సానియా మిర్జా మాజీ భర్తకు నాలుగో పెళ్లి?
పాకిస్థాన్ మాజీ క్రికెటర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్ మరోసారి వార్తల్లో నిలిచారు.
By: Sivaji Kontham | 27 Feb 2026 6:23 PM ISTపాకిస్థాన్ మాజీ క్రికెటర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈసారి కూడా ఆయన ఒక పాకిస్థానీ నటినే వివాహం చేసుకోబోతున్నారని.. ఆ నటి మరెవరో కాదు లైబా ఖాన్ అంటూ సోషల్ మీడియాల్లో కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఈ వార్త దావాగ్నిలా వ్యాపించడంతో అభిమానుల్లో, నెటిజన్లలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
అయితే ఈ వైరల్ వార్తల వెనుక ఉన్న అసలు నిజాన్ని పరిశీలిస్తే.. ఇవన్నీ కేవలం అబద్ధపు ప్రచారాలనడానికి కొన్ని ఆధారాలు లభించాయి. గతంలో లైబా ఖాన్ - షోయబ్ మాలిక్ మధ్య ఏదో సంబంధం ఉందనే కొన్ని పాత గాసిప్స్ ఆధారంగా ఇప్పుడు ఈ పెళ్లి పుకార్లు పుట్టుకొచ్చాయి. నిజానికి ఈ పెళ్లి వార్తలకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ఎటువంటి ఆధారాలు లేదా నమ్మదగిన రిపోర్టులు కూడా లేవని తేలింది.
నిజానికి నటి లైబా ఖాన్ వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే ఈ పుకార్లకు తావే లేదు. ఎందుకంటే లైబా ఖాన్‌కు ఇప్పటికే వివాహం జరిగింది. ఆమె జనవరి 2026లో వ్యాపారవేత్త జవాద్‌ను మదీనాలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుకలు పాకిస్థాన్‌లో చాలా అట్టహాసంగా జరిగాయి. లైబా ఖాన్ తన పెళ్లి ఫోటోలను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ కూడా చేశారు. తద్వారా షోయబ్ మాలిక్‌తో ఆమెకు పెళ్లి అనే వార్త పూర్తిగా నిరాధారమని రుజువైంది.
మరోవైపు షోయబ్ మాలిక్ ప్రస్తుత వైవాహిక జీవితం కూడా సజావుగానే సాగుతోంది. ఆయన ప్రస్తుతం పాకిస్థానీ నటి సనా జావేద్‌తో వివాహ బంధంలో ఉన్నారు. వీరిద్దరూ జనవరి 2024లో వివాహం చేసుకోగా, ఇటీవల తమ వివాహ వార్షికోత్సవాన్ని కూడా ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. వీరిద్దరూ విడిపోతున్నారనే ఎటువంటి అధికారిక సమాచారం గానీ, సంకేతాలు గానీ లేవు. తన మూడవ భార్య సనా జావేద్‌తో షోయబ్ ప్రస్తుతం సుఖంగా ఉన్నారని సన్నిహిత వర్గాల సమాచారం.
షోయబ్ మాలిక్‌కు గతంలో మూడు వివాహాలు జరగడం వల్లే ఇటువంటి పుకార్లకు బలం చేకూరుతోంది. సానియా మీర్జాతో పెళ్లికి ముందే అయేషా సిద్ధిఖీ అనే మహిళతో మాలిక్‌కు వివాహం జరిగిన విషయం 2010లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత సానియా మీర్జాతో దాదాపు 13 ఏళ్ల వైవాహిక జీవితం గడిపిన షోయబ్, తన వివాహేతర సంబంధాల కారణంగా తలెత్తిన వివాదాల వల్ల 2023లో ఆమె నుంచి ఖులా (విడాకులు) తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం వస్తున్న నాలుగో పెళ్లి వార్తలను నమ్మాల్సిన అవసరం లేదని, అవి కేవలం సోషల్ మీడియా సృష్టించిన పుకార్లు మాత్రమేనని తాజా ఆధారాలు నిరూపిస్తున్నాయి.
