8 కిలోల గజ్జెలతో శ్రద్ధా కపూర్ సాహసం.. లావణి నృత్యం అంత కష్టమా?
శ్రద్ధా కపూర్ తన తాజా చిత్రం ‘ఈతా’ కోసం లావణి నృత్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ‘జీ జీ రే జీ’ పాట కోసం ఒక్కో కాలికి 4 కిలోల చొప్పున మొత్తం 8 కిలోల గజ్జెలు కట్టుకుని డ్యాన్స్ చేశారు. షూటింగ్ సమయంలో గాయపడినా చిత్రీకరణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. డిసెంబర్ 4న ఈ సినిమా విడుదల కానుంది.
By: Sivaji Kontham | 19 Nov 2026 10:31 AM ISTతెరపై తనదైన అందం- అభినయంతో మెప్పించే బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్.. ప్రభాస్ `సాహో` చిత్రంతో తెలుగు యువత హృదయాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ సినిమా తర్వాత వరుసగా ప్రయోగాత్మక చిత్రాలతో శ్రద్ధా ఆకట్టుకుంటోంది. హారర్ చిత్రం స్త్రీ2 శ్రద్ధా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. తన తాజా చిత్రం `ఈతా` కోసం తన కంఫర్ట్ జోన్ దాటి భారీ సాహసానికి దిగడం బాలీవుడ్ లో చర్చగా మారింది.
ఈతా సినిమాలోని `జీ జీ రే జీ` అనే ప్రత్యేక లావణి పాట గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో శ్రద్ధా తాను ఎంచుకున్న పాత్ర కోసం ఎంతగా మానసికంగా శారీరకంగా కష్టపడాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఒప్పుకునే సమయానికి తనకు మహారాష్ట్ర సంప్రదాయ నృత్యమైన లావణి గురించి కనీస అవగాహన కూడా లేదని శ్రద్ధా నిజాయితీగా అంగీకరించారు. కేవలం ఒక ఐటెం సాంగ్‌లా కాకుండా ఆ కళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో.. ఎన్నో వర్క్‌షాపులకు హాజరవ్వడంతో పాటు అసలైన తమాషా, లావణి కళాకారులతో కలిసి సమయం గడిపి ఆ సంస్కృతిని ఆకళింపు చేసుకున్నానని తెలిపారు.
ఈ ప్రయాణంలో ప్రముఖ లావణి కళాకారిణి శకుంతలా జీని కలిసి చర్చించాక.. తన ఆలోచనా విధానాన్నే మార్చేసిందని శ్రద్ధా తెలిపారు. కాళ్లకు గజ్జెలు కట్టుకుని అడుగులు వేయడం ఎవరైనా నేర్చుకోవచ్చు కానీ.. తమాషా కళాకారుల జీవితాల్లోని కష్టసుఖాలను ముఖ కవళికల ద్వారా పలికించడమే అసలైన లావణి అని శకుంతలా జీ తనకు దిశానిర్దేశం చేసినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకున్న శ్రద్ధా ప్రాక్టీస్.. షూటింగ్ సమయంలో ఒక్కో కాలికి ఏకంగా 4 కిలోల బరువున్న గజ్జెలు (మొత్తం 8 కిలోలు) కట్టుకుని నృత్యం చేశారు. కీలక పాట చిత్రీకరణలో తాను సెట్లో గాయపడినా కానీ.. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్, నిర్మాత దినేష్ విజన్ అందించిన పూర్తి సహకారంతో తన షూటింగ్ పూర్తి చేశానని తెలిపారు.
శ్రద్ధా కపూర్ తెరవెనుక పడిన ఆ కష్టం `జీ జీ రే జీ` పాటలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పాట అంతర్జాలంలోకి రిలీజైనప్పటినుంచి ఇందులో శ్రద్ధా హావభావాలు.. స్టేజ్ ప్రజెన్స్.. గ్రేస్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైభవి మర్చంట్ కొరియోగ్రఫీ అందించిన ఈ గీతానికి జాతీయ అవార్డు గ్రహీతలైన అజయ్-అతుల్ ద్వయం సంగీతం అందించగా.. అమితాబ్ భట్టాచార్య సాహిత్యం సమకూర్చారు. శ్రేయా ఘోషల్ తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు.
దినేష్ విజన్, లక్ష్మణ్ ఉటేకర్, కరిష్మా శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న `ఈతా` చిత్రం శ్రద్ధా కపూర్ కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడిన పాత్రగా నిలవనుంది. వరుస ప్రమోషన్లతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. శ్రద్ధా కపూర్ సరికొత్త అవతారాన్ని పూర్తిస్థాయిలో చూడాలంటే డిసెంబర్ 4 రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
