Begin typing your search above and press return to search.

గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో 'ఆవు'లా మారాను: శ్రీ‌య శ‌ర‌ణ్

అందాల క‌థానాయిక‌ శ్రియ శరణ్ పెళ్లి త‌ర్వాతా త‌న కెరీర్ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.

By:  Sivaji Kontham   |   26 Jan 2026 11:56 PM IST
గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో ఆవులా మారాను: శ్రీ‌య శ‌ర‌ణ్
X

అందాల క‌థానాయిక‌ శ్రియ శరణ్ పెళ్లి త‌ర్వాతా త‌న కెరీర్ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. శ్రీ‌య త‌న‌ వ్యక్తిగత ప్రెగ్నెన్సీ ప్రయాణంతో పాటు, తన సహనటుడు నకుల్ మెహతా గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన తాజా వెబ్ సిరీస్ `స్పేస్ జెన్: చంద్రయాన్` ప్రమోషన్ల సందర్భంగా శ్రియ చెప్పిన ఓ విష‌యం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

శ్రియ శరణ్ తన ప్రెగ్నెన్సీ సమయంలో ఎదుర్కొన్న `పెరినాటల్ డిప్రెషన్` గురించి తొలిసారి బహిరంగంగా మాట్లాడారు. గర్భవతిగా ఉన్నప్పుడు తన శరీరం వేరొకరిలా మారిపోయిందని, ఒకానొక దశలో తనను తాను ఒక `ఆవు` లా భావించానని సరదాగా మాట్లాడుతూనే, అదే సమయంలో ఎమోషనల్ అయ్యారు. ఆ స‌మ‌యంలో త‌న

మానసిక స్థితి గురించి శ్రీ‌య మాట్లాడారు. గ‌ర్భ‌ధార‌ణ‌ సమయంలో భావోద్వేగాలు అదుపులో ఉండవని, కొన్నిసార్లు అర్థం లేని విషయాలు మాట్లాడుతూ భర్తను ఇబ్బంది పెట్టేదానిని అని కూడా శ్రీ‌య‌ గుర్తు చేసుకున్నారు.

ఈ సిరీస్ షూటింగ్ సమయంలో నకుల్ మెహతా భార్య జాంకీ పరేఖ్ రెండోసారి గర్భవతిగా ఉన్నారు. న‌కుల్- జాంకీలకు ఇప్పటికే ఒక కుమారుడు సూఫీ ఉండ‌గా, ఇటీవల ఆగస్టు 2025లో కుమార్తె రూమి జన్మించింది. భార్య గ‌ర్భ‌వ‌తిగా ఉండ‌గా తాను ఎదుర్కొన్న ప‌రిస్థితుల గురించి నకుల్ ఓపెన్ గా మాట్లాడాడు. షూటింగ్ పనిలో పడి తన భార్య చెకప్ అపాయింట్‌మెంట్లను కూడా ఒకటి రెండు సార్లు మర్చిపోయారని అత‌డు వెల్లడించారు.

ఇంత‌లోనే శ్రీ‌య క‌లుగ‌జేసుకుని, షూటింగ్ సమయంలో నకుల్ తన ప్రపంచంలో తాను మునిగిపోయి ఉండేవారని, తన భార్య ఇంట్లో ఒక బిడ్డను చూసుకుంటూ మరో బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ఎంత కష్టపడుతుందో అని ఆయన నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారని పేర్కొన్నారు.

సాధారణంగా గర్భం దాల్చిన స్త్రీల కష్టాల గురించి అందరూ మాట్లాడతారని, కానీ ఆ సమయంలో పక్కన ఉండి చూసే భర్తలకు తగిన గుర్తింపు లభించదని శ్రియ అభిప్రాయపడ్డారు. గ‌ర్భిణిగా తన భార్య మారుతున్న తీరును చూస్తూ ఆమెకు ఎలా సహాయం చేయాలో తెలియక పురుషులు కూడా మానసిక సంఘర్షణకు గురవుతారని సానుభూతి వ్యక్తం చేశారు.

శ్రియ శరణ్- నకుల్ మెహతా ప్రధాన పాత్రల్లో నటించిన `స్పేస్ జెన్ - చంద్ర‌యాన్` జనవరి 23 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో శ్రియ ప్రాజెక్ట్ డైరెక్టర్ యామిని పాత్రలో కనిపిస్తున్నారు.