18ఏళ్లకు ఆర్సీబీకి కప్.. ఇప్పుడు నాకు కూడా!: నందు ఎమోషనల్
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ నందు సైక్ సిద్ధార్థ్ మూవీతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 2 Dec 2025 10:30 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో శ్రీ నందు సైక్ సిద్ధార్థ్ మూవీతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాకు వరుణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
డిసెంబర్ 12వ తేదీన సైక్ సిద్ధార్థ్ మూవీ రిలీజ్ కానుండగా.. సూపర్ హిట్ అందుకోవాలని నందు చూస్తున్నారు. సోలో హీరోగా మంచి విజయం సాధించాలని అనుకుంటున్నారు. 18ఏళ్ల కెరీర్ లో ఒక్కసారి కూడా సోలో సక్సెస్ రుచి చూడని ఆయన.. ఇప్పుడు తన జర్నీ గుర్తుకు తెచ్చుకుని ఎమోషనల్ అయ్యారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఏడ్చేశారు.
ముందు వేదికపైకి వచ్చిన ఆయన.. కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తాను అంటే అందరికీ చిన్న చూపు అని చెప్పారు. ఆ తర్వాత చాలా ఎమోషనల్ అయ్యారు. చివరకు స్టేజ్ కూడా దిగిపోయారు. అంతకుముందు ఇదేం పీఆర్ స్టంట్ కాదని వెల్లడించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జరిగిన క్యూ అండ్ ఏ సెషన్ పాల్గొని మాట్లాడారు నందు.
తన సినీ ప్రయాణంలో ఎన్నో మాటలు పడ్డానని చెప్పారు. కానీ ఎప్పుడూ నటుడిగా ఫెయిల్ అవ్వలేదని తెలిపారు. సక్సెస్ రాలేదని చిన్నచూపు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ.. వాళ్లకి కప్ రావడానికి 18 ఏళ్లు పట్టిందని చెప్పారు. ఇప్పుడు తన 18 ఏళ్ల జర్నీ పూర్తి అయిందని అన్నారు.
అందుకే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నానని, ఈసారి విజయం మనదేని చెప్పారు. ఇప్పుడు సైక్ సిద్ధార్థ్ సినిమా చూడండని, ఫస్ట్ ఆఫ్ కొందరికి నచ్చుతుందని తెలిపారు. కానీ సెకండాఫ్ అందరికీ నచ్చుతుందని అన్నారు. ఒకవేళ సినిమా నచ్చకపోతే ప్రెస్ మీట్ పెట్టి మరి క్షమాపణలు చెప్తానని అన్నారు. ఇదేం పొగరుగా చెప్పడం లేదని, చాలా వినయంగా చెప్తున్నానని వెల్లడించారు.
ఈ ఒక్కసారికి ఛాన్స్ ఇవ్వండని, అందరూ థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడండని కోరారు. తన కెరీర్ కు సైక్ సిద్ధార్థ్ బంగారు బాట లాంటి సినిమా అవుతుందని చెప్పారు. తాను ఈరోజు ఎమోషనల్ అయ్యానని, సినిమా చూసిన తర్వాత మీరు ఎమోషనల్ గా తనను హగ్ చేసుకునే రోజు డిసెంబర్ 12వ తేదీ అవుతుందని నమ్ముతున్నానని అన్నారు. మరి నందు ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.
