Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ కేసు నుంచి ఇద్ద‌రు టాప్ హీరోయిన్లు గ్రేట్ ఎస్కేప్!

ఆ ముగ్గురు స్టార్లు నార్కోటిక్స్ అధికారుల ముందుకు హాజ‌ర‌య్యారు. వారి య‌క్ష ప్ర‌శ్న‌లన్నిటికీ స‌మాధానాలిచ్చారు. ఆ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఎన్నో అనుమానాలు సందేహాలు.

By:  Sivaji Kontham   |   26 April 2026 5:00 AM IST
డ్ర‌గ్స్ కేసు నుంచి ఇద్ద‌రు టాప్ హీరోయిన్లు గ్రేట్ ఎస్కేప్!
X

ఆ ముగ్గురు స్టార్లు నార్కోటిక్స్ అధికారుల ముందుకు హాజ‌ర‌య్యారు. వారి య‌క్ష ప్ర‌శ్న‌లన్నిటికీ స‌మాధానాలిచ్చారు. ఆ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఎన్నో అనుమానాలు సందేహాలు. బాలీవుడ్ స్టార్లు చేయ‌ని అరాచ‌కం ఏం ఉంటుందిలే అనుకున్నారు. కానీ నిజం నిప్పులాంటిది.. గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీపై ఉన్న చిన్న చూపు వ‌ల్ల ఏదైనా వార్త వెలువ‌డినప్పుడు నిజా నిజాలు తెలుసుకోకుండా మీడియాలు ఇష్టానుసారం క‌థ‌నాలు అల్లిన‌ప్పుడు వారి వేద‌న అనంత‌మైన‌ది.

కానీ ఇప్పుడు ముగ్గ‌రు సెల‌బ్రిటీలు త‌మ‌పై మోపిన నిరాధార ఆరోప‌ణ‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. డ్ర‌గ్స్ కేసుతో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని నిరూపించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

గ్లామ‌ర్ రంగాన్ని నిరంత‌రం డ్ర‌గ్స్ కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అలా సినీ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసిన 2022 నాటి భారీ డ్రగ్స్ కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు శ్రద్ధా కపూర్, నోరా ఫతేహి.. సోషల్ మీడియా సెలబ్రిటీ ఓరీ పేర్లు ఈ కేసులో ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. సుమారు రూ. 250 కోట్ల విలువైన డ్రగ్స్ నెట్‌వర్క్‌తో వీరికి సంబంధం ఉందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. అయితే తాజాగా ముంబై పోలీసులు ఈ ముగ్గురు స్టార్లకు ఊరటనిస్తూ..ఈ కేసులో వీరిపై ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. దీంతో నిరాధార ఆరోపణల నుంచి వీరు `గ్రేట్ ఎస్కేప్` అయ్యారని చెప్పవచ్చు.

ఈ కేసు విచారణలో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఈ స్టార్లు హాజరై సమాధానాలిచ్చారు. ఆ సమయంలో గ్లామర్ ఇండస్ట్రీపై ఉన్న చిన్నచూపు వల్ల మీడియాలో అనేక కథనాలు అల్లబడ్డాయి. కానీ కేవలం నిందితులు ఇచ్చిన వాంగ్మూలం తప్ప.. క్షేత్రస్థాయిలో వీరిని నేరానికి అనుసంధానించే ఒక్క స్వతంత్ర ఆధారం కూడా లభించలేదు. `నిజం నిప్పులాంటిది` అని నిరూపిస్తూ.. కేవలం ఆరోపణల ఆధారంగా ఎవరినీ దోషులుగా నిర్ధారించలేమని దర్యాప్తు సంస్థ పేర్కొంది.

ముంబై యాంటీ నార్కోటిక్స్ సెల్ (ఏఎన్‌సి) సమాచారం ప్రకారం.. అరెస్టయిన నిందితులు సెలబ్రిటీలు పాల్గొన్న పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేశార‌ని ఆరోప‌ణ‌లు ఎదురైనా కానీ.. దానిని ధృవీకరించే సాంకేతిక ప్రత్యక్ష సాక్ష్యాలు దొరకలేదు. కేవలం నిందితుల స్టేట్‌మెంట్ కోర్టులో చెల్లదని గ్రహించిన పోలీసులు.. సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ నుంచి శ్రద్ధా కపూర్, నోరా ఫతేహి మరియు ఓరీ పేర్లను తొలగించాలని నిర్ణయించారు. దీనివల్ల సాంకేతికంగా వీరికి ఈ కేసులో ‘క్లీన్ చిట్’ లభించినట్లయింది.

ఛార్జ్‌షీట్‌లో కేవలం ఆధారాలు ఉన్న వ్యక్తుల పేర్లను మాత్రమే చేర్చాలని.. నిరాధారంగా సెలబ్రిటీల జీవితాలతో ఆడుకోకూడదని ఏఎన్‌సీ అధికారులు భావిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ సలీం డోలా అనుచరుడు మొహమ్మద్ సోహైల్ షేక్ వంటి వారిపైనే ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించారు. శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ - ఓరీ పేర్లు దర్యాప్తు రికార్డుల్లో ప్రస్తావించినా కానీ.. వారిని నిందితులుగా పరిగణించడం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏవైనా కొత్త ఆధారాలు దొరికితే తప్ప.. ప్రస్తుతానికి వారిపై ఎటువంటి చర్యలు ఉండవు.

ఈ పరిణామంపై నోరా ఫతేహి తన స్టేజ్ వర్క్ .. పబ్లిక్ ఇమేజ్ ద్వారా పరోక్షంగా స్పందిస్తూ.. తనపై వచ్చిన వార్తలను తిప్పికొట్టింది. శ్రద్ధా కపూర్ టీమ్ కూడా అధికారికంగా ఎటువంటి ఛార్జ్‌షీట్ నమోదు కాలేదని స్పష్టం చేసింది. గ్లామర్ ఇండస్ట్రీ వ్యక్తులపై వార్తలు రాయడం చాలా సులువు... కానీ వాస్తవాలు వెలుగులోకి వచ్చినప్పుడు వారి వేదనను కూడా గుర్తించాలని ఈ కేసు మరొకసారి గుర్తు చేసింది. ఏదేమైనా.. రెండేళ్లుగా వెంటాడుతున్న డ్రగ్స్ నీడ నుంచి ఈ ముగ్గురు స్టార్లు బయటపడటం వారి అభిమానులకు పెద్ద ఊరటనిస్తోంది.