Begin typing your search above and press return to search.

జాన్వీ-ర‌ష్మిక త‌ర్వాత మార్ఫింగ్ వేధింపుల బాధితురాలు

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత విస్తరిస్తున్న కొద్దీ దాన్ని దుర్వినియోగం చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.

By:  Sivaji Kontham   |   13 Oct 2026 8:25 PM IST
జాన్వీ-ర‌ష్మిక త‌ర్వాత మార్ఫింగ్ వేధింపుల బాధితురాలు
X

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత విస్తరిస్తున్న కొద్దీ దాన్ని దుర్వినియోగం చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని కథానాయికలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన మార్ఫింగ్ ఫొటోలు, డీప్‌ఫేక్ వీడియోలను సృష్టిస్తుండటం ప్ర‌మాద‌క‌రంగా మారింది. ఇంత‌కుముందు జాన్వీ క‌పూర్, ర‌ష్మిక మంద‌న్న‌, దీపిక ప‌దుకొనే, ఐశ్వ‌ర్యారాయ్ స‌హా చాలా మంది క‌థానాయిక‌లు ఏఐ మార్ఫింగ్, డిజిట‌ల్ వేధింపుల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. ఐశ్వ‌ర్యారాయ్, జాన్వీ క‌పూర్ కోర్టుకు కూడా వెళ్లారు.

ఇప్పుడు సీనియ‌ర్ న‌టి శ్రియా శరణ్ ఏఐ మార్ఫింగ్- డిజిట‌ల్ వేధింపుల‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న ఈ డిజిటల్ వేధింపుల సంస్కృతిని తీవ్రంగా ఖండించారు. ఇటీవల నటి జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఏఐ మార్ఫింగ్ వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో శ్రియా శరణ్ ఈ విషయంపై స్పందిస్తూ తన ఆవేదనను షేర్ చేసారు. ఇంటర్నెట్‌లో తన ఫొటోలను కూడా విపరీతంగా మార్ఫింగ్ చేస్తున్నారని, కొన్నిసార్లు ఆ ఫొటోల్లో ఉన్నది నిజంగా తానో కాదో కూడా గుర్తుపట్టలేనంతగా మార్చేస్తున్నారని శ్రియా వ్యాఖ్యానించారు. శరీర భాగాలను, వేసుకున్న దుస్తులను అసభ్యకర రీతిలో ఏఐ ద్వారా రీ-క్రియేట్ చేయడం అత్యంత విచారకరమని అసహనం వ్యక్తం చేశారు.

ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలను కొందరు సరదాగా తీసుకున్నా.. అసలు అనుమతి లేకుండా మహిళల ఫోటోలను ఇలా మార్చడం ఏమాత్రం సరైనది కాదని శ్రియా ఆగ్ర‌హించారు. ఏఐ టెక్నాలజీ వల్ల అనేక ఉపయోగకరమైన రంగాల్లో మేలు జరుగుతున్నా.. దానిని బాధ్యతారహితంగా ఉపయోగించినప్పుడు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు దాపురిస్తాయని హెచ్చరించారు. ప్రతి సాంకేతికతతోనూ ముప్పు ఉంటుందని... సైబర్ యుగంలో ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ సందర్భంగా తన తొలి చిత్రం `ఇష్టం` (2001) రోజుల నాటి పరిస్థితులను శ్రియా గుర్తు చేసుకున్నారు. నాటి కాలంలో సినిమా సెట్స్‌లో క్యారవాన్లు, ఆధునిక సదుపాయాలు లేకపోయినా... నటీనటులు, సాంకేతిక నిపుణులు చెట్ల కింద కూర్చుని కలిసి భోజనం చేస్తూ పుస్తకాలు, సంగీతం, జీవితం గురించి ఆప్యాయంగా మాట్లాడుకునేవారని చెప్పారు. అయితే నేటి కాలంలో టెక్నాలజీ పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఇయర్‌ఫోన్లు పెట్టుకుని తమ సొంత ప్రపంచంలో గడుపుతున్నారని... సినిమా మేకింగ్ తీరు.. వాతావరణం చాలా మారిపోయాయని శ్రీ‌య‌ అభిప్రాయపడ్డారు.

అయితే టెక్నాలజీ దుర్వినియోగం పెరిగినా.. సినీ పరిశ్రమలో కెమెరా వెనుక మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటం శుభపరిణామమని శ్రియా పేర్కొన్నారు. కేవలం వెండితెరపై మహిళా ప్రాధాన్యత ఉన్న కథలను చూపడమే కాకుండా, కెమెరా వెనుక కథనాలను రూపొందించడంలో... ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సహకారం అందించడంలోనూ మహిళా నిర్ణేత‌లు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉన్నా చిత్ర పరిశ్రమలో ఒక ఆశాజనకమైన మార్పు ఇప్పటికే ప్రారంభమైందని శ్రియా శరణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.