Begin typing your search above and press return to search.

పెద్ది కోసం సీనియ‌ర్ న‌టిని రంగంలోకి దింపిన బుచ్చి

మొద‌టి నుంచి పెద్ది సినిమా విష‌యంలో చాలా క్లారిటీగా ఉన్న బుచ్చిబాబు, ఈ సినిమాకు సంబంధించి ఏ విష‌యంలోనూ కాంప్ర‌మైజ్ అవ‌కుండా దాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   11 Nov 2025 4:45 PM IST
పెద్ది కోసం సీనియ‌ర్ న‌టిని రంగంలోకి దింపిన బుచ్చి
X

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న భారీ బ‌డ్జెట్ సినిమా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను బుచ్చిబాబు చాలా భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు.

ఏ విష‌యంలోనూ కాంప్ర‌మైజ్ కాకుండా..

మొద‌టి నుంచి పెద్ది సినిమా విష‌యంలో చాలా క్లారిటీగా ఉన్న బుచ్చిబాబు, ఈ సినిమాకు సంబంధించి ఏ విష‌యంలోనూ కాంప్ర‌మైజ్ అవ‌కుండా దాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అందులో భాగంగానే హీరోయిన్ కోసం బాలీవుడ్ నుంచి జాన్వీ క‌పూర్ ను రంగంలోకి దింపిన బుచ్చిబాబు, కీల‌క పాత్ర కోసం క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి శివ రాజ్‌కుమార్ ను తీసుకున్నారు.

పెద్దిలో శోభ‌న కీల‌క పాత్ర‌

వారితో పాటూ దివ్యేందు శ‌ర్మ‌, జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా కోసం బుచ్చిబాబు ఇప్పుడు మ‌రో స్టార్ ను సెలెక్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. పెద్ది సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం సీనియ‌ర్ న‌టి శోభ‌న‌ను తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో శోభ‌న క్యారెక్ట‌ర్ చాలా ఎమోష‌న‌ల్ గా ఉంటుంద‌ని స‌మాచారం. గ‌తంలో శోభ‌న‌, మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ప‌లు సినిమాల్లో న‌టించారు.

అప్ప‌ట్లో చిరూతో.. ఇప్పుడు చ‌ర‌ణ్ తో క‌లిసి..

అప్ప‌ట్లో చిరంజీవి- శోభ‌న ది చాలా స‌క్సెస్‌ఫుల్ పెయిర్. వారిద్ద‌రూ క‌లిసి రుద్ర‌వీణ‌, రౌడీ అల్లుడు సినిమాల్లో న‌టించారు. అలాంటి శోభ‌న, ఇప్పుడు చిరంజీవి కొడుకు రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అయితే ఈ క్యారెక్ట‌ర్ కోసం బుచ్చిబాబు శోభ‌న‌ను అంత ఈజీగా సెలెక్ట్ చేయ‌లేద‌ట‌. గ‌తంలో చిరంజీవితో క‌లిసి న‌టించిన హీరోయిన్ల లిస్ట్ ను రెడీ చేసుకుని వాటిలో ఆఖ‌రిగా శోభ‌న‌ను సెలెక్ట్ చేశార‌ని తెలుస్తోంది. మొత్తానికి చాలా కాలం త‌ర్వాత శోభ‌న మ‌ళ్లీ తెలుగు సినిమాలో క‌నిపించ‌నున్నార‌న్న‌మాట‌. గ‌తంలో శోభ‌నకు ప‌లు సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆమె వాటిని రిజెక్ట్ చేసి ఇప్పుడు పెద్దితో కంబ్యాక్ ఇవ్వ‌బోతున్నారు. ఏదేమైనా బుచ్చి బాబు పెద్ది క్యాస్టింగ్ తోనే హైప్ ను విప‌రీతంగా పెంచేస్తున్నారు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న పెద్ది మూవీ వ‌చ్చే ఏడాది మార్చి 27న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.