ఆన్-స్క్రీన్‌లో తల్లీ-కూతుళ్లు... ఆఫ్-స్క్రీన్‌లో మమ్మీ బడీస్!
`దృశ్యం` హిందీ వెర్షన్ ఫ్రాంచైజీలో అజయ్ దేవ్‌గన్ భార్య నందిని సల్గాంకర్ పాత్రలో శ్రియా శరన్ నటనకు ఎలాంటి ఆదరణ దక్కిందో? తెలిసిందే.
By: Srikanth Kontham | 12 Oct 2026 5:00 PM IST`దృశ్యం` హిందీ వెర్షన్ ఫ్రాంచైజీలో అజయ్ దేవ్‌గన్ భార్య నందిని సల్గాంకర్ పాత్రలో శ్రియా శరన్ నటనకు ఎలాంటి ఆదరణ దక్కిందో? తెలిసిందే. తాజాగా విడుదలైన `దృశ్యం 3` బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న వేళ సినిమాలో శ్రియ ఆన్-స్క్రీన్ కుమార్తె అంజు పాత్ర పోషించిన ఇషితా దత్తాతో ఉన్న వయసు వ్యత్యాసంపై శ్రియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజజీవితంలో తన కంటే 8 సంవత్సరాలు మాత్రమే చిన్నదైన ఇషితాకు తల్లిగా నటించడంపై శ్రియ స్పందించిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తనకంటే ఎనిమిదేళ్లు మాత్రమే చిన్నదైన నటికి తల్లిగా కనిపించడం మొదట్లో తనకు కూడా కాస్త విచిత్రంగానే అనిపించిందన్నారు. `నిజానికి ఆలోచిస్తే ఇందులో ఏమాత్రం లాజిక్ కనిపించదు. నా కూతురిగా నటించిన ఇషితాకు నేను జన్మనివ్వాలంటే? నేను చాలా చిన్నపిల్లనై ఉండాలి` అని నవ్వేసారు. అయితే కథాంశంలో ఉన్న గొప్పదనమే ఇలాంటి చిన్న విషయాలను అధిగమించేలా చేస్తుందని శ్రియా స్పష్టం చేశారు.
సాధారణంగా చిత్ర పరిశ్రమలో మహిళా నటీనటులను త్వరగా టైప్‌కాస్ట్ చేస్తారని, చిన్న వయస్సులోనే తల్లి పాత్రలు కడితే అలాంటి రోల్స్‌కే పరిమితం చేస్తారనే అభిప్రాయం ఉందని శ్రియా పేర్కొన్నారు. అయితే `దృశ్యం` దర్శక, నిర్మాతలు ఏజ్ గ్యాప్‌ను చక్కగా జస్టిఫై చేశారని ప్రశంసించారు. ఫ్రాంచైజీలో ఇషితా పోషించిన అంజు పాత్ర దత్తత తీసుకోబడిన సంతానం అనే కోణాన్ని కథలో ఎంతో సహజంగా, అందంగా చూపించడంతో ఈ లాజిక్ వివాదాలకు తావు లేకుండా పోయిందన్నారు.
ఇద్దరి మధ్య ఉన్న ఆన్-స్క్రీన్ బంధంతో పాటు వ్యక్తిగత అనుబంధం కాలక్రమేణా ఎలా మారిందో శ్రియా గుర్తు చేసుకున్నారు. `మేము `దృశ్యం` మొదటి భాగం షూటింగ్ మొదలుపెట్టినప్పుడు మేమిద్దరం చిన్నపిల్లలమే. `దృశ్యం 2` సమయానికి ఇషితాకు వివాహమైంది. ఆ సమయంలో ఇద్దరం జీవితం, భవిష్యత్తు గురించి చర్చించుకునేవాళ్ళం. ఇక ఈ మూడో భాగానికి వచ్చేసరికి ఇద్దరం మా పిల్లల పెంపకం గురించి మాట్లాడు కుంటున్నాం` అని శ్రియా ఆనందం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఇషితా దత్తా కుమారుడు వాయు, శ్రియా శరన్ కుమార్తె రాధ ఇద్దరి వయసు ఒక్కటే కావడంతో సెట్స్‌లో ఇద్దరి సంభాషణలు ఎక్కువగా పిల్లల క్లాసులు, వారి అలవాట్ల చుట్టూనే సాగుతాయని తెలిపారు. ఇషితా నిజజీవితంలో అద్భుతమైన తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తోందని, ఆన్ స్క్రీన్‌లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ ఇద్దరి మధ్య మంచి అనుబంధం , స్నేహం ఏర్పడిందని శ్రియా కొనియాడారు.
అజయ్ దేవ్‌గన్, శ్రియా శరన్, టబు, ఇషితా దత్తా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన `దృశ్యం 3` బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో విడుదలైన తక్కువ సమయంలోనే దేశీయంగా 300 కోట్ల క్లబ్‌లో చేరడమే కాకుండా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల మైలురాయి వైపు దూసుకుపోతోంది. స్క్రిప్ట్ బలంగా ఉన్నప్పుడు ఏజ్ గ్యాప్ ..పాత్రల పరిమితులు సినిమా విజయానికి ఆటంకం కావని శ్రియా కామెంట్స్ నిరూపిస్తున్నాయి.
