తెలిసిన కథలే.. కానీ తెలియని పరీక్ష!
అందుకే ప్రస్తుతం బయోపిక్‌ల వైపు అడుగులు వేస్తున్న కొందరు స్టార్ హీరోయిన్లకు ఇది కేవలం మరో సినిమాగా కాకుండా వారి యాక్టింగ్ కు ఎదురయ్యే కొత్త పరీక్షగా మారుతోంది.
By: Sravani Lakshmi Srungarapu | 25 Sept 2026 1:00 AM ISTసినిమాలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ ను పోషించడం వేరు.. నిజ జీవితంలో ప్రేక్షకుల మనసుల్లో ఇప్పటికే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తిని తెరపై ఆవిష్కరించడం వేరు. ముఖ్యంగా బయోపిక్‌ల విషయంలో ఈ తేడా మరింత స్పష్టంగా కనిపిస్తుంది. హీరోయిన్ తనకు అలవాటైన స్టార్ ఇమేజ్‌ను పక్కన పెట్టి, పూర్తిగా మరో వ్యక్తిత్వంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ప్రస్తుతం బయోపిక్‌ల వైపు అడుగులు వేస్తున్న కొందరు స్టార్ హీరోయిన్లకు ఇది కేవలం మరో సినిమాగా కాకుండా వారి యాక్టింగ్ కు ఎదురయ్యే కొత్త పరీక్షగా మారుతోంది.
శ్రద్ధా కపూర్ విఠాబాయి నారాయణ్‌గావ్కర్ క్యారెక్టర్ లో, రష్మిక మందన్న ఎంఎస్ సుబ్బులక్ష్మి క్యారెక్టర్‌లో, కియారా అద్వానీ మీనా కుమారి పాత్రలో కనిపించనుండటం ఆసక్తిని పెంచుతోంది. ఈ ముగ్గురూ ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలతో భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లే. అయితే బయోపిక్‌లో మాత్రం ఆడియన్స్ వారిని వారి పేర్లతో కాకుండా క్యారెక్టర్ పేరుతో గుర్తించాల్సి ఉంటుంది. అదే ఈ సినిమాలకు స్పెషాలిటీతో పాటు సవాలును కూడా తీసుకొస్తోంది.
అయితే నటికి ఎవరికైనా తెలిసిన వ్యక్తిని నటించడం కంటే.. ఆడియన్స్ ఊహల్లో ఉన్న వ్యక్తిని నటించడం చాలా కష్టం. ఎందుకంటే ఆడియన్స్ దగ్గర ఆ వ్యక్తికి సంబంధించిన ఒక ముందస్తు రూపం ఉంటుంది. ఫొటోలు, వీడియోలు, ఇంటర్వ్యూలు, సాంగ్స్, సినిమాలు, పర్సనల్ లైఫ్ కు సంబంధించిన జ్ఞాపకాలు.. ఇలా ఎన్నో విషయాలు కలిసి ఒక ఇమేజ్‌ను తయారు చేస్తాయి. ఆ ఇమేజ్‌కు స్క్రీన్ పై కనిపించే యాక్టింగ్ సరిపోకపోతే క్యారెక్టర్ ను ఎంత స్ట్రాంగ్ గా రాసినా ఆడియన్స్ అంగీకారం పొందడం కష్టమవుతుంది.
అందుకే బయోపిక్‌లో కేవలం లుక్ మార్చడం లేదా మేకప్‌తో పోలిక తీసుకురావడం సరిపోదు. వారి నడక, మాట తీరు, హావభావాలు, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ ను వ్యక్తపరిచే విధానం.. ఇలా ప్రతి అంశంలోనూ ఆ వ్యక్తిత్వాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే రెగ్యులర్ స్టార్ ఇమేజ్ అసలు పరీక్షకు వస్తుంది. స్క్రీన్ పై హీరోయిన్ కనిపించకుండా.. ఆ పాత్ర మాత్రమే కనిపించాలి.
ఇలాంటి క్యారెక్టర్లు గతంలోనూ హీరోయిన్లకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. కీర్తి సురేష్ మహానటిలో సావిత్రిగా కనిపించినప్పుడు ఆడియన్స్ ఆమెను కీర్తిగా కాకుండా సావిత్రి పాత్రలోనే చూడటం ఆ సినిమాకు మెయిన్ స్ట్రెంగ్త్ గా నిలిచింది. అదే కారణంగా బయోపిక్ క్యారెక్టర్లు హీరోయిన్లకు తమ రెగ్యులర్ కమర్షియల్ ఇమేజ్‌కు పూర్తిగా భిన్నమైన యాక్టింగ్ ఛాన్సులను అందిస్తుంటాయి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఈ సినిమాల కథలు ఆడియన్స్ కు పూర్తిగా కొత్తవి కావు. కానీ పరీక్ష మాత్రం కొత్తది. కథ ఏమిటో తెలిసిన ఆడియన్స్ ను, ఆ కథను మరోసారి చూడాలనిపించేలా చేయడమే అసలైన ఛాలెంజ్. గ్లామర్‌తో స్క్రీన్ పై కనిపించడం ఒక ఎత్తయితే, ఒక లెజెండ్‌ను ఆడియన్స్ కళ్లముందు మళ్లీ జీవించేలా చేయడం మరోక ఎత్తు. ఇప్పుడు ఈ ముగ్గురు హీరోయిన్ల ముందున్న అసలు పరీక్ష అదే.
