Begin typing your search above and press return to search.

షోలే ఫ్లాప్ ప్రచారం వెనుక అసలు నిజం!

అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ప్రధాన పాత్రల్లో రమేష్ సిప్పి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద అప్ప‌ట్లోనే 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.

By:  Srikanth Kontham   |   24 Aug 2026 7:00 AM IST
షోలే ఫ్లాప్ ప్రచారం వెనుక అసలు నిజం!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో `షోలే` ఓ చారిత్రాత్మక మైలురాయి. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ప్రధాన పాత్రల్లో రమేష్ సిప్పి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద అప్ప‌ట్లోనే 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. సలీమ్-జావెద్ రాసిన మాటలు, గబ్బర్ సింగ్ పాత్ర, జై-వీరుల స్నేహం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయినా? ఈ చిత్రం విడుదలైన తొలి రోజుల్లో ఫ్లాప్ అని ప్రచారం జరగడం సినీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది.

ఈ చిత్రం పట్ల ఆనాడు వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం భారీ బడ్జెట్. అనుకున్న దానికంటే వ్యయం విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమని దర్శకుడు రమేష్ సిప్పి తెలిపారు. మొదట్లో 1 కోటితో తెరకెక్కిం చాలనుకున్న సినిమా బడ్జెట్ 3 కోట్లకు చేరుకుంది. ఆ కాలంలో 1 కోటి అంటే 100 కోట్లతో సమానం కాబట్టి భారీ పెట్టుబడిని నిర్మాతలు తిరిగి రాబట్టలేరని కొందరు భావించారన్నారు.

సినిమా విడుదలైన తొలి వారాల్లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్పందన రాకపోవడంతో పత్రికలు ..ట్రేడ్ పండితులు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైందని ప్రకటించాయి. ఇంతపెద్ద మొత్తంలో ఖర్చు పెడితే చిత్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడుతుందని, భవిష్యత్తులో ఇలాంటి భారీ చిత్రాలు తీయడం పరిశ్రమను ముంచేస్తుందని ఆనాడు కొందరు విమర్శించారు. అయితే ఈ వార్తలు పుకార్లకే పరిమితం కాలేదు. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసాయ‌న్నారు.

సినిమాకు వచ్చిన తాత్కాలిక తిరస్కరణను చూసి పరిశ్రమలోని కొన్ని వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఇలాంటి భారీ సినిమాలు విఫలమవడం మంచిదేనని కొందరు వ్యాఖ్యానించినట్లు రమేష్ సిప్పి గుర్తు చేసుకున్నారు. అయితే ఈ నిరాశ ఎక్కువ రోజులు నిలవలేదు. సరిగ్గా ఐదు వారాల గడిచేసరికి సినిమా కలెక్షన్లు అద్భుతంగా పుంజు కోవడంతో విమర్శకులు మాటలను వెనక్కి తీసుకుని ఇది అసాధారణ విజయమని అంగీకరించాల్సి వచ్చింది.

బాక్సాఫీస్ ఫలితాలతో పాటు సెన్సార్ బోర్డు అడ్డంకులను కూడా ఈ చిత్రం ఎదుర్కొంది. ఎమర్జెన్సీ కాలం కావడంతో నిబంధనల పేరుతో సెన్సార్ బోర్డు ఒత్తిడి మేరకు దర్శకుడు క్లైమాక్స్ మార్చాల్సి వచ్చింది. పోలీసు అధికారైన సంజీవ్ కుమార్ చట్టాన్ని చేతిలోకి తీసుకుని విలన్‌ను చంపడం సరికాదనే వాదనతో గబ్బర్‌ను పోలీసులకు అప్పగించేలా క్లైమాక్స్ రీషూట్ చేయవలసి వచ్చింది. దీంతో బెంగళూరుకు తిరిగి వెళ్లి మరోసారి ముగింపు సన్నివేశాన్ని చిత్రీకరించారు.

ఆ విధంగా అనేక ఆటుపోట్లను, విమర్శలను ఎదుర్కొన్న `షోలే` కాలక్రమేణా భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే బ్లాక్‌బస్టర్‌గా అవతరించింది. విడుదలైన దశాబ్దాల తర్వాత కూడా ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల కాలంలో దర్శకుడు రమేష్ సిప్పి తలపెట్టిన ఒరిజినల్ క్లైమాక్స్‌తో కూడిన `షోలే: ఫైనల్ కట్` రీ-రిలీజ్ వెర్షన్‌కు కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం చిత్ర అద్భుత ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచింది.