్టి కలిగినవారు ఉన్నారు. కేవ‌లం సానుభూతి చూపించడమే కాకుండా వారి నైపుణ్యాలకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించి సమాజంలో వారు గౌరవంగా జీవించేలా చేయడమే ఈ స్పా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సామాజిక ఆలోచన వెనుక తన చిన్ననాటి అనుభవాలు ఉన్నాయని శ్రియా గుర్తు చేసుకున్నారు.

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుకునే రోజుల్లో పాఠశాలకు ఎదురుగా దృష్టి లోపం ఉన్న పిల్లల స్కూల్ ఉండేది. పాఠశాల సమయాల్లో ఆ పిల్లలతో సమయం గడపడం, వారు క్రికెట్ ఆడుతున్న తీరును గమనించడం శ్రియాకు పరిపాటిగా మారింది. ఆ రోజుల్లో వారిని దగ్గరగా పరిశీలించడం వల్లే దృష్టి లోపం ఉన్నవారు ఎదుర్కొనే సవాళ్లు, వారిలో ఉండే అసాధారణమైన ప్రతిభ గురించి తనకు స్పష్టమైన అవగాహన వచ్చిందని పేర్కొన్నారు.

పాఠశాల రోజుల్లో ఏర్పడిన ఆ అనుభవాలే శ్రియాను, ఆమె తల్లి నీరజను ఆలోజింపజేశాయి. భారతదేశంలో దృష్టి లోపం ఉన్నవారికి తగిన ఉపాధి అవకాశాలు లేకపోవడంపై తల్లితో చర్చించిన శ్రియా వారికి ఓ వేదికను సృష్టించాలని భావించార. ముఖ్యంగా స్పర్శ జ్ఞానం చురుగ్గా ఉండే దృష్టి లోపం ఉన్నవారికి మసాజ్ థెరపీ రంగం ఎంతో అనువుగా ఉంటుందని గ్రహించారు. ఆ ఆలోచనతోనే `శ్రీ స్పా` అనేకమంది దృష్టి లోపం ఉన్న నిపుణులకు వృత్తిపరమైన అనుభవాన్ని, ఆర్థిక స్వాలంబనను అందిస్తుంది. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన `శ్రీ స్పా` చాలా సంవత్సరాలగా విజయవంతంగా న‌డించింది. అయితే కరోనా (COVID-19) మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు దెబ్బతిన్నట్లే ఈ స్పా నిర్వహణ కూడా కష్టతరంగా మారింది. పరిస్థితుల ప్రభావంతో చివరికి ఈ స్పాని మూసివేయాల్సి వచ్చిందని శ్రియా వెల్ల‌డించారు.