డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో మరో భారీ సినిమా
శ్రీజీ ఎంటర్టైన్మెంట్స్, అభయ్ చరణ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మహాకావ్యానికి సంబంధించిన టైటిల్ ను తాజాగా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు
By: Sravani Lakshmi Srungarapu | 16 Aug 2025 1:23 AM ISTగత కొన్నాళ్లుగా ఇండియన్ సినిమాలో పురాణాలకు, డివోషనల్ కు సంబంధించిన కథలపై ఎక్కువ సినిమాలొస్తున్నాయి. సినిమాలు రావడమే కాదు, వాటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కూడా దక్కుతుంది. అందుకే పురాణాల ఆధారంగా లేదా దేవుడి కథలపై సినిమాలు తీయాలని అందరికీ ఆసక్తి ఏర్పడుతుంది. ఇప్పటికే ఈ నేపథ్యంలో పలు దేవుళ్లపై సినిమాలు రాగా, ఇప్పుడు మరో సినిమా రెడీ అవుతోంది.
ఢిల్లీకి చెందిన ప్రముఖ బోధకుడు జితామిత్ర ప్రభుశ్రీ ఆశీస్సులతో ఓ భారీ సినిమా రూపొందుతుంది. శ్రీజీ ఎంటర్టైన్మెంట్స్, అభయ్ చరణ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మహాకావ్యానికి సంబంధించిన టైటిల్ ను తాజాగా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అనిల్ వ్యాస్ నిర్మిస్తున్నారు.
పాన్ వరల్డ్ మూవీగా..
11-12 శతాబ్దాల కాలం నాటి మహోబా వైభవాన్ని, శ్రీకృష్ణుడి ఆధ్యాత్మికతను, ధీరత్వాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకృష్ణుడిని ఓ యుద్ధ వీరుడిగా చూపిస్తూ వస్తోన్న మొదటి సినిమాగా ఇది చరిత్రకెక్కుతోంది. ఈ సినిమాకు ముకుంద్ పాండే దర్శకత్వం వహిస్తుండగా, దీన్ని భారీ బడ్జెట్ తో ఓ పాన్ వరల్డ్ మూవీగా తీర్చిదిద్దాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
టైటిల్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఓ చిన్న పోస్టర్ ను రిలీజ్ చేయడంతో పాటూ పలు విషయాలను వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమాలో ఎవరెవరు భాగం కానున్నారు? ఏ పాత్రలో ఎవరు కనిపించనున్నారనే విషయాలు కూడా అనౌన్స్ కానున్నాయి. మరి పురాణాల కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రిస్టీజియస్ ప్రాజెక్టు ఆడియన్స్ ను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
